Bigg Boss Rathika Elimination: ప్రతీదానికి అలా చేయొద్దు: ఎలిమినేట్ అయిన రతికకు శివాజీ సూచనలు
Bigg Boss Rathika - Sivaji: బిగ్‍బాస్ నుంచి రతిక రోజ్ కూడా ఎలిమినేట్ అయ్యారు. తొలుత బయటికి వెళ్లి మళ్లీ వచ్చినా.. రెండోసారి కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. కాగా, ఎలిమినేషన్ తర్వాత రతికకు శివాజీ కొన్ని సూక్తులు చెప్పారు.
Bigg Boss Rathika - Sivaji: బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ 12వ వారంలో నిజంగానే డబుల్ ఎలిమినేషన్ జరిగింది. శనివారం అశ్వినీ శ్రీ హౌస్ నుంచి బయిటికి వెళ్లగా.. ఆదివారం ఎపిసోడ్‍లో రతిక రోజ్ ఎలిమినేట్ అయ్యారు. ఈ సీజన్‍లో ఒకసారి ఎలిమినేటై ఇంకోసారి రతిక హౌస్‍లో వచ్చారు. అయితే, రెండోసారి వచ్చిన అవకాశాన్ని కూడా సరిగా వినియోగించుకోలేక రతిక మళ్లీ ఎలిమినేట్ అయ్యారు.
ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియలో రతిక, అర్జున్ డేంజర్ జోన్‍లో నిలిచారు. అయితే, ఎలిమినేట్ కాకుండా ఉండేందుకు తన కోసం ఎవిక్షన్ పాస్ ఉపయోగించాలని పల్లవి ప్రశాంత్‍ను రతిక కోరారు. అయితే, ఇందుకు ప్రశాంత్ అంగీకరించలేదు. దీంతో రతిక ఎలిమినేట్ అయినట్టు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. దీంతో రతిక బాధ పడ్డారు.
ఎలిమినేట్ అయిన రతికను శివాజీ ఓదార్చారు. జీవితంలో ప్రతీ విషయానికి ఏడ్వడం లాంటివి చేయవద్దని శివాజీ చెప్పారు. రతికను కౌగిలించుకొని ఆయన సముదాయించారు. “స్ట్రాంగ్‍గా ఉండు. ఊరికే ప్రతీదానికి ఏడ్వడం, ప్రతీదానికి బ్రతిమిలాడుకోవడం, భయపడడం జీవితంలో చేయకు. అర్థమైందా. లైఫ్ ఏదీ కూడా అంత ఈజీగా రాదు” అని రతికకు సూచనలు చేశారు శివాజీ.
బిగ్‍బాస్ స్టేజీపైకి వచ్చాక పాట పాడాలని రతికను నాగార్జున అడిగారు. దీంతో ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ అంటూ పాట పాడారు రతిక. శివాజీ కూడా కాస్త గొంతు కలిపారు. రతిక కోసం పల్లవి ప్రశాంత్ ఓ చిన్న కవిత లాంటిది చెప్పారు. వర్షం పడేటప్పుడు మట్టి వాసన ఎంత స్వచ్ఛంగా ఉంటుందో.. రతిక గురించి తాను మాట్లాడే మాటలు అంతే నిజాయితీతో ఉంటాయని ప్రశాంత్ అన్నారు.
బిగ్‍బాస్ తొలి వారంలో పల్లవి ప్రశాంత్, రతిక మధ్య ఓ చిన్న లవ్ ట్రాక్ లాంటిది నడిచింది. అయితే, ఆ తర్వాత ఇద్దరూ గొడవ పడ్డారు. ఇప్పటి నుంచి రతికను అక్క.. అక్క అంటూ ప్రశాంత్ పిలుస్తున్నారు. రెండోసారి ఎలిమినేట్ అయిపోతున్నప్పుడు కూడా రతికను అక్క అనే సంబోధించారు ప్రశాంత్. ఎవిక్షన్ పాస్ నీ కోసం వాడనందుకు సారీ అక్కా అని రతికతో ప్రశాంత్ అన్నారు.