NTR Birth Anniversary : శివుడి వేషంలో ఎన్టీఆర్.. మెడలోకి వచ్చిన పాము.. అందరూ షాక్
NTR 100 Years : ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో సినిమాలు. ఒకే సినిమాలో పలు పాత్రలు, దర్శకత్వం.. ఇలా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి మహానియుడి జీవితంలో ఎన్నో ఘటనలు ఉన్నాయి. ఆయన శివుడి వేషంలో ఉండగా.. ఆసక్తికర సంఘటన జరిగింది.
ఎన్టీఆర్ అనగానే మెుదట గుర్తొచ్చేది పౌరాణిక పాత్రలు. ఎన్టీఆర్ అంటే.. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు అని చెప్పేవారు ఇప్పటికీ కొంతమంది ఉన్నారు. ముసలి వాళ్లు అయితే.. మా ఎన్టీవోడు అంటుంటారు. ఓ సినిమా కోసం రామారావు శివుడి పాత్ర వేయగా ఆసక్తికర ఘటన జరిగింది. ఈ ఘటనతో షూటింగ్ ప్రదేశంలో ఉన్న అందరూ షాక్ అయ్యారు.
అశ్వినీ దత్ నిర్మాణంలో లెజెండరీ దర్శకుడు కేవీ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ శివుడి పాత్రలో ఓ సినిమా చేశారు. మరో స్టార్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ అసిస్టెంట్ డైరెక్టర్. ఈ సినిమాలో ఎన్టీఆర్ శివుడి రూపంలో కనిస్తారు. శివుడు అనగానే.. మెడలో పాము తప్పనిసరి. కొందరూ రబ్బర్ పామును ఉపయోగించేవారు. మరికొందరు కోరలు తీసేసిన నిజమైన పామును వాడేవారు. ఇలా షూటింగ్ చేసేవారు. రబ్బర్ పామును మెడలో వేసుకుంటే.. ఎన్టీఆర్ కు ఎలర్జీ వస్తుండటంతో కోరలు తీసేసిన నిజం పామును షూటింగ్ లో ఉపయోగించారు.
పాము నేరుగా మెడలోకి రావాలి. ఇందుకోసం పాములను ఆడించి ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తిని పిలిపించారు. పాముకి ట్రైనింగ్ ఇస్తుంటే.. ఏం చేస్తున్నారని ఎన్టీఆర్ అడిగారు. పాము మెడలో ఉండేలా ట్రైనింగ్ ఇస్తున్నాడని అసిస్టెంట్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ సమాధానం ఇచ్చాడు. 'ఏం అవసరం లేదు. వారిని వదిలేయండి. ఆయనే వస్తారు మెడలోకి' అని ఎన్టీఆర్ చెప్పారు. ఇది విని కేవీ రెడ్డి.. ఆయనకు బ్రెయిన్ ఉందని, పాముకి కూడా ఉంటుందని అనుకుంటున్నారా.. అని అన్నారట.
ఇక సీన్ స్టార్ట్ అయింది. వెనకాల సౌండ్ ప్లే అవుతుంది. పాము మెళ్లిగా కదిలి వెళ్లి ఎన్టీఆర్ మెడకు ఆభరణం అయింది. ఇది చూసి కేవీ రెడ్డి, ఎన్టీఆర్ కు చేతులెత్తి దణ్ణం పెట్టారు. రామారావు నువ్ గొప్ప వ్యక్తివి కాదు.. అంతుకుమించి అని వ్యాఖ్యానించారు. సెట్లో మాత్రం అందరూ షాక్ అయ్యారు. ఈ విషయాన్ని అశ్వనీ దత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇలాంటి సంఘటనలు ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో ఉన్నాయి.
నందమూరి తారకరామారావు 28 మే 1923లో జన్మించారు. ఈ ఏడాది ఆయన శతజయంతి పూర్తి చేసుకోనున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు.. కొన్నిరోజులుగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అనేక కార్యక్రమాలు చేస్తున్నారు.