Naresh-Pavitra Wedding: పవిత్రా లోకేష్‌తో పెళ్లిపై స్పందించిన నరేష్.. ఏమన్నారంటే?-naresh clarity on his marriage with pavitra lokesh
Telugu News  /  Entertainment  /  Naresh Clarity On His Marriage With Pavitra Lokesh
పవిత్రా లోకేష్‌తో పెళ్లిపై నరేష్ స్పందన
పవిత్రా లోకేష్‌తో పెళ్లిపై నరేష్ స్పందన

Naresh-Pavitra Wedding: పవిత్రా లోకేష్‌తో పెళ్లిపై స్పందించిన నరేష్.. ఏమన్నారంటే?

10 March 2023, 21:08 ISTMaragani Govardhan
10 March 2023, 21:08 IST

Naresh-Pavitra Wedding: నటి పవిత్రా లోకేష్‌తో తన పెళ్లిపై నరేష్ స్పందించారు. పెళ్లి భోజనం ఎప్పుడు పెడతారు? అని ఓ విలేకరు ప్రశ్నించగా.. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత ఇస్తానని తెలిపారు.

Naresh-Pavitra Wedding: టాలీవుడ్ నటులు నరేష్, పవిత్ర లోకేష్ గురించి ఎలాంటి వార్త బయటకొచ్చిన అది పెద్ద హాట్ టాపిక్‌గా మారుతోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఇద్దరూ ముద్దు పెట్టుకుంటూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని హింట్ ఇచ్చారు. శుక్రవారం నాడు వివాహం చేసుకున్నట్లున్న వీడియోను షేర్ చేస్తూ షాకిచ్చారు నరేష్. అయితే నిజంగానే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా? లేక సినిమా షూటింగ్‌లో భాగమో అర్థం కాక నెటిజన్లు అయోమయంలో పడ్డారు. తాజాగా ఈ పెళ్లి వీడియోపై నరేష్ స్పందించారు. త్వరలోనే అన్ని విషయాలను చెబుతానంటూ స్పష్టం చేశారు.

ఇంటింటి రామాయణం అనే మూవీ ప్రమోషన్లలో భాగంగా ప్రెస్ మీట్‌లో పాల్గొన్న నరేష్‌ను పెళ్లి వీడియో గురించి విలేకరులు అడిగారు. మీ పెళ్లి ఎప్పుడు? పెళ్లి భోజనం ఎప్పుడు పెడతారు అని ప్రశ్నించగా.. నరేష్ మాట్లాడుతూ.. "ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుంది. నాకు కూడా రీల్ లైఫ్, రియల్ లైఫ్ ఉన్నాయి. నేను మీడియాలో ఫ్రెండ్లీగా ఉంటాను. త్వరలోనే ఈ విషయంపై సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు వెల్లడిస్తా. అప్పటి వరకు ఓపిక పట్టండి. ఇప్పుడు ఈ విషయంపై మాట్లాడితే ఇంటింటి రామాయణం ప్రమోషన్ పక్కదోవ పడుతుంది." అని అన్నారు.

ఇంటింటి రామాయణం మూవీ గురించి మాట్లాడిన ఆయన.. తెలంగాణ యాసలో తొలిసారి మాట్లాడినట్లు తెలిపారు. "ఇది తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. మట్టి వాసన నచ్చే ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది. ఈ సినిమా ఒక ప్రాంతానికి పరిమితమయ్యే సినిమా కాదు. మారుతి సినిమాలంటే నాకిష్టం. భలే భలే మగాడివోయ్ చేసేటప్పుడు సినిమా అంతా నవ్వుతూనే ఉన్నాను. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ మూవీకి అలా నవ్వాను. ప్రతి ఇంటికి ఒక రామాయణం ఉంటుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది." అని చెప్పారు.

శుక్రవారం ఉదయం నరేష్ తన ట్విటర్‌లో పవిత్రా లోకేషన్‌ను వివాహం చేసుకుంటున్నట్లున్న వీడియోను షేర్ చేశారు. ఒక పవిత్రబంధం.. రెండు మనసులు.. మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు మీ పవిత్రా-నరేష్ అని పోస్ట్ పెట్టారు. దీంతో వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. వీరిద్దరూ తొలిసారి సమ్మోహనం చిత్రం కోసం కలిసి పనిచేశారు. ఆ తర్వాత వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకుంటారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే డిసెంబరు 31న వీరిద్దరూ ముద్దుపెట్టుకుంటున్నట్లున్న వీడియోను షేర్ చేయడంతో పెళ్లిపై క్లారిటీ వచ్చింది.

టాపిక్