Kantara one year: కాంతారాకు ఏడాది.. వరాహ రూపం ఫుల్ వీడియో సాంగ్ వచ్చేస్తోంది
Kantara one year: కాంతారా మూవీ రిలీజై ఏడాది పూర్తవుతోంది. ఈ సందర్భంగా అభిమానులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మూవీలో సూపర్ హిట్ సాంగ్ వరాహ రూపం ఫుల్ వీడియో వచ్చేస్తోంది.
Kantara one year: కాంతారా.. గతేడాది ఓ చిన్న సినిమాగా రిలీజై బాక్సాఫీస్ దగ్గర పెను సంచలనం సృష్టించిన కన్నడ సినిమా ఇది. కన్నడలోనే కాదు తెలుగుతోపాటు హిందీ, మలయాళంలాంటి భాషల్లోనూ సక్సెస్ అయింది. సెప్టెంబర్ 30, 2022న ఈ సినిమా రిలీజైంది. ఈ శనివారానికి (సెప్టెంబర్ 30) సరిగ్గా ఏడాది పూర్తి చేసుకోబోతోంది.
ఈ సందర్భంగా మేకర్స్ ఈ కాంతారా మూవీలోని సూపర్ హిట్ సాంగ్ వరాహ రూపం ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని హోంబలె ఫిల్మ్స్ గురువారం (సెప్టెంబర్ 28) సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది. "మన స్టేడియాలు, పండగలతోపాటు ఉదయాన్నే ఈ పాట వినడం ఓ ఆనవాయితీగా మారిపోయింది. మన జీవితాల్లో ఈ పాట ఓ మరుపురాని ముద్ర వేసింది. ఆ మ్యాజిక్ ను మరోసారి ఎంజాయ్ చేద్దాం. వరాహ రూపం పాటను సెప్టెంబర్ 30న ఆవిష్కరించబోతున్నాం" అని హోంబలె ఫిల్మ్స్ ట్వీట్ చేసింది.
బాక్సాఫీస్ దగ్గర సంచలనం విజయం సాధిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ.400 కోట్లకుపైగా వసూలు చేసింది కాంతారా మూవీ. అయితే ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చినా.. అందులో ఈ వరాహ రూపం మొత్తం సాంగ్ మాత్రం లేదు. దీంతో అభిమానులు నిరాశ చెందారు. సినిమా చివర్లో వచ్చే ఈ పాట ప్రేక్షకులందరినీ ఓ ఆధ్యాత్మిక భావనలోకి తీసుకెళ్లింది.
అలాంటి పాటను ఇప్పుడు మేకర్స్ మరోసారి రిలీజ్ చేయనున్నారు. ఈ పాట అప్పట్లో కొన్ని న్యాయసంబంధిత చిక్కులను కూడా ఎదుర్కొంది. మలయాళ బ్యాండ్ తైక్కుదమ్ బ్రిడ్జ్ కాపీరైట్ కేసు వేసింది. నవరస నుంచి అజనీష్ ఈ వరాహ రూపం పాట ఎత్తేశాడని వాళ్లు ఆరోపించారు. ఆ పాటను కాపీ చేయకపోయినా.. దాని నుంచి తాను స్ఫూర్తి పొందినట్లు మాత్రం అజనీష్ చెప్పాడు. ప్రస్తుతం కాంతారా ప్రీక్వెల్ పనులు నడుస్తున్న విషయం తెలిసిందే.