Sai Pallavi: సాయిపల్లవి కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. పండుగకు వస్తున్న మూవీ-sai pallavi sivakarthikeyan amaran movie release date confirmed officially ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sai Pallavi: సాయిపల్లవి కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. పండుగకు వస్తున్న మూవీ

Sai Pallavi: సాయిపల్లవి కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. పండుగకు వస్తున్న మూవీ

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 17, 2024 05:51 PM IST

Sai Pallavi - Amaran movie: అమరన్ సినిమా రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ మూవీలో సాయిపల్లవి హీరోయిన్‍గా నటించారు. సుమారు రెండేళ్ల తర్వాత ఆమె వెండితెరపై కనిపించనున్నారు.

Sai Pallavi: సాయిపల్లవి కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. పండుగకు వస్తున్న మూవీ
Sai Pallavi: సాయిపల్లవి కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. పండుగకు వస్తున్న మూవీ

లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి సినిమాల నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకున్నారు. 2022లో వచ్చిన గార్గి తర్వాత ఆమె నటించిన ఏ చిత్రం కూడా రిలీజ్ కాలేదు. అయితే ప్రస్తుతం ఆమె వరుసగా సినిమాలు చేస్తున్నారు. సాయిపల్లవి లైనప్‍లో నాలుగు చిత్రాలు ఉన్నాయి. అయితే, సాయిపల్లవిని మళ్లీ వెండితెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు వేచిచూస్తున్నారు. ఈ తరుణంలో తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషించిన అమరన్ మూవీ రిలీజ్‍కు రెడీ అయింది. దీంతో రెండేళ్ల గ్యాప్ తర్వాత సిల్వర్ స్క్రీన్‍పై సాయిపల్లవి కనిపించనున్నారు. అమరన్ రిలీజ్ డేట్‍ను మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది.

విడుదల తేదీ ఇదే..

అమరన్ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (జూలై 17) అధికారికంగా వెల్లడించింది. ఈ దీపావళి పండుగకు ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నామంటూ వెల్లడించింది. తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలోనూ విడుదల కానుంది.

అక్టోబర్ 31న అమరన్ రిలీజ్ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఆ పోస్టర్లో శివకార్తికేయన్ ముఖం, చేతులపై రక్తం ఛారలు ఉన్నాయి. బ్యాక్‍గ్రౌండ్‍లో జాతీయ పతాకం ఉంది. ఈ పోస్టర్ ఇంటెన్స్‌గా ఉంది.

బయోగ్రఫీ మూవీగా..

అమరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితంపై అమరన్ చిత్రం రూపొందుతోంది. ముకుంద్ పాత్రను శివకార్తికేయన్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రాజ్‍కుమార్ పళనిసామి దర్శకత్వం వహిస్తున్నారు. బయోగ్రఫీ వార్ యాక్షన్ చిత్రంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. రచయితలు శివ్ అరూర్, రాహుల్ సింగ్ రచించిన ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్ పుస్తకంలోని ఓ చాప్టర్ ఆధారంగా ఈ మూవీని డైరెక్టర్ రూపొందిస్తున్నారు.

మేజర్ ముకుంద్ భార్య ఇందు రెబకా వర్గీస్ పాత్రను ఈ చిత్రంలో పోషించారు సాయిపల్లవి. భువన్ అరోరా, రాహుల్ బోస్, లల్లు, శ్రీకుమార్, హరున్ బార్వా, లడా సింగ్, వికాస్ బంగార్ కూడా ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.

నిర్మాతగా కమల్ హాసన్

అమరన్ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా కూడా నిర్మాణంలో భాగస్వామ్యమైంది. ఈ మూవీ పూజా కార్యక్రమాలకు కూడా కమల్ హాసన్ హాజరయ్యారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

సాయిపల్లవి లైనప్

అమరన్ చిత్రం కోసం సాయిపల్లవి తన షూటింగ్ పూర్తి చేసుకున్నారని తెలుస్తోంది. యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ మూవీలో సాయిపల్లవి హీరోయిన్‍గా చేస్తున్నారు. ఈ చిత్రం కూడా యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతోంది. చందూ మొండేటీ దర్శకత్వం వహిస్తున్న తండేల్ మూవీని ఈ ఏడాది డిసెంబర్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నితేశ్ తివారీ దర్శకత్వంలో రామాయణం మూవీలో సాయిపల్లవి సీతాదేవిగా నటిస్తున్నారు. ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‍తోనూ మరో చిత్రం చేస్తున్నారు సాయిపల్లవి.

Whats_app_banner