Ram Charan Movie Update: కన్నడ దర్శకుడితో రామ్ చరణ్ సినిమా.. ప్రాజెక్ట్ పక్కా?-ram charan confimed to work with kannada director narthan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan Movie Update: కన్నడ దర్శకుడితో రామ్ చరణ్ సినిమా.. ప్రాజెక్ట్ పక్కా?

Ram Charan Movie Update: కన్నడ దర్శకుడితో రామ్ చరణ్ సినిమా.. ప్రాజెక్ట్ పక్కా?

Maragani Govardhan HT Telugu
Feb 20, 2023 12:55 PM IST

Ram Charan Movie Update: రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని కన్నడ దర్శకుడు నార్థన్‌తో తీయనున్నట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం. బుచ్చిబాబు సానం తర్వాత ఈ సినిమా ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

రామ్ చరణ్
రామ్ చరణ్ (Getty Images via AFP)

Ram Charan Movie Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గతేడాది ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలతో సందడి చేశారు. ఇందులో ఆర్ఆర్ఆర్ సూపర్ హిట్ కాగా.. ఆచార్య మాత్రం బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. దీంతో ఆయన తన తదుపరి చిత్రాలు ఆచితూచి ఎంచుకుంటున్నారు. ఇటీవలే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానంతో ఓ సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపిన చెర్రీ.. తాజాగా మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పారు. ప్రముఖ కన్నడ దర్శకుడు నార్థన్‌తో ఓ సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని ఫిల్మ్ వర్గాల టాక్.

గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్టు గురించి సోషల్ మీడియా వేదికగా చర్చలు జరిగాయి. ఇటీవలే నార్థన్ కన్నడ స్టార్ శివరాజ్ కుమార్‌తో సినిమా చేస్తుండటంతో చరణ్‌తో సినిమా ఆగిపోయిందని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు పక్కన పెట్టలేదని, ఇది కూడా చరణ్ చేస్తున్నారని ఫిల్మ్ వర్గాలు స్పష్టం చేశాయి. సినిమా స్టోరీ ఆయనకు నచ్చి ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారని సమాచారం.

శివరాజ్ కుమార్‌తో నార్థన్ సినిమా పూర్తయిన తర్వాత చరణ్‌తో సినిమా మొదలవుతుందని సమాచారం. ఈ లోపు రామ్ చరణ్ కూడా శంకర్, బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుల తర్వాత నార్థన్‌తో చెర్రీ సినిమా ఉంటుందని సమాచారం. కాబట్టి కన్నడ దర్శకుడితో రామ్ చరణ్ సినిమా ఆగిపోయిందనే వార్తలు రూమర్లేనని తేలిపోయింది. నార్థన్ కన్నడలో మఫ్టీ, రితికా అనే సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు.

ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. చెర్రీతో కియారాకు ఇది రెండో సినిమా. ఇంతకుముందు వినయ విధేయ రామలో కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ. రామ్‌చరణ్-శంకర్ కాంబినేషన్ వస్తోన్న ఈ సినిమాకు దిల్‌రాజు నిర్మాత. ఈ చిత్రం రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుందని సమాచారం. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం