Acharya | ఆచార్య స్టోరీని కొంచెం కూడా ఊహించలేరు.. అంచనాలకు అందదు: కొరటాల శివ
ఆచార్య చిత్ర దర్శకుడు కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆచార్య చిత్ర కథ అంత సులభంగా ఊహించలేమని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎన్టీఆర్‌తో సినిమాకు సంబంధించి కూడా స్పందించారు.
టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ దర్శకుడు కొరటాల శివ తను తెరెకెక్కించిన తాజా చిత్రం ఆచార్య ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరినీ ఒకే తెరపై ఆవిష్కరింపజేసి అభిమానుల అంచనాలను అమాంతం పెంచేశారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. తాజాగా ఆచార్య ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కాజల్ అగర్వాల్‌ను సినిమా నుంచి తొలగించడాన్ని, అంతేకాకుండా ఈ సినిమా కథకు సంబంధించిన విషయాలను తెలిపారు.
"ఆచార్య స్టోరీ లైన్ చాలా కాలం నుంచి నా దగ్గర ఉంది. ఈ కథతో మెగాస్టార్‌తో పనిచేయాలనేది నా కల. ఎట్టకేలకు నా స్వప్నం సాకారమైంది. ట్రైలర్‌లో నేను చూపించ సన్నివేశాలు కేవలం యాంబియన్స్ బ్యాక్‌డ్రాప్ మాత్రమే. స్టోరీలో కొంత భాగం కూడా చూపించలేదు. ఆచార్య కథ అంత సులభంగా ఊహించలేరు. ఈ చిత్రం అంచనాలకు అందదు" అని కొరటాల శివ తెలియజేశారు. రామ్ చరణ్ పాత్ర గురించి మాట్లాడిన ఆయన.. కథలో అతడి పాత్ర ఎంతో కీలకమైందని చెప్పుకొచ్చారు.
"కథ రాసేటప్పుడు రామ్ చరణ్ పాత్ర అస్సలు లేదు. తర్వాత కాలంలో కొద్దికొద్దిగా చరణ్‌కు పర్ఫెక్టుగా సూటయ్యే విధంగా ఆ పాత్రను అభివృద్ధి చేశాం. పూజా బ్రాహ్మణ అమ్మాయి పాత్రలో నటించగా.. చరణ్ అక్కడ విద్యార్థిగా కనిపిస్తాడు. కథలో చరణ్‌ది కీలకమైన పాత్ర." అని కొరటాల శివ తెలిపారు. కాజల్ అగర్వాల్‌ను సినిమా నుంచి తొలగించినట్లు ఆయన చెప్పారు.
"ఫస్ట్ సినిమా అనుకున్నప్పుడు చిరంజీవి కి జోడీగా కాజల్ అయితే బాగుంటుందని అనుకున్నాం. ధర్మస్థలిలో ఉండే అమ్మాయిగా ఫన్నీగా ఆమె క్యారెక్టర్ రాసుకున్నా. ఫస్ట్ షెడ్యూల్ లో ఆమెపై నాలుగు రోజులు కొన్ని సీన్స్ షూట్ చేశాం.ఆ సీన్స్ చూసుకుంటే కావాలనే కాజల్ క్యారెక్టర్ ను పెట్టినట్లుగా అనిపించింది. ఆచార్య పాత్రకు లవ్ ఇంట్రెస్ట్ ఉండే బాగుండదని అనిపించింది. హీరో భావజాలానికి అనుగుణంగా అతడి పాత్రకు పాటలు పెట్టలేము. చిరంజీవికి ఆ విషయాన్ని చెబితే నీకు ఏది మంచి అనిపిస్తే అదే చేయమన్నాడు. కాజల్ కు మా సమస్య ను విన్నవిస్తే అర్థం చేసుకుంది. నవ్వుతూనే మా నిర్ణయాన్ని అంగీకరించింది." అని కొరటాల వివరించారు.
జూనియర్ ఎన్టీఆర్‌తో తన తదుపరి చిత్రం ఉంటుందని కొరటాల శివ చెప్పారు. ఈ సినిమా కథ యూనివర్సల్ అప్పీల్ ఉంటుందని, తెలుగు పరిమితులను అధిగమించబోతున్నానని ఆయన అన్నారు. భవిష్యత్తులో ప్రభాస్, పవన్ కల్యాణ్‌తోనూ సినిమాలు చేయాలనే ఆలోచనలను కొరటాల పంచుకున్నారు.
సంబంధిత కథనం
టాపిక్