Priyanka Mohan: స్టేజ్ కుప్పకూలడంతో గాయపడిన పవన్ కల్యాణ్ హీరోయిన్.. వీడియో వైరల్.. ఇప్పుడెలా ఉందంటే?
Priyanka Mohan: ఈ మధ్యే సరిపోదా శనివారం మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోయిన్ ప్రియాంకా మోహన్ గాయపడింది. ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ సందర్భంగా స్టేజ్ కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది. తర్వాత ఆమె తన పరిస్థితిపై అప్డేట్ కూడా ఇచ్చింది.
Priyanka Mohan: పవన్ కల్యాణ్ తో ఓజీ మూవీ చేస్తున్న నటి ప్రియాంకా అరుళ్ మోహన్ గాయపడింది. తెలంగాణలోని తొర్రూర్ లో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ సందర్భంగా స్టేజ్ కుప్పకూలింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ప్రియాంకా తన గాయంపై ఎక్స్ అకౌంట్ ద్వారా అప్డేట్ ఇచ్చింది.
ప్రియాంకా మోహన్‌కు గాయం
ఈ మధ్యే నానితో సరిపోదా శనివారం మూవీ చేసిన నటి ప్రియాంకా మోహన్ గాయపడింది. గురువారం (అక్టోబర్ 3) ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక స్టేజ్ కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో ప్రియాంకా మోహన్ తోపాటు కాంగ్రెస్ నేత ఝాన్సీ రెడ్డి, మరొకరు కూడా గాయపడ్డారు.
స్టేజ్ కుప్పకూలుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. స్టేజ్ కూలగానే అక్కడంతా గందరగోళం నెలకొంది. అయితే ప్రియాంకాకు స్వల్ప గాయాలే కావడంతో ఆమెను అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు. ఆ తర్వాత ఆమె కూడా ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ ప్రమాదంపై అభిమానులకు అప్డేట్ ఇచ్చింది.
నేను బాగానే ఉన్నాను: ప్రియాంకా
తొర్రూరు షాపింగ్ మాల్ లో జరిగిన ప్రమాదంపై ప్రియాంకా మోహన్ తన ఎక్స్ అకౌంట్లో ఓ ట్వీట్ చేసింది. తాను బాగానే ఉన్నట్లు వెల్లడించింది. "తొర్రూరులో ఇవాళ నేను వెళ్లిన ఈవెంట్లో జరిగిన ప్రమాదం దృష్ట్యా నా శ్రేయోభిలాషులందరికీ ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను.
నేను బాగానే ఉన్నాను. అదృవశాత్తూ స్వల్ప గాయాలతోనే బయటపడ్డాను. ఈ ప్రమాదంలో గాయపడిన వాళ్లందరూ త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. నా క్షేమం కోరుతూ సందేశాలు పంపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు, థ్యాంక్యూ" అని ప్రియాంకా ట్వీట్ చేసింది.
ప్రియాంకా మోహన్ కెరీర్ ఇలా..
ప్రియాంకా అరుళ్ మోహన్ 2019లో వచ్చిన కన్నడ మూవీ ఒందు కథె హెల్లాతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత డాక్టర్, ఎథర్కుమ్ తునిందవన్, డాన్, టిక్ టాక్, కెప్టెన్ మిల్లర్ లాంటి తమిళ సినిమాల్లో నటించింది. ఇక 2019లో నానితో కలిసి గ్యాంగ్ లీడర్ మూవీ ద్వారా తెలుగులోకి అడుగుపెట్టింది.
ఆ తర్వాత శ్రీకారం, ఈ మధ్యే వచ్చిన సరిపోదా శనివారం సినిమాలు కూడా చేసింది. ఇక ఇప్పుడు పవన్ కల్యాణ్ తో కలిసి ఓజీ మూవీలో నటిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.