India vs South Africa 2022: సఫారీలతో టీ20 సిరీస్‌లో ఈ 5గురు భారత ఆటగాళ్లు కీలకం-five indian players who are crucial for south africa t20i series ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India Vs South Africa 2022: సఫారీలతో టీ20 సిరీస్‌లో ఈ 5గురు భారత ఆటగాళ్లు కీలకం

India vs South Africa 2022: సఫారీలతో టీ20 సిరీస్‌లో ఈ 5గురు భారత ఆటగాళ్లు కీలకం

Maragani Govardhan HT Telugu
Jun 08, 2022 01:59 PM IST

జూన్ 9 నుంచి జూన్ 19 వరకు దక్షిణాఫ్రికా.. భారత్‌లో పర్యటించనుంది. టీమిండియాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో కొంతమంది భారత ఆటగాళ్లు కీలకం కానున్నారు. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం.

<p>దక్షిణాఫ్రికా సిరీస్‌లో కీలక ఆటగాళ్లు</p>
దక్షిణాఫ్రికా సిరీస్‌లో కీలక ఆటగాళ్లు (Twitter)

రెండు నెలల పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సత్తా చాటిన భారత క్రికెటర్లు అంతర్జాతీయ మ్యాచ్‌లకు సమాయత్తమవుతున్నారు. జూన్ 9 గురువారం నుండి దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభం కానున్న తరుణంలో ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. అక్టోబరులో టీ20 ప్రపంచకప్‌లో సత్తా చాటేందుకు ఈ సిరీస్‌ను సదావకాశంగా భావిస్తున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా లాంటి మేటీ ఆటగాళ్లు లేకపోయినప్పటికీ యువకులతో టీమిండియా బరిలోకి దిగుతోంది. కేఎల్ రాహుల్ ఈ జట్టుకు నేతృత్వం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో కీలక మారనున్న ఐదుగురు భారత క్రికెటర్ల గురించి ఇప్పుడు చూద్దాం.

దినేశ్ కార్తీక్..

చాలా రోజుల గ్యాప్ తర్వాత దినేశ్ కార్తీక్ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడబోతున్నాడు. ఐపీఎల్ 2022లో ఆర్సీబీ తరఫున అత్యుత్తమంగా ఆడిన కార్తీక్.. తిరిగి భారత జట్టులోకి పునరాగమనం చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన కార్తీక్.. 183.33 స్ట్రైక్ రేటుతో 330 పరుగులు చేసి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఫలితంగా దినేశ్ కార్తీక్‌కు జట్టులో స్థానం లభించింది. ఈ 37 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ చివరగా 2019 జులైలో అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. సఫారీలతో జరగనున్న ఈ టీ20 సిరీస్‌లో దినేశ్ సత్తా చాటినట్లయితే జట్టులో స్థానం సుస్థిరమయ్యే అవకాశముంది.

ఇషాన్ కిషన్..

ఐపీఎల్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయనప్పటికీ సెలక్టర్లు ఇషాన్ కిషన్‌పై నమ్మకముంచారు. ధావన్ అద్భుతంగా ఆడినప్పటికీ 23 ఏళ్ల ఇషాన్‌ వైపే మొగ్గు చూపారు. మెగావెలంలో ఖరీదైన ఆటగాళ్లలో ఒకరైన ఇషాన్.. ఈ ఐపీఎల్ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 32.15 సగటుతో 418 పరుగులు చేశాడు. జట్టులో స్థానంలో సుస్థిరం కావాలంటే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ అతడికి చాలా కీలకం.

శ్రేయాస్ అయ్యర్..

ఈ మిడిలార్డర్ బ్యాటర్.. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. 14 మ్యాచ్‌ల్లో 30.81 సగటుతో 401 పరుగులు చేశాడు. మిడిలార్డర్‌లో గాయం కారణంగా సూర్య కుమార్ యాదవ్ కూడా లేకపోవడంతో శ్రేయాస్ అయ్యర్ కీలకం కానున్నాడు. సూర్య కుమార్ యాదవ్ స్థానాన్ని భర్తీ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ కొన్నిసార్లు అనవసర తప్పిదాలతో ఇబ్బంది పడుతున్నాడు. భారత జట్టులో స్థానం సుస్థిరం కావాలంటే ఇతడికి కూడా ఈ సిరీస్ ముఖ్యం.

కుల్దీప్ యాదవ్..

ఈ ఎడం చేతి వాటం చైనామన్ స్పిన్నర్.. టీ20 ఫార్మాట్‌లో మెరుగైన రీతిలో పునరాగమనం చేశాడు. ఐపీఎల్‌లో అదిరిపోయే ప్రదర్శన చేసిన ఇతడు.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఐదో స్థానంలో నిలిచాడు. దిల్లీ క్యాపిటల్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన కుల్దీప్.. 14 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు పడగొట్టాడు. అయితే ఇంత మెరుగ్గా ప్రదర్శన చేసినప్పటికీ.. భారత జట్టులో స్థానం మాత్రం సుస్థిరం కాలేదు. అందుకే ప్రొటీస్‌తో సిరీస్ అతడికి చాలా ముఖ్యం.

ఉమ్రాన్ మాలిక్..

ఉమ్రాన్ మాలిక్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఈ ఏడాది అద్భుతంగా ఆడాడు. 14 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు తీసి అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఈ ఐపీఎల్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులను సంధిస్తూ.. ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జట్టులో స్థానాన్ని శాశ్వతం చేసుకోవాలని అనుకుంటున్నాడు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్