Love Today Movie Review: లవ్ టుడే మూవీ రివ్యూ - యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్
Love Today Movie Review: ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా లవ్ టుడే. తమిళంలో విజయవంతమైన ఈ సినిమాను తెలుగులో దిల్‌రాజు డబ్ చేశారు. శుక్రవారం రిలీజైన ఈ సినిమా ఎలా ఉందంటే...
Love Today Movie Review: తమిళంలో ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో లవ్‌టుడే ఒకటి. దాదాపు ఐదు కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చిన్న సినిమా యాభై కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి సంచలన విజయాన్ని సాధించింది. ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా నటిస్తూ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇవానా, సత్యరాజ్, రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను అదే పేరుతో అగ్ర నిర్మాత దిల్‌రాజు తెలుగులో డబ్ చేశారు. ఈ శుక్రవారం లవ్ టుడే సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళంలో కమర్షియల్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిందా లేదా చూద్దాం.
Love Today Story -ఒక రోజు ఫోన్ మార్చుకోవాల్సివస్తే...
ఉత్తమన్ ప్రదీప్ (ప్రదీన్ రంగనాథన్), నిఖిత (ఇవానా) ప్రేమించుకుంటుంటారు. పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతారు. పెళ్లి జరగాలంటే ఒకరి ఫోన్‌ను మరొకరు ఒక్కరోజు మార్చుకోవాలని నిఖిత తండ్రి వేణు శాస్త్రి (సత్యరాజ్) కండీషన్ పెడతాడు. ఫోన్‌లో ఒకరిగురించి మరొకరికి తెలియని చాలా రహస్యాలు ఉండటంతో అవి ఎక్కడ బయటపడతాయో అని ఇద్దరు భయపడుతుంటారు. ఫోన్ మార్పిడి వల్లే నిఖిత అంతకుముందు మరో యువకుడిని ప్రేమించిందనే విషయం ప్రదీప్‌కు తెలుస్తుంది.
అలాగే ప్రదీప్ ఇతర అమ్మాయిలతో చాటింగ్ చేయడం, అతడి బ్రేకప్‌లకు సంబంధించిన అన్ని వాస్తవాలు నిఖితకు అర్థమవుతాయి. అంతే కాకుండా నిఖిత చెల్లికి అసభ్యకరమైన మెసేజ్‌లు కూడా ప్రదీప్ యూజ్ చేసే ఇన్‌స్టాగ్రామ్ ఆకౌంట్ నుంచి వెళుతుంటాయి. ఫోన్ మార్చుకోవడం వల్ల ప్రదీప్, నిఖిత విడిపోయే పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది?
ఒకరి ఫోన్‌ను మరొకరు మార్చుకోవాలని వేణుశాస్త్రి కండీషన్ ఎందుకు పెట్టాడు? ప్రదీప్ గురించి నిఖితకు, నిఖిత గురించి ప్రదీప్ తెలుసుకున్న నిజాలేమిటి? తమ తప్పుల్ని సరిదిద్దుకుంటూ ఇద్దరు ఒక్కటయ్యారా? ప్రదీప్ తప్పులను అతడి తల్లి సరస్వతి (రాధికా శరత్‌కుమార్) ఎలా సరిదిద్దింది అన్నదే ఈ సినిమా కథ.
న్యూఏజ్ లవ్ స్టోరీ...
లవ్ టుడే ప్రాపర్ న్యూఏజ్ సినిమా. సోషల్ మీడియా, ఫోన్ లోకంగా బతుకుతున్న నేటితరం యువత జీవనశైలిని ఎంటర్‌టైనింగ్‌గా దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాలో చూపించారు. సోషల్ మీడియా ద్వారా మొగ్గతొడిగిన ప్రేమల్లో నిజాయితీ ఉంటుందా? నమ్మకంతో నిలబడాల్సిన ప్రేమ బంధాలను అనుమానాలతో ఎలా తుంచేసుకుంటున్నారు. నేటితరం ప్రేమపెళ్లిళ్లలో పదింట కేవలం ఒక వంతు మాత్రమే సక్సెస్ కావడానికి కారణమేమిటనే పాయింట్‌ను సమకాలీన అంశాలతో ఆలోచనాత్మకంగా ఈ సినిమా ద్వారా ఆవిష్కరించారు.
కేవలం అవసరం కోసమే ఉపయోగించాల్సిన ఫోన్‌లో తమ జీవితానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన విషయాల్ని దాచుకుంటున్న యువతరం ఆ రహస్యాలు బయటివారికి తెలియకుండా ఉండటానికి పడే పాట్లను ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ఈ సినిమాలో చూపించారు. ఫేక్ ఐడీలు, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోల పేరుతో సరదాగా చేసే కొన్ని పనులు ఎదుటివారి జీవితాల్ని ఎలా చిన్నాభిన్నం చేస్తాయనే సందేశాన్ని ఎమోషనల్‌గా ఈ సినిమాలో చూపించారు.
సందేశం...
సందేశాన్ని సీరియస్‌గా చెబితే ప్రేక్షకులు ఆదరించే రోజులు పోయాయి. ఎంతటి సీరియస్ సబ్జెక్ట్ అయినా షుగర్ కోటెడ్‌లా కామెడీని జోడించి చెప్పడమే ఇప్పుడు ట్రెండ్‌గా మారిపోయింది. లవ్ టుడే అలాంటి సినిమానే. ప్రజెంట్ సొసైటీలోని ఓ సీరియస్ ఇష్యూను ఎంటర్‌టైనింగ్‌గా ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఎనభై శాతం వరకు కామెడీ, ఓ ఇరవై శాతం మాత్రమే సెంటిమెంట్ ఉండేలా స్క్రీన్‌ప్లే రాసుకున్నారు. సినిమా ఆద్యంతం సిట్యువేషనల్ కామెడీతో సాగుతుంది. ఎమోషన్స్ కూడా ఫోర్స్‌డ్‌లా కాకుండా రియలిస్టిక్‌గా రాసుకున్న విధానం బాగుంది.
హిలేరియస్ ఫన్...
ఫోన్ మార్చుకోవడం వల్ల ఒకరి తప్పులు మరొకరికి తెలిసిపోయే సన్నివేశాలు హిలేరియస్‌గా వర్కవుట్ అయ్యాయి. ఆ సన్నివేశాల్లో ప్రదీప్ ఎక్స్‌ప్రెషన్స్, డైలాగ్స్ నవ్విస్తాయి. అమాయకుడిగా నటించే ప్రదీప్ తన తప్పులు బయటపడిన తర్వాత వాటిని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు, ఈ క్రమంలో తొందరపాటుతో తానే ఆ తప్పులకు సంబంధించి ఏదో క్లూ హీరోయిన్‌కు ఇవ్వడం వంటివన్నీ సిట్యూవేషన్స్ తగ్గట్లుగా చక్కగా రాసుకున్నారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ పూర్తిగా సెంటిమెంట్ ప్రధానంగా సాగుతుంది. ప్రదీప్, నిఖితలలో మార్పు వచ్చిన సీన్స్‌లో ఎమోషన్స్ బాగా పండాయి.
ధనుష్‌ను ఇమిటేట్...
దర్శకుడిగా, నటుడిగా రెండు బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తించాడు దర్శకుడు ప్రదీప్ రంగనాథన్. ప్రదీప్ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. అతడి పాత్రతో యూత్ చాలా మంది కనెక్ట్ అవుతారు. రియలిస్టిక్ యాక్టింగ్‌తో మెప్పించాడు. కొన్ని చోట్ల ధనుష్‌ను ఇమిటేట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. నిఖిత పాత్రలో ఇవానా నటన బాగుంది. ఎమోషనల్, కామెడీ రెండింటిని చక్కగా పండించింది. సత్యరాజ్, రాధికా శరత్‌కుమార్ పాత్రలు ఈ సినిమాకు పెద్ద బలంగా నిలిచాయి. కీలకమైన పాత్రల్లో చక్కగా నటించారు. యోగిబాబు, రవీవారవి ట్రాక్ చక్కగా వర్కవుట్ అయ్యింది. యువన్‌శంకర్ రాజా బీజీఎమ్ ఈ సినిమామరో పెద్ద ఎస్సెట్‌గా చెప్పవచ్చు. క్యాచీ ట్యూన్స్‌తో మెప్పించాడు.
Love Today Movie Review- ఫన్ ఎంటర్‌టైనర్...
రెండున్నర గంటలు కడుపుబ్బా నవ్వించే పర్‌ఫెక్ట్ టైమ్ పాస్ ఎంటర్‌టైనర్‌గా లవ్‌టుడే నిలుస్తుంది. నవ్విస్తూనే చివరలో ఆలోచించజేసే మంచి సినిమా.
రేటింగ్: 3/5