Rudrangi OTT Streaming: మరో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చిన జగపతి బాబు ‘రుద్రంగి’ చిత్రం
Rudrangi OTT Streaming: జగపతి బాబు హీరోగా నటించిన రుద్రంగి చిత్రం మరో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం.. రెండు ఓటీటీల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
Rudrangi OTT Streaming: సీనియర్ నటుడు జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించిన రుద్రంగి సినిమా జూలైలో థియేటర్లలో రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. తెలంగాణ నేపథ్యంలో వాస్తవ ఘటన ఆధారంగా పీరియాడిక్ చిత్రంగా రుద్రంగి తెరకెక్కింది. ఈ చిత్రానికి అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 1వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు ఈ సినిమా వచ్చింది. అయితే, ఇప్పుడు మరో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రుద్రంగి చిత్రం అడుగుపెట్టింది. ఆ వివరాలివే..
రుద్రంగి సినిమా నేడు (సెప్టెంబర్ 1) ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. ఆహాలోకి ఈ సినిమా సైలెంట్‍గా అడుగుపెట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన సరిగ్గా నెల తర్వాత ఆహా ప్లాట్‍ఫామ్‍లోనూ రుద్రంగి స్ట్రీమింగ్‍కు వచ్చింది. ప్రైమ్ వీడియోలో రుద్రంగి చిత్రం తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళ భాషల్లోనూ స్ట్రీమ్ అవుతోంది. ఆహాలో రుద్రంగి.. తెలుగులో అందుబాటులో ఉంది. మొత్తంగా రెండు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో రుద్రంగి సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
రుద్రంగి చిత్రంలో జగపతిబాబు, విమలా రామన్, మమతా మోహన్ దాస్, అశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్ కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాతోనే దర్శకుడిగా అజయ్ సామ్రాట్ పరిచయం అయ్యారు. రసమయి ఫిల్మ్స్ పతాకంపై ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నవాల్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించగా.. సంతోశ్ షనామొని సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.
1940 దశకం బ్యాక్‍డ్రాప్‍లో రుద్రంగి చిత్రం సాగుతుంది. ఈ సినిమాలో భీమ్ రావు పాత్ర పోషించిన జగపతి బాబు అద్భుతంగా నటించారు. మీరాబాయిగా విమలా రామన్, జ్వాలా భాయ్‍గా మమతా మోహన్‍దాస్ నటన ఆకట్టుకుంటుంది.