Oke Oka Jeevitham Trailer: కాలాన్ని వెనక్కి తీసుకెళ్లిన ఒకే ఒక జీవితం.. ట్రైలర్ సూపర్
Oke Oka Jeevitham Trailer: కాలాన్ని వెనక్కి తీసుకెళ్లి ఉన్నది ఒకే ఒక జీవితం.. గతాన్ని సరి చేసుకో అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు శర్వానంద్, అమల నటించిన మూవీ ట్రైలర్ అలాంటి అనుభూతినే ఇస్తోంది.
Oke Oka Jeevitham Trailer: అప్పుడెప్పుడో 30 ఏళ్ల కిందట వచ్చిన ఆదిత్య 369 గుర్తుందా? అందులో హీరో బాలకృష్ణ టైమ్ మెషీన్ ఎక్కి కాలంలో వెనక్కి, ముందుకూ వెళ్తాడు. అప్పట్లో ఆ సినిమా ఓ సంచలనం. ఇప్పుడు మళ్లీ అలాంటి టైమ్ మెషీన్ కాన్సెప్ట్‌తోనే వస్తోంది ఒకే ఒక జీవితం మూవీ. ఆ సైన్స్ ఫిక్షన్‌కే అమ్మ సెంటిమెంట్ జోడించి ఎంతో ఆసక్తి రేపుతోందీ మూవీ ట్రైలర్.
శర్వానంద్ 30వ సినిమా ఇలా ఓ కొత్త ఫీల్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాలో సరసన రీతూ వర్మ నటిస్తుండగా.. శర్వా తల్లి పాత్రలో అమల అక్కినేని కనిపించబోతోంది. ఒకే ఒక జీవితం ట్రైలర్‌ను మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ శుక్రవారం (సెప్టెంబర్ 2) లాంచ్ చేశాడు. ట్రైలర్ మొదట్లోనే శర్వా ఓ మ్యూజీషియన్‌గా కనిపిస్తాడు.
ఇది కూడా చదవండి | Nikhil Bollywood Entry: బాలీవుడ్ ఎంట్రీపై హింట్ ఇచ్చిన నిఖిల్
అయితే చేదు గతం, ఎప్పుడూ తన వెంట ఉండి ప్రోత్సహించే తన తల్లి లేకపోవడం అతన్ని మ్యూజిక్‌పై దృష్టి సారించనివ్వదు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైమ్ మెషీన్‌లో గతంలోకి వెళ్లి అప్పుడు జరిగిన తప్పును సరి చేసుకునే అవకాశం హీరోకు దొరుకుతుంది. ఇందులో సైంటిస్ట్ పాత్రలో నాజర్ కనిపించాడు. శర్వానంద్‌తోపాటు మూవీలో అతని స్నేహితులుగా కనిపించే వెన్నెల కిశోర్, ప్రియదర్శి కూడా గతంలోకి వెళ్తారు.
సైన్స్ ఫిక్షన్‌కు మదర్ సెంటిమెంట్ అనే కాన్సెప్టే చాలా కొత్తగా అనిపిస్తోంది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఎంత వరకూ ఆకట్టుకుంటోందో చూడాలి. సెప్టెంబర్ 9న ఒకే ఒక జీవితం మూవీ రిలీజ్ కానుంది. శ్రీ కార్తీక్ ఈ మూవీకి స్టోరీ అందించడంతోపాటు డైరెక్షన్ చేశాడు. ట్రైలర్‌తోనే మూవీపై ఆసక్తిని పెంచడంలో అతడు సక్సెస్ అయ్యాడు. రెండు నిమిషాల ట్రైలర్‌లోనే అన్ని ఎమోషన్లను సమర్థంగా చూపించారు.