Pakistani Movie In India : దశాబ్దం తర్వాత ఇండియాలో పాకిస్థానీ సినిమా రిలీజ్! -pakistani movie the legend of maula jatt planning to release in india ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pakistani Movie In India : దశాబ్దం తర్వాత ఇండియాలో పాకిస్థానీ సినిమా రిలీజ్!

Pakistani Movie In India : దశాబ్దం తర్వాత ఇండియాలో పాకిస్థానీ సినిమా రిలీజ్!

Anand Sai HT Telugu
Dec 27, 2022 02:17 PM IST

The Legend Of Maula Jatt : చాలా ఏళ్ల తర్వాత పాకిస్థాన్ సినిమా ఇండియాలో విడుదలకు సిద్ధంగా ఉంది. అక్కడ విడుదల చేసిన రెండు నెలల తర్వాత ఇక్కడ రిలీజ్ కు ప్లాన్ చేశారు.

ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్
ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్ (twitter)

The Legend Of Maula Jatt : పాకిస్థాన్ సినిమా 'ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్'లో ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 13న పాకిస్థాన్(Pakistan)లో విడుదలైంది. రెండు నెలల తర్వాత ఇండియాలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది ఐనాక్స్(INOX).

అనేక కారణాలతో పాకిస్థాన్ సినిమాలు ఇక్కడ విడుదల కావడం లేదు. దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఓ పాకిస్థానీ సినిమా భారత్‌లో విడుదలవుతోంది. అక్కడ సూపర్ హిట్ అయిన 'ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్ మూవీ'(The Legend Of Maula Jatt)ని ఇండియాలో విడుదల చేసేందుకు ఐనాక్స్ ప్లాన్ చేస్తోంది. అయితే దీనిపై వ్యతిరేకత కూడా వస్తున్నట్టుగా తెలుస్తోంది. డిసెంబర్ 30న విడుదల చేయాలని అనుకుంటున్నట్టుగా సమాచారం. మరి ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.

అలాగని ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. పంజాబ్(Punjab), దిల్లీలో ఈ సినిమా విడుదల కానుంది. పంజాబీ మాట్లాడే వారి కోసం ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం.. అని ఐనాక్స్ తెలిపింది. మల్టీప్లెక్స్ చైన్ PVR దీని గురించి సమాచారం ఇచ్చింది. తరువాత ఈ పోస్ట్ ను సోషల్ మీడియా నుంచి తొలగించారు. వ్యతిరేకత రావడంతో ఈ పోస్ట్‌ను తొలగించినట్లు సమాచారం.

50 కోట్ల రూపాయల బడ్జెట్‌తో 'ది లెజెండ్స్ ఆఫ్ మౌలా జాట్'(The Legend Of Maula Jatt) సినిమా రెడీ అయింది. ఈ సినిమా అక్కడ 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిందని అంటున్నారు. పాకిస్థాన్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రానికి బిలాల్ లషారి దర్శకత్వం వహించారు. పంజాబీ యాక్షన్ డ్రామా. లసారి ఫిల్మ్స్, ఎన్ సైక్లోమీడియా ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు. ఈ మూవీ కథను నాసిర్ అదీప్ ఆధారంగా రూపొందించారట. ఇందులో హంజా అలీ అబ్బాసీ, హుమైమా మాలిక్, మహిరా ఖాన్ లు ప్రధాన పాత్రల్లో ఉండగా.. మౌలా జట్ అనే పాత్రలో నూరి నట్ పోషించాడు.

2011లో ‘బోల్‌’ సినిమా విడుదలైంది. ఆ తర్వాత భారత్‌లో ఏ పాకిస్థాన్ సినిమా(Pakistan Cinema) కూడా థియేటర్లలో విడుదల కాలేదు. ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత 'ది లెజెండ్స్ ఆఫ్ మౌలా జాట్' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై తీవ్ర వ్యతిరేకత వస్తే సినిమా విడుదలయ్యే అవకాశం లేదు.

ఈ సినిమా 2017లో నిర్మాణాన్ని ప్రారంభించి జూన్ 2019లో ముగించారు. కాపీరైట్ సంబంధిత సమస్యలు, కోవిడ్-19(Covid 19) మహమ్మారి కారణంగా సినిమా విడుదల ఆలస్యం అయింది. 2016లో ఉరీలో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్థానీ నటీనటులు భారతీయ సినిమాల్లో నటించడం మానేశారు. పాకిస్థానీ కళాకారులను భారతీయ చిత్రాల నుండి నిషేధించాలని, ఇక్కడ ప్రదర్శనలు ఇవ్వకుండా నిషేధించాలని పలువురు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.