YVS Chowdary: ఎన్టీఆర్ నాలుగో తరాన్ని పరిచయం చేయడాన్ని గర్వంగా భావిస్తున్నా: డైరెక్టర్ వైవీఎస్
YVS Chowdary - Nandamuri Taraka Rama Rao: నందమూరి జానకి రామ్ కుమారుడు నందమూరి తారక రామారావు హీరోగా డైరెక్టర్ వైవీఎస్ చౌదరి మూవీ రూపొందించనున్నారు. ఇందుకోసం ఆయన నేడు మీడియాతో మాట్లాడారు. వివరాలు వెల్లడించారు.
YVS Chowdary: దివంగత నందమూరి జానకిరామ్ కుమారుడు ‘నందమూరి తారక రామారావు’ హీరోగా తెరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యారు. విశ్వ విఖ్యాత సీనియర్ ఎన్టీఆర్ ముని మనవడిగా.. ఆయన పేరుతోనే నందమూరి నాలుగో తరం నటుడిగా పరిచయం కానున్నారు. నందమూరి హరికృష్ణ మనవడే ఇతడు. నాలుగో తరం నందమూరి తారక రామారావును ప్రపంచానికి పరిచయం చేస్తుండడం తన అదృష్టమని వైవీఎస్ చౌదరి చెప్పారు. అతడితో సినిమాను ప్రకటించారు. ఇందుకోసం నేడు (జూన్ 10) మీడియాతో మాట్లాడారు.
గర్వంగా భావిస్తున్నా..
నందమూరి హరికృష్ణను తాను సోలో హీరోగా పరిచయం చేశానని, ఇప్పుడు ఆయన మనవుడు నందమూరి తారక రామారావును వెండితెరకు పరిచయం చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని వైవీఎస్ చౌదరి అన్నారు. పెద్ద కుమారుడు పుట్టినప్పుడే జానకిరామ్.. అతడికి నందమూరి తారక రామారావు అని పేరు పెట్టారని వైవీఎస్ చెప్పారు. తన తాతలా భవిష్యత్తులో అంతటి వాడు అవ్వాలనే కలతో ఆయన ఆ పేరు పెట్టారని తెలిపారు. నాలుగో తరం నందమూరి తారక రామారావును ఇండస్ట్రీకి పరిచయం చేయడాన్ని తాను గర్వంగా భావిస్తున్నానని వైవీఎస్ అన్నారు.
కొత్తగా ఎన్టీఆర్ బ్యానర్
అలాగే, ఎన్టీఆర్ పేరు కలిసి వచ్చేలా న్యూ టాలెంట్ రోర్స్ (NTR) అనే కొత్త బ్యానర్‌ను కూడా వైవీఎస్ చౌదరి ప్రకటించారు. తెలుగు సినిమాకు మరో నందమూరి తారక రామారావును పరిచయం చేస్తున్నామంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి యలమంచిలి గీత నిర్మాతగా వ్యవహరించనున్నారు.
వైవీఎస్ చౌదరి గతంలో సీతారామ రాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు సహా మరిన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. చివరగా 2015లో రేయ్ చిత్రాన్ని ఆయన తెరకెక్కించారు. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఇప్పుడు, తొమ్మిదేళ్ల విరామం తర్వాత మళ్లీ ఆయన రంగంలోకి దిగారు. అయితే, ఇంత గ్యాప్ రావడంపై కూడా వైవీఎస్‍కు ప్రశ్న ఎదురైంది.
మోక్షజ్ఞ ఎంట్రీ కోసం వేచిచూస్తున్నాం
నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం అభిమానులందరూ ఎంతో ఎదురుచూస్తున్నారని వైవీఎస్ చౌదరి చెప్పారు. 1975లో బాలకృష్ణ తెరంగేట్రం కోసం ఎంత తహతహలాడామో.. ఇప్పుడు మోక్షజ్ఞ కోసం అంతే వేచిచూస్తున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానులందరూ మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం వేచిచూస్తున్నారని, త్వరలోనే అతి సాకారం అవుతుందని వైవీఎస్ చౌదరి చెప్పారు.
వేరే కారణాలు ఉన్నాయి
తాను సినిమాల నుంచి గ్యాప్ తీసుకునేందుకు వేరే కారణాలు ఉన్నాయని వైవీఎస్ చౌదరి చెప్పారు. రేయ్ సినిమా డిజాస్టర్‌తో ఈ బ్రేక్‍కు సంబంధం లేదని అన్నారు. రేయ్ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్నానని, అప్పటి నుంచి తర్వాత సినిమాకు రెడీ అయ్యానని చెప్పారు. అనంతరం కరోనా రావడంతో గ్యాప్ ఎక్కువైందని అన్నారు.
తాను సినిమాలు చేయకున్నా ఎప్పటికప్పుడు అప్‍డేట్ అవుతూనే ఉన్నానని వైవీఎస్ తెలిపారు. తాను అన్ని భాషల సినిమాలను థియేటర్లలో చూస్తూనే ఉన్నానని అన్నారు. అయితే, ఈ నాలుగోతరం ఎన్టీఆర్ ఫొటోలను వైవీఎస్ చౌదరి వెల్లడించలేదు. పొడవుగా, అందంగా ఉంటారని వర్ణించారు. అతడి చిన్నప్పటి ఫొటోలు మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.