Vyuham Teaser: వైఎస్ఆర్ మరణం నుంచి జగన్ సీఎం అయ్యే వరకు!: ఆర్జీవీ ‘వ్యూహం’ టీజర్‌లో హైలైట్స్ ఇవే
Vyuham Teaser: ఆర్జీవీ దర్శకత్వం వహిస్తున్న వ్యూహం సినిమా టీజర్ వచ్చేసింది. 2009 నుంచి 2019 మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగిన ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించాడు ఆర్జీవీ.
Vyuham Teaser: సంచలన దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ (RGV).. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మరో సినీ అస్త్రాన్ని వదులుతున్నాడు. ‘వ్యూహం’ పేరుతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. 2009 నుంచి 2019 మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగిన ఘటనల ఆధారంగా వ్యూహం సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఆర్జీవీ. ఈ వ్యూహం మూవీ టీజర్‌ను నేడు (జూన్ 24) విడుదల చేశాడు డైరెక్టర్ ఆర్జీవీ. సినిమాలో ఏ అంశాలు ఉండనున్నాయో ఈ టీజర్‌లో పూర్తిగా స్పష్టం చేశాడు. వ్యూహం సినిమాలో వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి పాత్రలో రంగం ఫేమ్ అజ్మల్ నటించాడు. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి (వైఎస్ఆర్) మరణం నుంచి 2019లో వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి సీఎం అయ్యే వరకు జరిగిన చాలా విషయాలను ఈ టీజర్‌లో చూపించాడు ఆర్జీవీ. వ్యూహం టీజర్ వివరాలు ఇవే.
వ్యూహం టీజర్ మొత్తంగా 2 నిమిషాల 45 సెకన్ల నిడివి ఉంది. టీజర్ ప్రారంభంలో.. 2009 సెప్టెంబర్ 2వ తేదీన అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు ప్రమాదం జరిగిన సీన్ ఉంది. ఆ తర్వాత వైఎస్ఆర్ మరణ వార్తను తెలుసుకొని వైఎస్ జగన్ సహా ఆయన కుటుంబం రోదించిన దృశ్యాలు ఉన్నాయి. ఆ తర్వాత చంద్రబాబు పాత్ర ఓ సీన్‍లో కనిపిస్తుంది. వైఎస్ఆర్ మరణం తర్వాత ఏపీ సీఎం పదవి చేపట్టిన రోశయ్య.. జగన్‍ను కలిసినట్టుగా చూపించాడు ఆర్జీవీ. ఆ తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ జగన్‍ను బెదిరించిందన్నట్టు ఓ సీన్ ఉంది. అనంతరం వైఎస్ జగన్ అరెస్ట్ అయిన సీన్ ఉంది. జైలు నుంచి విడుదల తర్వాత సన్నిహితులతో జగన్ చర్చలు జరుపుతున్నట్టు ఉంది. 2019 ఎన్నికల్లో విజయం సాధించాక జగన్‍కు వైఎస్ భారతి షేక్ హ్యండ్ ఇచ్చినట్టు టీజర్‌లో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు జగన్ అభివాదం చేసిన సీన్ కూడా ఉంది. చివర్లో “అలా ఆలోచించడానికి నేను చంద్రబాబును కాదు” అని జగన్ పాత్రధారి చెప్పే డైలాగ్‍తో వ్యూహం టీజర్ ముగిసింది. ఈ మూవీ అతిత్వరలో విడుదలవుతుందని ఆర్జీవీ పేర్కొన్నాడు.
2024 ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా వస్తుండడంతో ఆసక్తి నెలకొంది. ఏపీ రాజకీయాలపై ప్రభావం ఉంటుందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. వ్యూహం సినిమా తర్వాత దీనికి కొనసాగింపుగా శపథం చిత్రం కూడా చేస్తానని ఇప్పటికే ఆర్జీవీ ప్రకటించాడు. 2019 తర్వాత రాజకీయ పరిస్థితులను ఆ చిత్రంలో చూపిస్తానని అన్నాడు.
వ్యూహం మూవీలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటిస్తుండగా.. జగన్ భార్య వైఎస్ భారతి పాత్రను మానస పోషిస్తోంది. రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.