Mega Heroes Remakes: మెగా హీరోలు రీమేక్ చేసిన‌ ద‌ళ‌ప‌తి విజ‌య్ సినిమాలు ఇవే - అందులో హిట్స్ ఎన్నంటే?-love today to kaththi these are the thalapathy vijay tamil movies remade by mega heroes in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mega Heroes Remakes: మెగా హీరోలు రీమేక్ చేసిన‌ ద‌ళ‌ప‌తి విజ‌య్ సినిమాలు ఇవే - అందులో హిట్స్ ఎన్నంటే?

Mega Heroes Remakes: మెగా హీరోలు రీమేక్ చేసిన‌ ద‌ళ‌ప‌తి విజ‌య్ సినిమాలు ఇవే - అందులో హిట్స్ ఎన్నంటే?

Nelki Naresh Kumar HT Telugu
Feb 27, 2024 10:23 AM IST

Mega Heroes Remakes: విజ‌య్ హీరోగా న‌టించిన ప‌లు కోలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌ను తెలుగులోకి మెగా హీరోలు రీమేక్ చేశారు. ఈ రీమేక్‌లు త‌మిళ వెర్ష‌న్ కంటే ఎక్కువ‌గా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి. ఆ సినిమాలు ఏవంటే?

ల‌వ్ టుడే (త‌మిళం) - సుస్వాగ‌తం (తెలుగు)
ల‌వ్ టుడే (త‌మిళం) - సుస్వాగ‌తం (తెలుగు)

Mega Heroes Remakes: కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టించిన ప‌లు త‌మిళ సినిమాలు తెలుగులోకి రీమేక‌య్యాయి. విజ‌య్ సినిమాల్ని మెగా హీరోలు ఎక్కువ‌గా రీమేక్ చేశారు. ఈ రీమేక్ మూవీస్ అన్ని టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి. కొన్ని సినిమాలు ఒరిజిన‌ల్ త‌మిళ సినిమాల కంటే ఎక్కువ‌గా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాయి. విజ‌య్ సినిమాలు ఇప్ప‌టివ‌ర‌కు ప‌ది తెలుగులోకి రీమేక‌య్యాయి. వాటిలో మూడు సినిమాల‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలుగులోకి రీమేక్ చేశాడు. ఓ సినిమాలో చిరంజీవి న‌టించాడు. ఆ సినిమాలు ఏవంటే?

ల‌వ్ టుడే (త‌మిళం) - సుస్వాగ‌తం (తెలుగు)…

విజ‌య్ హీరోగా త‌మిళంలో 1997లో రూపొందిన ల‌వ్ టుడే మూవీ క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద విజ‌యాన్ని సాధించింది. విజ‌య్‌కి ల‌వ‌ర్‌బాయ్‌గా ఇమేజ్ తీసుకొచ్చిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. కోలీవుడ్‌లో థియేట‌ర్ల‌లో 175 రోజుల‌కుపైగా స‌క్సెస్‌ఫుల్‌గా రన్ అయినా మూవీని తెలుగులో సుస్వాగ‌తం పేరుతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీమేక్ చేశాడు. తెలుగులోనూ ఈ మూవీ స‌క్సెస్ అయ్యింది.

ఓ అమ్మాయి ప్రేమ కోసం ప‌రిత‌పించే యువ‌కుడిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. సుస్వాగ‌తం సినిమాకు భీమినేని శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సుస్వాగ‌తం సినిమాతో దేవ‌యాని హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో ఎస్ఏ రాజ్‌కుమార్ అందించిన పాట‌లు మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను ఆక‌ట్టుకున్నాయి.

ఖుషి (త‌మిళం) - ఖుషి (తెలుగు)…

యూత్ ఆడియెన్స్‌లో ప‌వ‌న్ క్రేజ్‌, ఇమేజ్‌ను పెంచిన సినిమాల్లో ఖుషి ఒక‌టి. సిద్ధార్థ‌ రాయ్ అలియాస్ సిద్ధు పాత్ర‌లో డిఫ‌రెంట్‌ మేన‌రిజ‌మ్స్‌, యాక్టింగ్‌తో అభిమానుల‌ను మెప్పించాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఖుషి సినిమాతో ప‌వ‌న్ స్టార్ హీరోల లీగ్‌లో అడుగుపెట్టాడు. అయితే ఖుషి ఒరిజిన‌ల్ మూవీ కాదు. రీమేక్ కావ‌డం గ‌మ‌నార్హం.

ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా త‌మిళంలో ఖుషి పేరుతో రూపొందిన ఈ మూవీని అదే పేరుతో ప‌వ‌న్ తెలుగులోకి రీమేక్ చేశాడు. త‌మిళ మాతృక‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఎస్‌జే సూర్య తెలుగు రీమేక్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఖుషి త‌మిళ మూవీ కంటే తెలుగు వెర్ష‌న్ ఎక్కువ‌గా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఖుషి తెలుగు మూవీలో భూమిక హీరోయిన్‌గా న‌టించింది.

తిరుపాచ్చి (త‌మిళం) - అన్న‌వ‌రం (తెలుగు)…

ఖుషి రిలీజైన ఐదేళ్ల త‌ర్వాత విజ‌య్ మ‌రో మూవీని ప‌వ‌న్ తెలుగులోకి రీమేక్ చేశాడు. కానీ ఈ సారి మాత్రం రిజ‌ల్ట్ భిన్నంగా వ‌చ్చింది. విజ‌య్ హీరోగా సిస్ట‌ర్ సెంటిమెంట్‌తో రూపొందిన తిరుపాచి త‌మిళంలో రికార్డు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ అప్ప‌ట్లో విజ‌య్ కెరీర్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.

తిరుపాచి సినిమాను అన్న‌వ‌రం పేరుతో తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీమేక్ చేశాడు. త‌మిళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన ఈ మూవీ తెలుగులో మాత్రం డిజాస్ట‌ర్ అయ్యింది. ఓవ‌ర్ సెంటిమెంట్ రోల్‌లో ప‌వ‌న్‌ను ఆడియెన్స్ చూడ‌లేక‌పోయారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీమేక్ చేసిన విజ‌య్ సినిమాల్లో అన్న‌వ‌రం చివ‌రిది కావ‌డం గ‌మ‌నార్హం.

క‌త్తి (త‌మిళం) - ఖైదీ నంబ‌ర్ 150…

పాలిటిక్స్ కార‌ణంగా సినిమాల‌కు బ్రేక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబ‌ర్ 150 మూవీతో 2017లో రీఎంట్రీ ఇచ్చాడు. వీవీ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీ 165 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. త‌మిళంలో విజ‌య్ హీరోగా న‌టించిన క‌త్తి మూవీకి రీమేక్‌గా ఖైదీ నంబ‌ర్ 150 తెర‌కెక్క‌డం గ‌మ‌నార్హం. క‌త్తి మూవీ త‌మిళంలో 120 కోట్ల వ‌సూళ్ల‌ను సాధిచంగా...ఖైదీ నంబ‌ర్ 150 మాత్రం ఒరిజిన‌ల్ కంటే యాభై కోట్లు ఎక్కువ‌గానే క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. క‌త్తి మూవీలో స‌మంత హీరోయిన్‌గా న‌టించ‌గా...ఖైదీ నంబ‌ర్ 150లో కాజ‌ల్ హీరోయిన్‌గా క‌నిపించింది.

Whats_app_banner