Rajashekar Shekar OTT: థియేటర్లలో రిలీజైన రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ
Rajashekar Shekar OTT: రాజశేఖర్ హీరోగా నటించిన శేఖర్ మూవీ థియేటర్లలో రిలీజైన రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. శేఖర్ మూవీకి జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించింది.
Rajashekar Shekar OTT: రాజశేఖర్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ శేఖర్ థియేటర్లలో రిలీజైన రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. శేఖర్ మూవీకి రాజశేఖర్ సతీమణి జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించింది.
మలయాళంలో విజయవంతమైన జోసెఫ్ మూవీ ఆధారంగా శేఖర్ మూవీ రూపొందింది. ఆత్మీయ రాజన్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ ఓ గెస్ట్ రోల్ చేసింది. రియల్ పాత్రలోనే రాజశేఖర్ కూతురిగానే కనిపించింది. జార్జి రెడ్డి ఫేమ్ ముస్కాన్ ఓ కీలక పాత్రలో కనిపించింది.
కోర్డు గొడవల కారణంగా...
థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీని కోర్డు గొడవల కారణంగా అర్థాంతరంగా నిలిపివేశారు. ఈ గొడవలను సమసిపోయేలా చేసి తిరిగి థియేటర్లలో శేఖర్ సినిమాను రిలీజ్ చేయాలని రాజశేఖర్, జీవిత రాజశేఖర్ చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అవేవీ ఫలించలేదు. థియేట్రికల్ రిలీజ్‌కు ముందు ఈ సినిమా ఓటీటీ హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడింది. కోర్టు గొడవలు క్లియర్ కాకపోవడంతో ఓటీటీ సంస్థలు ఈ సినిమాను కొనడానికి ముందుకు రాలేదు.
శేఖర్ ఓటీటీ…
ప్రస్తుతం శేఖర్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ ప్రముఖ తెలుగు ఓటీటీ ద్వారా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం.
క్రైమ్ స్పెషలిస్ట్...
ఈ సినిమాలు క్రైమ్ ఇన్వేస్టిగేషన్‌లో స్పెషలిస్ట్ అయిన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్‌గా రాజశేఖర్ కనిపించాడు. శేఖర్ తన భార్య ఇందు నుంచి విడిపోతాడు. ఓ రోజు రోడ్డు ప్రమాదంలో ఇందు మరణించినట్లు శేఖర్‌కు సమాచారం వస్తుంది.
ఇందు ప్రమాదంలో చనిపోలేదని, ఆమెను ఎవరో హత్య చేశారని శేఖర్ అనుమానిస్తాడు? అతడి అనుమానం నిజమేనా? ఇందు హత్యకు గురైందా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.2015లో రూపొందిన గడ్డం గ్యాంగ్ తర్వాత దర్శకత్వ బాధ్యతలకు దూరంగా జీవిత రాజశేఖర్...ఏడేళ్ల తర్వాత శేఖర్ మూవీతో మెగా ఫోన్ పట్టింది.
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్...
ఇటీవలే నితిన్ హీరోగా నటించిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌లో రాజశేఖర్ ఓ కీలక పాత్ర పోషించాడు. పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. ఓ స్టార్ హీరో సినిమాలో అతడు విలన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు జీవిత కూడా దాదాపు 34 ఏళ్ల తర్వాత రజనీకాంత్ లాల్ సలామ్ సినిమాతో నటిగా రీఎంట్రీ ఇచ్చింది. 1990లో మగాడు సినిమా తర్వాత యాక్టింగ్‌కు దూరమైంది జీవిత. లాల్‌సలామ్ మూవీలో హీరో విష్ణు విశాల్ తల్లిగా కనిపించింది.