Sai Pallavi : దేవత దర్శనం: సాయిపల్లవి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ: ట్వీట్ల వెల్లువ
Sai Pallavi Thandel Glimpse: తండేల్ మూవీ గ్లింప్స్ వచ్చేసింది. ఈ చిత్రంలో నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా గ్లింప్స్.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
Sai Pallavi Thandel Glimpse: అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన తండేల్ సినిమా తొలి గ్లింప్స్ నేడు (జనవరి 6) వచ్చేసింది. ఒకరోజు ఆలస్యంగా ఈ గ్లింప్స్ రిలీజ్ అయింది. యువ సామ్రాట్ నాగ చైతన్య.. మత్స్యకారుడి పాత్ర పోషిస్తుండడం, యథార్థ ఘటన ఆధారంగా తెరకెక్కుతుండటంతో చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న తండేల్‍పై చాలా క్రేజ్ ఉంది. దేశభక్తి, లవ్ స్టోరీ ప్రధాన అంశాలుగా ఉన్న తండేల్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే, సాయి పల్లవి అభిమానులు మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
స్టార్ హీరోయిన్ సాయి పల్లవికి క్రేజ్ చాలా ఉంటుంది. ఆమెను లేడీ పవర్ స్టార్ అని అభిమానులు పిలుస్తుంటారు. సాయి పల్లవి అందం, నటన, సహజత్వం సహా చాలా అంశాలను ఫ్యాన్స్ ఎంతగానో ఇష్టపడతారు. అందుకే ఆమె మూవీలో ఉంటే సినిమాలో కచ్చితంగా విషయం ఉంటుందని నమ్ముతారు. తెలుగులో చివరగా 2022లో విరాట్ పర్వం సినిమా చేశారు సాయి పల్లవి. ఆ తర్వాత గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ రెండేళ్ల తర్వాత తండేల్ మూవీ చేస్తున్నారు. తండేల్ గ్లింప్స్ చివర్లో కొన్ని సెకన్ల పాటు సాయిపల్లవి కనిపించారు. ఆమె నవ్వు, స్క్రీన్ ప్రెజన్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. దీంతో ఆమె అభిమానులు ఫుల్ హ్యాపీ అవుతున్నారు.
చాలా రోజుల తర్వాత దేవత దర్శనం అయిందని చాలా మంది సాయిపల్లవిని ఉద్దేశిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. తండేల్ గ్లింప్స్‌లో సాయిపల్లవి ఉన్న సీన్ వీడియోను షేర్ చేస్తూ ఫుల్ ఖుషి అవుతున్నారు. ముఖ్యంగా సాయిపల్లవి నవ్వుపై మరోసారి ప్రశంసలు కురిపిస్తున్నారు. “ఏం స్మైల్ రా బాబు.. మైండ్‍లో నుంచి పోవడం లేదు. ఆమెకు అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది” అని ఓ యూజర్ కామెంట్ చేశారు.
సముద్రం ఒడ్డున సూర్యోదయం సమయంలో సాయిపల్లవి వేచిచూస్తున్నట్టుగా ఈ గ్లింప్స్‌లో ఉంది. ‘బుజ్జితల్లి వచ్చేస్తున్నా కదే.. కొంచెం నవ్వే’ అంటూ నాగచైతన్య వాయిస్ ఓవర్ ఉంది. ఆ తర్వాత సాయిపల్లవి స్మైల్ ఉంది. ఈ గ్లింప్స్‌లో దేవీ శ్రీప్రసాద్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍ను కూడా నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. తండేల్ గ్లింప్స్‌లో సాయిపల్లవి అద్భుతంగా ఉండడంపై ట్వీట్ల వెల్లువ వస్తోంది.
పాకిస్థాన్ జైలులో సుమారు 13 నెలల పాటు చాలా కష్టాలను అనుభవించి స్వదేశానికి తిరిగి వచ్చిన 22 మంది శ్రీకాకుళం, విజయనగరం మత్య్సకారుల యథార్ధ ఘటన ఆధారంగా తండేల్ రూపొందుతోంది. మత్య్సకారుడు రాజుగా ఈ చిత్రంలో నాగచైతన్య నటిస్తున్నారు. రాజు ప్రేమికురాలిగా సాయిపల్లవి నటిస్తున్నారు.
తండేల్ గ్లింప్స్‌లో నాగచైతన్య లుగ్, డైలాగ్స్ అదిరిపోయాయి. చైతూ ఇంట్రడక్షనే అద్భుతంగా అనిపించింది. శ్రీకాకుళం యాసలో డైలాగ్ డెలివరీ బాగుంది. “మా నుంచి ఊడిపోయిన ఓ ముక్క.. మీకే అంత ఉంటే.. ఆ ముక్కను ముష్టి వేసిన మాకెంత ఉండాలి. నీ పాకిస్థాన్ అడ్డాలో కూర్చొని చెబుతున్నా.. భారత్ మాతా కీ జై” అంటూ పాక్ జైలులో ఉన్నప్పుడు నాగచైతన్య చెప్పే డైలాగ్ అదిరిపోయింది. దేశభక్తి, ప్రేమకథతో ఉండనున్న తండేల్ మాత్రం నాగచైతన్య కెరీర్లో మైలురాయిగా నిలిచేలా కనిపిస్తోంది.
తండేల్ చిత్రాన్ని గీతాఆర్ట్ పతాకంపై బన్నీ వాస్ భారీ బడ్జెట్‍తో నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. దేవీ శ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ మొదలైంది.