Vettaiyan Buzz: రజనీకాంత్ కొంప ముంచిన టైటిల్.. తెలుగు రాష్ట్రాల్లో అసలు కనిపించని బజ్.. కారణం ఇదేనా?
Vettaiyan Buzz: రజనీకాంత్ లేటెస్ట్ మూవీ వేట్టయన్ కు తెలుగు రాష్ట్రాల్లో అసలు ఎలాంటి బజ్ లేదు. తమిళనాడుతో సమానంగా ఇక్కడ కూడా అభిమానులను సంపాదించుకున్న సూపర్ స్టార్ కు ఇది ఏమాత్రం మింగుడు పడనిదే. అయితే దీని వెనుక ఓ బలమైన కారణం లేకపోలేదు.
Vettaiyan Buzz: రజనీకాంత్ ఓ తమిళ సూపర్ స్టారే అయినా అతనికి తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. గతంలో అతని డబ్బింగ్ సినిమాలు ఎన్నో ఇక్కడా వసూళ్ల వర్షం కురిపించాయి. అంతెందుకు గతేడాది వచ్చిన జైలర్ కూడా బాగానే ఆడింది. కానీ ఇప్పుడు వేట్టయన్ మూవీకి మాత్రం అసలు తెలుగులో ఏమాత్రం బజ్ క్రియేట్ కావడం లేదు. దీనికి కారణం టైటిలే అన్నది బలంగా వినిపిస్తున్న వాదన.
వేట్టయన్.. టైటిలే కొంప ముంచిందా?
తమిళులకు తమ భాషపై ఎంతో మమకారం ఉంటుంది. దానిని కాదనలేం. కానీ ఈ మధ్య అక్కడి మూవీ మేకర్స్ కు ఇది కాస్త ఎక్కువే అయినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే తమ సినిమాలను తెలుగులో రిలీజ్ చేసినా కూడా టైటిల్ మార్చడం లేదు. ఒకప్పుడు ఎన్నో తమిళ డబ్బింగ్ సినిమాలు తెలుగులో బ్లాక్ బస్టర్ అయ్యాయి.
దీనికి కారణం ఆ సినిమాలను తెలుగు నేటివిటీకి తగినట్లుగా టైటిల్ పెట్టడంతోనే ఆకర్షించేవారు. కానీ కొన్నాళ్లుగా ఇది కనిపించడం లేదు. వలీమై, రాయన్, కంగువ, వేట్టయన్.. ఇలా సినిమాలను తెలుగులోకి డబ్ చేస్తున్నా.. టైటిల్స్ మాత్రం తమిళం భాషలోనే ఉంచుతున్నారు. ఇది తెలుగు ప్రేక్షకులకు రుచించడం లేదు.
అసలు ఓ సినిమాకు వెళ్లాలంటే మొదట ఆ టైటిల్ కు అర్థమేంటో తెలియాలి. అదే లేకుండా ఎంత పెద్ద స్టార్ హీరో ఉంటే మాత్రం ఏం లాభం. తాజాగా రజనీకాంత్ వేట్టయన్ కు కూడా తెలుగు ప్రేక్షకుల నుంచి ఇదే వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే గురువారం (అక్టోబర్ 10) మూవీ రిలీజ్ కావాల్సి ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో టికెట్లు బుకింగ్ కు పెద్దగా రెస్పాన్స్ లేదు.
తెలుగులో డైలాగులు, పాటలు రాయిస్తున్న వాళ్లు.. అదే రచయితలతో ఓ పవర్ ఫుల్ టైటిల్ పెట్టించలేకపోతున్నారా అన్న ప్రశ్నలూ వినిపిస్తున్నాయి.
తెలుగు ప్రేక్షకులను కించ పరుస్తున్నారా?
తమిళమనే కాదు.. తాజాగా హిందీ మూవీ జిగ్రా కూడా తెలుగులో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా టైటిల్ ను కూడా అలాగే ఉంచి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. దీనిపై రచయిత అబ్బూరి రవి తన నిరసన తెలిపాడు. "ఆయా భాషలను నేను కూడా గౌరవిస్తాను. కానీ తెలుగు ప్రేక్షకులను మాత్రం తేలిగ్గా తీసుకోవడం నాకు నచ్చడం లేదు. తెలుగు ప్రేక్షకులను గౌరవించని ఫిల్మ్ మేకర్స్ ను కూడా ప్రోత్సహించడం మన గొప్పతనం అని నేను అనుకోను" అని అతడు స్పష్టంగా చెప్పాడు.
ముఖ్యంగా తమిళ సినిమా దర్శకులు, నిర్మాతలు తమ సినిమాలను తెలుగులోకి డబ్ చేస్తున్నా టైటిల్స్ ఇక్కడికి ప్రేక్షకులకు తగినట్లుగా పెట్టడం లేదు. దీనివల్ల క్రమంగా తెలుగు ప్రేక్షకులు ఒకప్పుడు తాము ఎంతగానో ఆదరించిన తమిళ సినిమాలకు దూరమవుతున్నారు. ఇది అక్కడి ఫిల్మ్ మేకర్స్ కే నష్టం అని తెలుసుకోవడం లేదు.
రజనీకాంత్ లాంటి స్టార్ హీరోకి కూడా దీని సెగ తగులుతున్నట్లు కనిపిస్తోంది. అతని లేటెస్ట్ మూవీ వేట్టయన్ పేరుతో రిలీజ్ అవుతోంది. దీనికి అర్థం వేటగాడు అని. కానీ తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి దీని అర్థమే తెలియదు. హిందీ మార్కెట్లోనూ ఇదే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. దీంతో దీనికి తగిన మూల్యం వాళ్లు చెల్లించక తప్పడం లేదు.