National Film Awards 2023: నేషనల్ ఫిల్మ్ అవార్డులు అందుకున్న అల్లు అర్జున్, ఆలియా, కృతి
National Film Awards 2023: నేషనల్ ఫిల్మ్ అవార్డులు అందుకున్నారు అల్లు అర్జున్, ఆలియా, కృతి సనన్. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో మంగళవారం (అక్టోబర్ 17) ఈ అవార్డుల వేడుకలు ఘనంగా జరిగాయి.
National Film Awards 2023: 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం (అక్టోబర్ 17) ఢిల్లీలో ఘనంగా జరిగింది. 2021 ఏడాదికిగాను ఈ అవార్డులను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్, బెస్ట్ యాక్ట్రెస్ గా ఆలియా భట్, కృతి సనన్ లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.
పుష్ప ది రైజ్ మూవీకిగాను అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఇక మిమి మూవీకిగాను కృతి సనన్, గంగూబాయి కఠియావాడి సినిమాకుగాను ఆలియా భట్ ఉత్తమ నటిగా అవార్డును షేర్ చేసుకున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా అయితే ఏకంగా ఆరు నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంది.
ఈ మూవీ టీమ్ తోపాటు సర్దార్ ఉదమ్, గంగూబాయి కఠియావాడి, ది కశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాల టీమ్ ఈ అవార్డుల కార్యక్రమానికి వచ్చింది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్ మూవీ అవార్డు గెలుచుకుంది. ఇక ఇండియాలో అత్యున్నత సినీ పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును బాలీవుడ్ లెజెండరీ నటి వహీదా రెహమాన్ అందుకుంది.
ఈ అవార్డుల కార్యక్రమం కోసం అల్లు అర్జున్ సోమవారమే (అక్టోబర్ 16) ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. అవార్డు అందుకునే ముందు రెడ్ కార్పెట్ పై మాట్లాడిన బన్నీ.. ఓ కమర్షియల్ సినిమాకు ఈ అవార్డు అందుకోవడం తనకు డబుల్ అచీవ్ మెంట్ అని అన్నాడు. ఇక ఉత్తమ తెలుగు సినిమాగా నిలిచిన ఉప్పెన మూవీ తరఫున డైరెక్టర్ బుచ్చిబాబు సానా, ప్రొడ్యూసర్ అవార్డు అందుకున్నారు.
ఆర్ఆర్ఆర్ మూవీకి బెస్ట్ పాపులర్ మూవీ అవార్డుతోపాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్, బెస్ట్ స్టంట్స్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ లాంటి అవార్డులు రావడం విశేషం. ఈ అవార్డు అందుకునే ముందు రాజమౌళి మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో ఆరు అవార్డులు గెలుచుకోవడం తనకు, తన టెక్నీషియన్ టీమ్ మొత్తానికి దక్కిన గుర్తింపు అని, చాలా సంతోషంగా ఉందని చెప్పాడు.