Mahesh Babu | కూతురి ప్రతిభను చూసి గర్వపడుతున్న మహేష్
కూతురి ప్రతిభను చూసి తండ్రిగా సంతోషపడుతున్నారు మహేష్ బాబు. సితార తనను గర్వపడేలా చేసిందని అన్నారు.
తండ్రిగా కూతురి ప్రతిభను చూసి ఉప్పొంగిపోతున్నారు మహేష్ బాబు. డ్యాన్సుల పట్ల సితార లో ఉన్న తపన, అంకితభావాన్ని చూసి సంతోషపడుతున్నారు. సితారపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. చిన్నతనం నుంచి మల్టీటాలెంటెడ్ గా పేరుతెచ్చుకొని తండ్రికి తగ్గ తనయగా నిరూపించుకుంటోంది సితార. తండ్రి సినిమా పాటలకు పలుమార్లు అదిరిపోయే స్టెప్పులు వేసి మెప్పించింది. ఆ వీడియోలను మహేష్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ‘సర్కారువారి పాట’ సినిమాలో పెన్నీ సాంగ్ లో తండ్రితో కలిసి నటించింది సితార. ఈ సినిమాతోనే ఆమె వెండితెరపై తొలి అడుగు వేసింది.
వెస్ట్రన్ డ్యాన్సుల్లోనే కాదు క్లాసికల్ లో కూడా సితారకు ప్రవేశం ఉంది. కూతురు కూచిపూడి డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఆదివారం మహేష్ బాబు ట్విట్టర్ లో షేర్ చేశారు. సితార తొలి కూచిపూడి నృత్య ప్రదర్శన వీడియోను శ్రీరామనవమి రోజున అందరితో పంచుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. ‘డ్యాన్స్ పట్ల సితారకు ఉన్న అంకితభావం చూస్తుంటే ముచ్చటేస్తుంది. తండ్రిగా నన్ను మరింత గర్వపడేలా చేసింది’ అని మహేష్ బాబు పేర్కొన్నారు. శ్రీరాముని గొప్పతనాన్ని చాటిచెప్పే శ్లోకానికి సితార చక్కటి హావభావాలతో నృత్యం చేసి ఆకట్టుకున్నది .ఆమెకు కూచిపూడిలో శిక్షణ ఇచ్చిన అరుణ భిక్షు, మహతి బిక్షులకు మహేష్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం సితార డ్యాన్స్ చేస్తున్న వీడియో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.
టాపిక్