Kota Bommali ps Review: కోట బొమ్మాళి పీఎస్ రివ్యూ - మలయాళ రీమేక్ మూవీ ఎలా ఉందంటే?
Kota Bommali ps Review: శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన కోటబొమ్మాళి పీఎస్ సినిమా శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాకు తేజా మార్ని దర్శకత్వం వహించాడు.
Kota Bommali ps Review: శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన కోటబొమ్మాళి పీఎస్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు తేజా మార్ని దర్శకత్వం వహించాడు. మలయాళంలో విజయవంతమైన నయట్టు రీమేక్‌గా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే…
కోట బొమ్మాళి పోలీసుల కథ...
రామకృష్ణ (శ్రీకాంత్) కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటాడు. పోలీస్ వ్యవస్థలోని లోతుపాతులు అన్నీ తెలిసిన వ్యక్తి. తన పోలీస్ స్టేషన్‌లోనే పనిచేసే కానిస్టేబుల్ రవి (రాహుల్ విజయ్) హెడ్ కానిస్టేబుల్ కుమారిలతో (శివాని రాజశేఖర్) కలిసి రామకృష్ణ ఓ పెళ్లికి హాజరవుతాడు. ఆ ఫంక్షన్ నుంచి తిరిగి వస్తోన్న క్రమంలో వారు చేసిన యాక్సిడెంట్ వల్ల ఓ వ్యక్తి చనిపోతాడు.
అదే సమయంలో వారి ప్రాంతంలో ఉప ఎన్నికలు జరుగుతుండటంతో ఆ హత్య రాజకీయ రంగు పులుముకుంటుంది. ఆ తప్పు చేయలేదని తెలిసినా తామే హంతకులుగా మారుతామని ఊహించిన రామకృష్ణ... రవి, కుమారిలను తీసుకొని పారిపోతాడు. ఈ ముగ్గురిని పట్టుకునే బాధ్యతను ఎస్పీ రజియా అలీకి (వరలక్ష్మి శరత్‌కుమార్) అప్పగిస్తాడు హోమ్‌మంత్రి బరిసెల జయరామ్ (మురళీ శర్మ). రామకృష్ణ, కుమారి, రవి పోలీసులకు దొరికారా?
అసలు ఆ వ్యక్తి యాక్సిడెంట్‌లోనే చనిపోయాడా? హతుడితో కుమారి బావ మున్నాకు ఉన్న గొడవలు ఏమిటి? రజియా అలీకి దొరకకుండా రామకృష్ణ ఎలాంటి ఎత్తులు వేశాడు? పోలీస్ అయినా అతడు చివరకు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి బలీయమైన నిర్ణయం తీసుకున్నాడు అన్నదే కోట బొమ్మాళి పీఎస్ మూవీ కథ.
నయట్టు రీమేక్...
2021లో మలయాళంలో రూపొందిన నయట్టు మూవీ విమర్శకుల ప్రశంసలతో పాటు ఆస్కార్‌కు ఇండియా నుంచి షార్ట్ లిస్ట్ అయిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ మలయాళ సినిమాను కోటబొమ్మాళి పీఎస్ పేరుతో దర్శకుడు తేజ మార్ని తెలుగులోకి రీమేక్ చేశారు. ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు తమ అధికారాన్ని నిలుపుకోవడం ఎలాంటి ఎత్తులు వేస్తుంటారు. ఈ రాజకీయ చదరంగంలో సామాన్యులతో పాటు కొన్ని సార్లు చట్టాన్ని రక్షించే పోలీసులు కూడా ఎలా సమిధలవుతుంటారు అన్నది కోట బొమ్మాళి సినిమాలో దర్శకుడు చూపించారు.
పోలీసులు వర్సెస్ పోలీసులు...
పోలీసులు, దొంగల మధ్య పోరు అన్నది చాలా సినిమాల్లో కనిపిస్తుంటుంది. కానీ ఈ సినిమాలో మాత్రం పోలీసులు తమ డిపార్టెంట్‌మెంట్‌కు చెందిన పోలీసులను పట్టుకోవడానికి ప్రయత్నించడం అనే పాయింట్ కొత్తగా ఉంటుంది. రీమేక్ సినిమానే అయినా ఆ ఫీలింగ్ రాకుండా దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ముఖ్యంగా శ్రీకాకుళం యాస, ఆ నేటివిటీ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా నిలిచాయి.
ఎన్‌కౌంటర్ సీన్‌తో...
ఎన్‌కౌంటర్ సీన్‌తోనే ఆసక్తికరంగా ఈ సినిమా మొదలువుతంది. ఓ వైపు ఉపఎన్నికలు, సామాజిక వర్గాల గొడవలు మరోవైపు రవి, రామకృష్ణ కుమారి జీవితాల్ని చూపిస్తూ దర్శకుడు కథను థ్రిల్లింగ్‌గా నడిపించారు. ఈ ముగ్గురు క్రైమ్‌లో చిక్కుకునే సీన్‌తోనే కథ ఎమోషనల్‌గా మారుతుంది.
సెకండాఫ్‌లో రామకృష్ణ రవి, కుమారిలను పట్టుకోవడానికి రజియా అలీ ఎత్తులు వేయడం, ఆమె వేసిన ప్లాన్స్‌ను తన తెలివితేటలతు, అనుభవంతో రామకృష్ణ తిప్పికొట్టే సీన్స్ థ్రిల్లింగ్‌ను పంచుతాయి. క్లైమాక్స్ ఎమోషనల్‌గా ముగుస్తుంది. మలయాళంతో పోలిస్తే ఇంటెన్స్‌గా ఈ సీన్స్‌ను డైరెక్టర్ రాసుకున్నాడు. ఇలాంటి సినిమాల్లో పాటలకు పెద్దగా తావు ఉండదు. లింగి లింగిడి పాట విషయంలో దర్శకుడు తెలివిగా మ్యానేజీ చేశాడు.
రీమేక్ కత్తి మీద సాము...
రీమేక్‌సినిమా అంటే కత్తిమీద సాము. అందులో పొలిటికల్ టచ్ ఉన్న పాయింట్స్ అంటే చాలా జాగ్రత్తగా తీయాల్సిఉంటుంది. ఈ సినిమాలో విషయంలో దర్శకుడు చాలా వరకు విజయవంతమయ్యాడు. సమకాలీన రాజకీయాలపై వచ్చే సంభాషణలు ఆలోచింపజేస్తాయి.
సెకండ్ ఇన్నింగ్స్‌లో బెస్ట్ క్యారెక్టర్...
ఈ సినిమాలో ప్రత్యేకంగా హీరోహీరోయిన్లు అంటూ ఎవరూ కనిపించరు. ప్రతి పాత్రకు దర్శకుడు ఇంపార్టెన్స్ ఇచ్చాడు. నటన పరంగా అందరికంటే ఎక్కువగా శ్రీకాంత్‌కే మార్కులు పడతాయి. హెడ్‌కానిస్టేబుల్ పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. అతడిసెకండ్ ఇన్నింగ్స్‌లో గుర్తుండిపోయే సినిమాగా కోట బొమ్మాళి పీఎస్ నిలుస్తుంది. పాజిటివ్ షేడ్స్‌తో కనిపించే నెగెటివ్ పాత్రలో వరలక్ష్మి శరత్‌కుమార్ నటన ఆకట్టుకుంటుంది. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్‌లకు యాక్టింగ్ స్కోప్ ఉన్న ఛాలెంజింగ్ రోల్స్ దక్కాయి. మురళీశర్మ కూడా మెప్పించాడు.
కోట బొమ్మాళి థ్రిల్లింగ్...
కోటా బొమ్మాళి పీఎస్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పోలిస్తే భిన్నమైన ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. మలయాళ సినిమా నయట్టు చూడని వారికి థ్రిల్లింగ్‌ను పంచుతుంది.