Ram Movie Review: రామ్ రివ్యూ - రిపబ్లిక్ డే రోజు రిలీజైన దేశభక్తి మూవీ ఎలా ఉందంటే?
Ram Movie Review: సూర్య, ధన్యాబాలకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించిన రామ్ మూవీ ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు మిహిరాం దర్శకత్వం వహించాడు.
Ram Movie Review: సూర్య, ధన్యాబాలకృష్ణ, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన రామ్ మూవీ ఈ శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. దేశభక్తి ప్రధానంగా రూపొందిన ఈ సినిమాకు మిహిరాం దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఎలా ఉందంటే?
దేశం కోసం రామ్ పోరాటం...
మేజర్ సూర్య ప్రకాష్ (రోహిత్) దేశం కోసం పోరాడుతూ కన్నుమూస్తాడు. తన కొడుకు రామ్‌ను కూడా డిఫెన్స్‌లోకి తీసుకురావాలన్నది సూర్య ప్రకాష్ కల. రామ్ (సూర్య అయ్యలసోమయాజుల) మాత్రం తండ్రి ఆశయాలతో సంబంధం లేకుండా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. అలాంటి రామ్ జీవితంలోకి జాహ్నవి (ధన్యా బాలకృష్ణ) వస్తుంది. ఏ డిపార్ట్‌మెంట్‌లో ఉండి తండ్రి ప్రాణాలు కోల్పోయాడో.. జాహ్నవి ప్రేమ వల్ల అదే డిపార్ట్మెంట్‌లోకి రామ్ వెళ్లాల్సి వస్తుంది.
అసలు రామ్ తండ్రి సూర్య ప్రకాష్ చేపట్టిన మిషన్ ఏంటి? హెచ్ ఐ డీ (హిందుస్తాన్ ఇంట్రా డిఫెన్స్) అంటే ఏంటి? అందులో అధికారులైన రియాజ్ అహ్మద్ (సాయి కుమార్), జేబీ (భానుచందర్) తో రామ్ తండ్రి సూర్యప్రకాష్‌కు ఉన్న సంబంధం ఏమిటి? తన కూతురిని ప్రేమించానంటూ వచ్చిన సూర్యకు జేబీ ఎలాంటి పరీక్షలు పెట్టాడు? ఆ పరీక్షల్లో రామ్ పాస్ అయ్యాడా?
జహ్నవి ప్రేమ రామ్‌లో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది. దేశం కోసం ప్రాణాలిచ్చే సైనికుడిగా రామ్ ఎలా మారాడు? అసలు హైద్రాబాద్‌లో ఉగ్ర సంస్థలు ఏం ప్లాన్ చేశారు? వాటిని రామ్ ఎలా అడ్డుకున్నాడు? అన్నదే రామ్ మూవీ కథ.
దేశభక్తి ఓ ఎమెషన్...
దేశభక్తి అన్నది ఓ ఎమోషన్. ఆ ఎమోషన్‌ను కమర్షియల్ కోణంలో వాడుకుంటూ గతంలో తెలుగు తెరపై చాలా సినిమాలొచ్చాయి. ఈ సినిమాల్లో దేశభక్తి అన్నది కామన్ పాయింట్ అయినా ఆ ఎమోషన్‌ను భిన్నంగా స్క్రీన్‌పై ఆవిష్కరించే నేర్పు దర్శకుడికి ఉండాలి. అప్పుడే ఈ కథలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. రామ్ కోసం దర్శకుడు మిహిరాం ఎంచుకున్న పాయింట్ డిఫరెంట్‌గా ఉంది.
బార్డర్‌లోనే కాదు.. దేశం లోపల కూడా కనిపించిన శత్రువులు ఉంటారనే పాయింట్‌తో రామ్ కథను రాసుకున్నాడు డైరెక్టర్. ఈ పాయింట్‌కకు ప్రేమ, యాక్షన్ అంశాలను జోడించి పక్కా కమర్షియల్ మూవీగా రామ్‌ను తెరకెక్కించాడు. ఎలాంటి బరువు బాధ్యతలు లేకుండా అల్లరి చిల్లరగా తిరిగే వ్యక్తి.. దేశం కోసం ప్రాణాలిచ్చే సైనికుడిగా ఎలా మారడన్నది ఈ సినిమాలో ఆవిష్కరించారు.
నేపథ్యం కొత్తది కానీ...
హెచ్‌ఐడీ (హిందుస్తాన్ ఇంట్రా డిఫెన్స్) అనే పాయింట్ కొత్తగా ఉంది. ఆ నేపథ్యం చుట్టూ అల్లుకున్న సీన్స్ బాగున్నాయి. మన దేశంలోనే ఉంటూ.. పక్క దేశానికి పని చేసే స్లీపర్ సెల్స్ గా పనిచేస్తూ కొందరు దేశంలో ఎలా కుట్రలకు పాల్పడుతున్నారు? ఆ కోవర్టులు దేశద్రోహులు అని తెలిసాన రాజకీయ నాయకులు వారిని ఎందుకు కాపాడుతున్నారన్నది చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ పాయింట్ బాగున్నా దానిని స్క్రీన్‌పై ఎంగేజింగ్‌గా దర్శకుడు చెప్పలేదనిపిస్తుంది. ఆ సీన్స్‌లో సీరియస్‌నెస్ కనిపించలేదు. శుభలేఖ సుధాకర్ పాత్ర ద్వారా ఉగ్రవాదానికి, పాలిటిక్స్‌కు ఉన్న సంబంధాన్ని చెప్పే డైలాగ్స్, సీన్స్ బాగున్నాయి.
క్లైమాక్స్ హైలైట్...
ఫస్ట్ హాఫ్ సూర్య అండ్ గ్యాంగ్ చేసే పనులతో సరదాగా నడిపించారు డైరెక్టర్.ఈ సీన్స్‌తో పాటు రామ్, జాహ్నవి ప్రేమకథ కూడా రొటీన్‌గానే సాగిన ఫీలింగ్ కలుగుతుంది. తండ్రి ఆశయం తెలుసుకొని రామ్ సోల్డర్‌గా మారాలని నిర్ణయించుకోవడం, ఉగ్రవాదుల కుట్రలను ఎదురించేందుకు పోరాడే సన్నివేశాలతో సెకండాఫ్‌ను సీరియస్‌గా నడిపించాడు డైరెక్టర్. క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్‌ను దేశభక్తిని హైలైట్ చేశాడు. కులమతాల భేదాలు లేవంటూ, అందరూ సమానమేననే మెసేజ్‌తో సినిమాను ఎండ్‌చేశాడు.
ధన్య బాలకృష్ణ...
రామ్ పాత్రలో సూర్య నటన బాగుంది. జులాయిగా తిరిగే యువకుడిగా, దేశం కోసం పోరాడే సైనికుడిగా రెండు క్యారెక్టర్స్ మధ్య చక్కటి వేరియేషన్ చూపించాడు. సీనియర్ హీరో రోహిత్ హీరో తండ్రిగా ఓ ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించాడు. . భానుచందర్, సాయికుమార్, శుభలేఖ సుధాకర్ వంటి సీనియర్ ఆర్టిస్టులు ఉండటం ఈ సినిమాకు ప్లస్సయింది. సాయికుమార్ డైలాగ్స్ ఆలోచనను రేకెత్తిస్తాయి. ధన్యా బాలకృష్ణ పాత్ర యూత్ ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది.
అంచనాలు లేకుండా చూస్తే...
రామ్ దేశభక్తి ప్రధానంగా సాగే యాక్షన్ మూవీ. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా చూస్తే కొంత వరకు ఆకట్టుకుంటుంది.
రేటింగ్: 2.5/5