Tiragabadara Saami Review: తిరగబడరా సామీ రివ్యూ - రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా మూవీ హిట్టా? ఫట్టా?
Tiragabadara Saami Review: రాజ్‌తరుణ్, మాల్వీ మల్హోత్రా జోడీ తిరగబడరా సామీ మూవీతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Tiragabadara Saami Review: సినిమాల కంటే వివాదాలతోనే కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తున్నాడు రాజ్ తరుణ్. అతడు హీరోగా నటించిన తాజా మూవీ తిరగబడరా సామీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. మాల్వీ మల్హోత్రా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో మన్నారా చోప్రా కీలక పాత్రలో నటించింది.ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఎలా ఉందంటే?
గిరి, శైలజ ప్రేమకథ…
గిరి (రాజ్ తరుణ్) ఓ అనాథ. అమాయకత్వం, భయం రెండు ఎక్కువే. గొడవలకు దూరంగా సాదాసీదా జీవితాన్ని గడుపుతుంటాడు. కొన్ని పరిస్థితుల కారణంగా చిన్నతనంలోనే అమ్మనాన్నలకు దూరమవుతాడు. తనలా ఎవరూ బాధపడకూడదని తప్పిపోయిన వారిని వెతికిపెట్టి వారి కుటుంబాలకు దగ్గర చేయడమే పనిగా పెట్టుకుంటాడు. గిరి మంచి మనసు చూసి శైలజ (మాల్వీ మల్హోత్రా) అతడిని ఇష్టపడుతుంది. గిరికి పూర్తి భిన్నమైన మనస్తత్వం శైలజది. సమస్యలకు భయపడకుండా ధైర్యంగా ఎదురుతిరుగుతుంటుంది.
శైలజను ప్రేమించిన గిరి ఆమెను పెళ్లిచేసుకుంటాడు. శైలజతో కొత్త జీవితాన్ని ఆనందంగా మొదలుపెట్టాలని అనుకున్న తరుణంలో భార్య కోటీశ్వరురాలనే నిజం గిరికి తెలుస్తుంది. జహీరాబాద్ కొండారెడ్డి (మకందర్ దేశ్‌పాండే) అనే రౌడీ శైలజను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని గిరి కనిపెడతాడు.
ఆ రౌడీ బారి నుంచి శైలజను గిరి ఎలా కాపాడుకున్నాడు? కొండారెడ్డితో గొడవల కారణంగా గిరికి ఆప్తులైన ఆటోజానీ (బిత్తిరి సత్తి), మస్తాన్ (రాజా రవీంద్ర), తులసమ్మ (ప్రగతి) ఎలాంటి కష్టాలు పడ్డారు? శైలజ గురించి కొండారెడ్డి వెతకడానికి కారణమేమిటి? పిరికివాడైన గిరి భార్య కోసం కొండారెడ్డిపై ఎలా తిరగబడ్డాడు అన్నదే ఈ మూవీ కథ.
పాత కథనే కొత్తగా...
ప్రతి సారి కొత్త కథలతో సినిమాలు చేయడం దర్శకులకు సాధ్యపడకపోవచ్చు. అందుకే కొన్నిసార్లు పాత కథలనే కొత్తగా చెబుతూ విజయాల్ని అందుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. స్క్రీన్‌ప్లేతోనో, ట్రీట్‌మెంట్ పరంగానే మ్యాజిక్ చేయడమే కాకుండా ట్రెండ్, ఆడియెన్స్ టెస్ట్ ఎలా ఉందన్నది తెలుసుకుంటూ సినిమాలు చేసినప్పుడే రొటీన్ స్టోరీస్ ఆడియెన్స్‌ను మెప్పిస్తుంటాయి. ఈ విషయంలో ఏ మాత్రం తేడా కొట్టిన మొదటికే మోసం వస్తుంది.
ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్...
తిరగబడరా సామీ సినిమాను ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్‌తో దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి తెరకెక్కించారు. ఈ సినిమా స్టోరీ, స్క్రీన్‌ప్లే, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అన్ని 1990 కాలం సినిమాలను గుర్తుచేస్తాయి. కామెడీ, ఎమోషన్స్, లవ్‌స్టోరీ ఎందులోనూకొత్తదనం ఛాయలు మచ్చుకైనా కనిపించవు.
ఫ్లాష్ బ్యాక్ సో..సో...
గిరి, శైలజ మధ్య పరిచయం, వారి మధ్య ప్రేమకథతో ఫస్ట్ హాఫ్ సాగుతుంది. గిరిని శైలజ ఇష్టపడే సీన్స్ చాలా ఆర్టిఫీషియల్‌గా ఉన్నాయి. వారి ప్రేమకథలో నాచురాలిటీ కనిపించలేదు. శైలజ గురించి గిరికి తెలిసే నిజంతో సెకండాఫ్‌పై కాస్తంగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. కానీ ఆ ఫ్లాష్‌బ్యాక్ కూడా సోసోగానే అనిపిస్తుంది. కొండారెడ్డి నుంచి శైలజను కాపాడుకోవడానికి రాజ్ వేసే ప్లాన్స్ సిల్లీగా ఉంటాయి. ఒక్క సీన్‌ను డైరెక్టర్ ఇంట్రెస్ట్‌గా రాసుకోలేకపోయాడు. క్లైమాక్స్ రొటీన్‌గానే ఎండ్ అవుతుంది.
రాజ్ తరుణ్ వేరియేషన్స్...
అతి భయస్తుడైన యువకుడి పాత్రలో రాజ్ తరుణ్ నటన పర్వాలేదనిపిస్తుంది. క్యారెక్టర్‌లో వేరియేషన్స్ బాగానే చూపించాడు. మాల్వీ మల్హోత్రా యాక్టింగ్ పరంగా తేలిపోయింది. రాజ్ తరుణ్‌తో ఆమె కెమిస్ట్రీ మాత్రం స్క్రీన్‌పై వర్కవుట్ అయ్యింది. విలన్ గ్యాంగ్ మెంబర్‌గా మన్నారా చోప్రా అందాలను ఆరబోసింది. రఘుబాబు, బిత్తిరి సత్తి, పృథ్వీ, తాగుబోతు రమేష్ ఇలా..చాలా మంది కమెడియన్లు ఉన్నా ఎవరూ మెప్పించలేకపోయారు.
మెప్పించడం కష్టమే...
తిరగబడరా సామీ ఔట్‌డేటెడ్ కమర్షియల్ మూవీ. కొత్తదనానికి అలవాటుపడిన నేటితరం ప్రేక్షకులను ఈ మూవీ మెప్పించడం కష్టమే.
టాపిక్