K Viswanath Passed Away: లెజెండరీ డైరెక్టర్ కే విశ్వనాథ్ కన్నుమూత
K Viswanath Passed Away: టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్ గురువారం రాత్రి కన్నుమూశారు. విశ్వనాథ్ మరణంతో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది.
K Viswanath Passed Away: టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు కళాతపస్వి కే విశ్వనాథ్ గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విశ్వనాథ్ తుదిశ్వాస విడిచారు.
ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో యాభైకి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు కె. విశ్వనాథ్. సంగీతం, సాహిత్యం, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఆయన రూపొందించిన ప్రతి సినిమా తెలుగు ప్రేక్షకుల మన్ననల్ని అందుకున్నది. దాదాసాహెబ్‌ఫాల్కే, పద్మశ్రీతో పాటు ఎన్నో గొప్ప పురస్కారాలను విశ్వనాథ్ అందుకున్నారు.
ఆత్మ గౌరవం సినిమాతో…
1930 ఫిబ్రవరి 19న బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలలోని పెద పులివర్రు గ్రామంలో విశ్వనాథ్ జన్మించాడు. 1949లో డిగ్రీ పూర్తి చేసిన విశ్వనాథ్ మేనమామ ప్రోద్భలంతో వాహినీ స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్‌గా జీవితాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆత్మ గౌరవం సినిమాతో దర్శకుడిగా మారిన విశ్వనాథ్ తొలి సినిమాతోనే నంది అవార్డు అందుకున్నారు. ఆత్మ గౌరవం విజయంతో దర్శకుడిగా వెనుదిరిగి చూసుకోలేదు.
బాలీవుడ్‌లో డైరెక్షన్...
సప్తపది, సాగరసంగమం, స్వాతిముత్యం, స్వయంకృషి, స్వాతికిరణం, స్వర్ణకమలం...ఇలా ఎన్నో విజయవంతమైన సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేశారు. బాలీవుడ్‌లో 9 సినిమాలకు దర్శకత్వం వహించారు. శుభసంకల్పం సినిమాతో నటుడిగా అరంగేట్రం చేసిన విశ్వనాథ్ వందకుపైగా సినిమాల్లో గౌరవ ప్రదమైన పాత్రలు చేశారు. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన స్వాతిముత్యం సినిమా ఇండియా తరఫున అఫీషియల్ ఎంట్రీగా ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది.
టాపిక్