National Cinema Day Postponed: బ్రహ్మాస్త్ర ఎఫెక్ట్.. రూ.75కే టికెట్ వాయిదా
National Cinema Day Postponed: బ్రహ్మాస్త్ర ఎఫెక్ట్‌తో రూ.75కే టికెట్ వాయిదా పడింది. నేషనల్ సినిమా డేను మరో వారం రోజుల తర్వాత నిర్వహించాలని నిర్ణయించారు.
National Cinema Day Postponed: నేషనల్ సినిమా డే అంటూ రూ.75కే మల్టీప్లెక్స్‌లో మూవీ చూసే అవకాశం ఇస్తామని గతంలో ప్రకటించారు. ఈ నేషనల్ సినిమా డేను సెప్టెంబర్ 16న నిర్వహించాలనీ నిర్ణయించారు. దీంతో ఆ రోజు బ్రహ్మాస్త్ర మూవీతోపాటు తెలుగులో రిలీజ్ కాబోయే మరికొన్ని సినిమాలను కూడా ఈ టికెట్ ధరకే చూడొచ్చని ఫ్యాన్స్ ఆశించారు.
కానీ ఇప్పుడా నేషనల్ సినిమా డే వాయిదా పడింది. సెప్టెంబర్ 16 బదులు సెప్టెంబర్ 23న నిర్వహించాలని నిర్ణయించారు. దీని వెనుక బలమైన కారణం లేకపోలేదు. ప్రస్తుతం బ్రహ్మాస్త్ర మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. చాలా రోజుల తర్వాత బాలీవుడ్‌లో ఓ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది. తొలి వీకెండ్‌లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.225 కోట్లు వసూలు చేసి బ్రహ్మాస్త్ర సంచలనం సృష్టించింది.
ఇలాంటి సమయంలో మల్టీప్లెక్స్ ఓనర్లు టికెట్ల రేట్లు ఆ రోజు వరకూ తగ్గించినా ఆ ప్రభావం కలెక్షన్లపై పడుతుంది. నిజానికి టికెట్ ధర తగ్గించడం వల్ల ప్రేక్షకులు భారీగా థియేటర్లకు వచ్చే అవకాశం ఉన్నా.. అందుకు మల్టీప్లెక్స్ ఓనర్లు సిద్ధంగా లేరు. బ్రహ్మాస్త్ర మూవీకి తొలి రోజే మిక్స్‌డ్ రియాక్షన్స్ వచ్చినా.. కలెక్షన్ల విషయంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
కష్టాల్లో ఉన్న బాలీవుడ్ ఇండస్ట్రీకి ఈ మూవీ కొత్త ఊపిరినిచ్చింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే బ్రేక్‌ఈవెన్ దాటి లాభాల్లో దూసుకెళ్తోంది. ఇక అదే సమయంలో ఈ శుక్రవారం (సెప్టెంబర్ 16) తెలుగులోనూ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, శాకిని డాకిని, నేను మీకు బాగా కావాల్సినవాడిని, సకలగుణాభి రామలాంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.
టికెట్ల ధరలు తగ్గించి ఉంటే ఇలాంటి చిన్న సినిమాలకు ఎంతో కొంత లాభం జరిగేది. కానీ ఇప్పుడీ రూ.75 టికెట్ నిర్ణయం వాయిదా పడటంతో వచ్చే వారం రిలీజ్ కాబోయే చిన్న సినిమాలకు కాస్త మేలు జరగనుంది.