Pawan vs Ys jagan: బాక్సాఫీస్ వద్ద వైఎస్ జగన్‌తో పవన్ పోటీ - కెమెరామెన్ గంగతో రాంబాబు రీ రిలీజ్ డేట్ ఇదే!
Cameraman Gangatho Rambabu: వైఎస్ జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న యాత్ర 2కు పోటీగా పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబు థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిసింది.
Cameraman Gangatho Rambabu:ఎన్నికలకు ముందే వైఎస్ జగన్‌తో పవన్ పోటీపడేందుకు రెడీ అవుతోన్నారు. అయితే రాజకీయాల్లో కాదు. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద. వైఎస్ జగన్ జీవితం ఆధారంగా యాత్ర 2 మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. యాత్ర 2కు ఒక రోజు ముందుగా పవన్ కళ్యాణ్ కెమెరా మెన్ గంగతో రాంబాబు రీ రిలీజ్ కాబోతోంది.
ఫిబ్రవరి 7న ఈ మూవీని రీ రిలీజ్ చేయనున్నట్లు తెలిసింది. యాత్ర 2కు పోటీగానే ఈ మూవీని థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. కెమెరామెన్ గంగతో రాంబాబు రీ రిలీజ్ హక్కులను నట్టికుమార్ సొంతం చేసుకున్నాడు. త్వరలోనే ఈ మూవీ రీ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నట్లు తెలిసింది.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో...
కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్నది. 2012లో తెలంగాణ ఉద్యమం ఊపు మీదున్న తరుణంలో కెమెరామెన్ గంగతో రాంబాబు రిలీజైంది. తెలంగాణ ఉద్యమకారులకు కించపరిచేలా ఈ మూవీ ఉందంటూ వివాదం రావడంతో నైజంలో చాలా చోట్ల మూవీ ప్రదర్శనను నిలిపివేశారు. కొన్ని సీన్స్‌ను కట్ చేసి మళ్లీ స్క్రీనింగ్ చేశారు. ఆ ఎఫెక్ట్ కారణంగా సినిమా కమర్షియల్‌గా అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది.
బద్రి తర్వాత...
కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించింది. ప్రకాష్‌రాజ్ కీలక పాత్ర పోషించాడు. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించాడు. బద్రి తర్వాత పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ ఇది.
జగన్ జీవితంలో పదేళ్లు ఏం జరిగింది...
కాగా యాత్ర 2 మూవీ 2009 నుంచి 2019 మధ్య కాలంలో వైఎస్ జగన్ జీవితంలో ఏం జరిగిందనే అంశాలతో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ నటుడు జీవా నటించారు. మమ్ముట్టి కీలక పాత్ర పోషించాడు. యాత్ర 2 మూవీకి మహి వి రాఘవ్ దర్శకత్వం వహించాడు. యాత్ర 2కు పోటీగా భారీ థియేటర్లలో కెమెరామెన్ గంగతో రాంబాబును రీ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.
సినిమాలు- రాజకీయాలు...
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓ వైపు ప్రత్యక్ష రాజకీయాలపై దృష్టిసారిస్తూనే మరోవైపు మూడు సినిమాలు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓజీ మూవీ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సుజీత్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. మరో పదిహేను రోజులు మాత్రమే పవన్ షూటింగ్ బ్యాలెన్స్‌గా ఉన్నట్లు సమాచారం.
గబ్బర్‌సింగ్ తర్వాత పవన్‌కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీ రానుంది. తమిళంలో విజయవంతమైన తేరీ రీమేక్‌గా ఈ మూవీ రూపొందుతోంది. అలాగే క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు మూవీని పవన్ చేస్తున్నాడు. పవన్ ఏపీ ఎన్నికలపై దృష్టిసారించడంతో ఈ మూడు సినిమాల షూటింగ్‌లకు ప్రస్తుతం బ్రేక్ పడింది. ఈ ఏడాది ఓజీతో పాటు మిగిలిన రెండు సినిమాలు రిలీజయ్యే అవకాశం ఉందని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు.