Eagle Review: ఈగల్ రివ్యూ - రవితేజ స్టైలిష్ యాక్షన్ మూవీ ఎలా ఉందంటే?
Eagle Movie Review: రవితేజ హీరోగా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈగల్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Eagle Movie Review: సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తుంటాడు రవితేజ (Ravi Teja). 2024 ఏడాదిని ఈగల్‌తో మొదలుపెట్టారు రవితేజ. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అనుపమ పరమేశ్వరన్(Anupama parameswaran), కావ్యథాపర్ ఈ మూవీలో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతో రవితేజకు హిట్టు దక్కిందా? లేదా? అన్నది తెలియాలంటే కథలోని లోకి వెళ్లాల్సిందే…
సహదేవ వర్మ ఎవరు?
సహదేవ వర్మ (రవితేజ) తలకోన అడవుల్లో ఉంటూ చేనేత రైతులకు సాయపడుతుంటాడు. అక్కడ పండించే పత్తి, తయారైన వస్త్రాలకు దేశవిదేశాల్లో గుర్తింపు తీసుకొస్తాడు సహదేవ వర్మ. అతడి గురించి పేపర్‌లో ఆర్టికల్ రాసినందుకు నళినీరావు (అనుపమ పరమేశ్వరన్) అనే జర్నలిస్ట్ ఉద్యోగం పోతుంది. సహదేవ వర్మ జీవితం గురించి పూర్తిగా తెలుసుకోవాలని తలకోన అడవుల్లోకి వస్తుంది నళినీరావు. విదేశాల్లో కాంట్రాక్ట్ కిల్లర్‌గా సహదేవ వర్మ ఫేమస్ అని ఆమె అన్వేషణలో తెలుస్తుంది.
అసలు అతడు తలకోన ఎందుకొచ్చాడు? సహదేవ వర్మ భార్య రచన (కావ్య థాపర్) అతడికి ఎలా దూరమైంది?ఆమె మరణానికి కారకులు ఎవరు?సహదేవవర్మ గురించి సీబీఐ, సెంట్రల్ ఫోర్స్‌తో పాటు నక్సలైట్లు, టెర్రరిస్టులు ఎందుకు వెతుకుతున్నారు? జైతో (నవదీప్) కలిసి అక్రమ ఆయుధాల వ్యాపారాన్ని సహదేవవర్మ ఎందుకు అడ్డుకోవాలని చూశాడు? సహదేవ్ వర్మ గురించి నళీని ఏం తెలుసుకుంది? అన్నదే ఈగల్ మూవీ(Eagle Movie Review) కథ.
స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్...
ఈగల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ. గ్యాంగ్‌స్టర్ మూవీకి చిన్నపాటి సోషల్ మేసేజ్‌ను జోడించి డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని ఈ మూవీని తెరకెక్కించాడు. రవితేజకు మాస్‌లో ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని హీరోయిజం, ఎలివేషన్స్‌తో దర్శకుడు గట్టెక్కాలని అనుకున్నారు. అందుకు తగ్గట్లే ఫస్ట్ హాఫ్ మొత్తం సాగుతుంది.
సహదేవ వర్మ పేరు చెప్పగానే సీబీఐ, ఆర్మీలాంటి సంస్థలు కూడా గడగడ వణికిపోవడం లాంటి సీన్స్‌తో రవితేజ క్యారెక్టర్‌పై భీభత్సమైన హైప్‌ను క్రియేట్ చేశాడు డైరెక్టర్. అసలు సహదేవ వర్మ ఎవరు అనే క్యూరియాసిటీని ఆడియెన్స్‌లో కలిగిస్తూ కథను ముందుకు తీసుకెళ్లాడు. నళీనీరావు పాత్ర ద్వారా హీరో క్యారెక్టర్‌లోని ఒక్కో కోణాన్ని రివీల్ చేయడం ఆసక్తిని కలిగిస్తుంది.
చేనేత రైతులకు సాయం, అక్రమ ఆయుధాల వ్యాపారం రెండు కంప్లీట్‌గా భిన్నమైన నేపథ్యాలు. వాటిని లింక్ చేస్తూ ఈగల్ కథను(Eagle Movie Review) అల్లుకున్నారు డైరెక్టర్. హీరో పాత్ర, అతడి ఫ్లాష్‌బ్యాక్‌కు సంబంధించి అనేక ప్రశ్నలతోఫస్ట్ హాఫ్‌ను ఎండ్ చేశాడు డైరెక్టర్.
షుగర్ కోటింగ్ మెసేజ్...
సెకండాఫ్‌లో ఒక్కో ట్విస్ట్‌ను రివీల్ చేస్తూ వెళ్లాడు. సహదేవవర్మ, రచన ప్రేమాయణాన్ని అందంగా చూపించారు. కాంట్రాక్ట్ కిల్లర్‌గా ఉన్న సహదేవవర్మ ఇండియాకు వచ్చిన ఆక్రమ ఆయుధాల వ్యాపారాన్ని ఎందుకు అడ్డుకోవాలనుకున్నది ఎమోషనల్ సీన్‌తో కన్వీన్సింగ్‌గా ఆవిష్కరించారు.
ఈ ఆయుధాల వ్యాపారాన్ని అడ్డుకోవడానికి పెద్ద కోటను నిర్మించుకున్న సహదేవ వర్మ వాటిని ఎలా అడ్డుకుంటున్నాడని యాక్షన్ అంశాలతో స్టైలిష్‌గా ప్రజెంట్ చేయడంపై దర్శకుడు ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం గూస్‌బంప్స్‌ను కలిగిస్తాయి. అర్హత ఉన్న వాడి చేతిలోనే ఆయుధం ఉండాలంటూ కథలో అంతర్లీనంగా చిన్న మెసేజ్‌ను చివరి వరకు నడిపించాడు. అది కూడా డీప్‌గా కాకుండా లైటర్‌వేలో షుగర్ కోటెడ్‌లా డైరెక్టర్ టచ్ చేశాడు.
రవితేజ క్యారెక్టర్‌ను నమ్మే...
ఈగల్ కథ(Eagle Movie Review) చాలా చిన్నది. కేవలం రవితేజ క్యారెక్టర్‌ను నమ్మే రెండున్నర గంటలు నడిపించే ప్రయత్నంలో దర్శకుడు చాలా కంగాళీగా కలగపులగం చేసినట్లు అనిపిస్తుంది. చాలా చోట్ల లాజిక్స్ వదిలేశాడు. చేనేత వస్త్రాలు, ఆక్రమ ఆయుధాల వ్యాపారం రెండింటి మధ్య సింక్ కుదరనట్లుగా అనిపిస్తుంది. విక్రమ్, కేజీఎఫ్ స్ఫూర్తితోనే ఈ సినిమా చేసినట్లుగా అనిపిస్తుంది. ఎలివేషన్స్ మొత్తం ఆ సినిమాలను గుర్తుకు తెస్తాయి.
ప్రొడక్షన్ వాల్యూస్ అదుర్స్...
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం బాగున్నాయి. కథను నమ్మి ఎక్కడ రాజీ పడకుండా ఈ మూవీని తెరకెక్కించారు. సినిమాటోగ్రఫీ, విజువల్స్, లోకేషన్స్ కలర్‌ఫుల్‌గా ఉన్నాయి.
ఎలివేషన్స్ పీక్స్
సహదేవ వర్మగా రవితేజ స్టైలిష్‌గా కనిపించాడు. రవితేజ ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్‌లో అతడి ఎనర్జీ మెప్పిస్తుంది. డైలాగ్ డెలివరీ కొత్తగా ఉంది. నళినీరావు అనే జర్నలిస్ట్‌గా అనుపమ యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్ర చేసింది. రచనగా కావ్య థాపర్ సినిమాలో కనిపించేది తక్కువ టైమే. రవితేజతో ఆమె కెమిస్ట్రీ బాగుంది. రవితేజ అసిస్టెంట్‌గా నవదీప్‌తోపాటు మధుబాల, శ్రీనివాస అవసరాల ప్రతి ఒక్క పాత్రను ఇంట్రెస్టింగ్‌గా డైరెక్టర్ రాసుకున్నాడు.
Eagle Movie Review -రవితేజ వన్ మెన్ షో...
రవితేజ వన్‌మెన్ షోగా ఈగల్ మూవీ నిలుస్తుంది. రవితేజ హీరోయిజం, ఎలివేషన్స్ కోసం ఈ సినిమా చూడొచ్చు. మాస్ ఫ్యాన్స్‌కు పండుగలా ఈ మూవీ ఉంటుంది.
రేటింగ్: 3/5
టాపిక్