Good Night Review : తమిళ్ సూపర్ హిట్ 'గుడ్ నైట్' సినిమా రివ్యూ.. తెలుగులో ఆకట్టుకుందా?-good night movie review telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Good Night Review : తమిళ్ సూపర్ హిట్ 'గుడ్ నైట్' సినిమా రివ్యూ.. తెలుగులో ఆకట్టుకుందా?

Good Night Review : తమిళ్ సూపర్ హిట్ 'గుడ్ నైట్' సినిమా రివ్యూ.. తెలుగులో ఆకట్టుకుందా?

Anand Sai HT Telugu
Jul 04, 2023 12:56 PM IST

Good Night Review : మనిషికి ఉండే ఏదో ఒక సమస్యతో వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలా.. గురక సమస్యతో వచ్చిన చిత్రమే గుడ్ నైట్. డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది?

గుడ్ నైట్ రివ్యూ
గుడ్ నైట్ రివ్యూ (twitter)

చిత్రం : గుడ్ నైట్, నటీనటులు : కె.మణికందన్, మీతా రఘునాథ్, రమేశ్ తిలక్, రేచల్ రెబకా, బాలాజీ శక్తివేల్.. తదితరులు, సంగీతం : సీన్ రోల్డన్, సినిమాటోగ్రఫీ : జయంత్ సేతుమాధవన్, ఎడిటింగ్ : భారత్ విక్రమన్, నిర్మాత: యువరాజ్ గణేశన్, మహేశ్ రాజ్ పసిలన్, నజీరత్ పసిలన్, రచన, దర్శకత్వం : వినాయక్ చంద్రశేఖరన్,

yearly horoscope entry point

కథ : మోహన్ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుంటాడు. మధ్య తరగతి కుటుంబ అతడిది. అయితే అతడికో సమస్య ఉంది. నిద్రపోయాడంటే.. గురక పెడితే పక్కింటివాళ్లు కూడా భయపడిపోవాలి. ఆఫీసులో ఓ అమ్మాయిని లవ్ చేస్తాడు. ఓ రోజు కలిసి బస్సులో వెళ్తుంటారు. చల్లని గాలి వస్తుంటే.. ఓ అరంగంట నిద్రపోతాడు. కానీ గురక మాత్రం దారుణంగా పెడతాడు. బస్సులో నువ్ పెట్టే గురకనే తట్టుకోలేక పోతున్నాను, ఇక జీవితాంతం అంటే నా వాళ్ల కాదని అమ్మాయి వదిలేస్తుంది. ఫ్రెండ్స్ అందరూ మోటారు మోహన్ అని ఎగతాళి చేస్తుంటారు.

ఓ రోజు తన బావతో కలిసి పని మీద ఓ ఇంటికి వెళ్తాడు. అక్కడ అను(మీతా రఘునాథ్)ను చూస్తాడు. అనుతో పరిచయం అవుతుంది. అది ప్రేమ వరకూ దారి తీస్తుంది. మెుత్తానికి ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. మెుదటి రాత్రి రోజునే.. అనుకు మోహన్ గురకం విషయం అర్థమవుతుంది. మోహన్ పెట్టే గురకకు అనుకు నిద్రపట్టక ఆరోగ్యం కూడా పాడవుతుంది. గురక సమస్య తగ్గించుకేనేందుకు మోహన్ ఏం చేశాడు? మోహన్-అను కలిసే ఉన్నారా? గురక సమస్యతో హీరోకు వచ్చిన కష్టాలేంటి? అని తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ : సినిమాలో ప్రధాన పాత్రకు ఏదో ఒక సమస్యను ఆపాదించి తీసిన చిత్రాలు చాలానే ఉన్నాయి. తెలుగులోనూ భలే భలే మాగాడివోయ్, మహానుభావుడు లాంటి చిత్రాలు వచ్చాయి. అలాంటి కోవలోకే చెందుతుంది గుడ్ నైట్ సినిమా. హీరోకు గురక.. ఇంట్లో అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటారు. గురక అనే సమస్యను హీరోకు ఆపాదించి.. సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ వినాయక్ చంద్రశేఖరన్. సినిమా స్టార్ట్ కాగానే హీరోకు గురక సమస్య అని అర్థమవుతుంది. గురకతో కథానాయకుడి చుట్టు ఉండేవాళ్లు పడే ఇబ్బందులను చక్కగా చూపించాడు. వాళ్లు చేసే కామెంట్స్ బాగా నవ్విస్తాయి.

అయితే ఈ సినిమాలో ఓన్లీ కామెడీ మాత్రమే అనుకుంటే పొరబడినట్టే. ఎమోషనల్ సీన్స్ కూడా బాగా పండాయనే చెప్పాలి. భార్య పడే ఇబ్బందులకు ప్రేక్షకుడు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాడు. గురక తగ్గించుకునేందుకు హీరో చేసే పనులు నవ్విస్తాయి. భార్యకు అయ్యే కష్టాన్ని చూసి పక్క గదిలోకి వెళ్లి పడుకుంటాడు. యూట్యూబ్ చూసి.. తగ్గించుకోవాలని అనుకుంటాడు.. ఈ సమయంలో ప్రేక్షకులు నవ్వుకుంటారు.

అయితే అలాంటి సీన్స్ మళ్లీ మళ్లీ రావడం ఓ మైనస్ గా చెప్పవచ్చు. కాస్త ఫ్యామిలీ డ్రామా కూడా స్లోగా సాగుతుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సినిమాలో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టుగా ఉంటాయి. ఇంకాస్త నిడివి తగ్గిస్తే బాగుండేదేమో. నటులు కూడా ఎవరి పాత్రకు తగ్గట్టుగా వారు కుమ్మేశారనే చెప్పాలి. కలిసి ఉంటేనే కలదు సుఖం అనే విషయాన్ని చెప్పుకొచ్చాడు దర్శకుడు. పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారం చిన్నగానే ఉంటుందని చెప్పకనే చెప్పాడు. మెుత్తానికి ఓ క్లీన్ ఎంటర్టైనర్ చూడాలంటే గుడ్ నైట్ సినిమా బెస్ట్. తెలుగులోనూ అందుబాటులో ఉంది.

Whats_app_banner