Dayaa Web Series Review: జేడీ చక్రవర్తి క్రైమ్ థ్రిల్లర్ ‘దయా’ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..-dayaa web series review jd chakravarthy starrer dayaa shines with gripping screenplay and twists streaming on disneyplus ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dayaa Web Series Review: జేడీ చక్రవర్తి క్రైమ్ థ్రిల్లర్ ‘దయా’ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..

Dayaa Web Series Review: జేడీ చక్రవర్తి క్రైమ్ థ్రిల్లర్ ‘దయా’ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 04, 2023 03:50 PM IST

Dayaa Web Series Review: జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటించిన ‘దయా’ వెబ్ సిరీస్‍ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకోండి.

దయా వెబ్ సిరీస్ (Photo: Hotstar)
దయా వెబ్ సిరీస్ (Photo: Hotstar)

Dayaa Web Series Review: వెబ్ సిరీస్: దయా - సీజన్-1 (8 ఎపిసోడ్స్); స్ట్రీమింగ్: డిస్నీ+ హాట్‍స్టార్ (ఆగస్టు 4 నుంచి); నటీనటులు: జేడీ చక్రవర్తి, ఈశా రెబ్బా, రమ్యా నంబీషన్, జోష్, రవి, విష్ణుప్రియ, పృథ్వీరాజ్, కమల్ కామరాజు తదితరులు; ఎడిటర్: విప్లవ్ నిషాదం; మ్యూజిక్ డైరెక్టర్: శ్రవణ్ భరద్వాజ్; డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: వివేక్ కాలేపు; నిర్మాతలు: శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోనీ; రచన, దర్శకత్వం: పవన్ సాదినేని

బంగ్లాదేశ్ బెంగాలీ వెబ్ సిరీస్ తక్దీర్ కథ ఆధారంగా ‘దయా’ వెబ్ సిరీస్ రూపొందింది. జేడీ చక్రవర్తి ప్రధాన పాత్ర దయాగా నటించాడు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటం, ప్రమోషన్లను జోరుగా చేయడంతో ఈ సిరీస్ మంచి బజ్ తెచ్చుకుంది. సేనాపతి లాంటి క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కించిన పవన్ సాదినేని.. ఈ దయా వెబ్ సిరీస్‍కు డైరెక్షన్ చేశాడు. డిస్నీ+ హాట్‍స్టార్‌లో తెలుగుతో పాటు మరో ఆరు భాషల్లో దయా సీజన్-1 స్ట్రీమింగ్‍కు వచ్చింది. మరి.. ‘దయా’ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఆకట్టుకుందా.. అంచనాలను అందుకుందా అనే విషయాలను ఇక్కడ తెలుసుకోండి.

ఇదీ కథ

కాకినాడ హార్బర్‌లో చేపలు తరలించే ఫ్రీజర్ వ్యాన్ నడుపుతుంటాడు దయా (జేడీ చక్రవర్తి). దయా అమాయకంగా, మంచితనంతో ఉంటాడు. చెవులు సరిగా వినిపించవు. దయా భార్య అలివేలు (ఈశా రెబ్బా) నిండు గర్భిణిగా ఉంటుంది. దయాకు అనుచరుడిగా ఉంటూ ప్రభ (జోష్ రవి) సాయం చేస్తుంటాడు. కే న్యూస్ చానెల్ జర్నలిస్ట్ అయిన కవితా నాయుడు (రమ్యా నంబీషన్) మృతదేహం సడన్‍గా దయా ఫ్రీజర్ వ్యాన్‍లో కనిపిస్తుంది. అయితే, కవిత భర్త కౌశిక్ (కమల్ కామరాజు).. ఆమె కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‍లో మిస్సింగ్ కేసు పెడతాడు.స్వేచ్ఛ అనే అమ్మాయి రేప్‍లో ఎమ్మెల్యే పరశురామరాజు (పృథ్వీరాజ్) అరాచకాలను కవిత బయటపెట్టేందుకు అంతకుముందు ప్రయత్నిస్తుంటుంది. దర్యాప్తు చేస్తుంది. ఈ కేసు గురించి పట్టించుకోవద్దని చానెల్ ఓనర్‌ వారించటంతో విధుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆ తర్వాత శవంగా దయా వ్యాన్‍లో కనిపిస్తుంది. ఆ బాడీని చెప్పిన చోట డెలివరీ చేయాలని, పోలీసులకు చెప్పకూడదని ఓ వ్యక్తి దయాను ఫోన్లో బెదిరిస్తుంటారు. అయితే, అనుచరుడు ప్రభ ఐడియాతో మరో శవం ప్లేస్‍లో కవిత శవాన్ని మారుస్తాడు దయా. మరోవైపు కవిత కోసం ఏసీపీ నేతృత్వంలో పోలీసులు ప్రత్యేక టీమ్‍లతో గాలిస్తుంటారు. కవితతో విడాకులకు దరఖాస్తు చేసి కౌశిక్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు కౌశిక్ ప్రయత్నిస్తుండటంతో అతడిని కూడా పోలీసులు అనుమానిస్తారు. ఈ క్రమంలో దయా ఫ్రీజర్ వ్యాన్‍ను ఎవరో ఎత్తుకెళతారు. శవం మారిందని అతడిని బెదిరిస్తుంటారు. అప్పుడు కవిత దగ్గర పని చేసే షబానా (విష్ణు ప్రియ) కూడా ఆమె మృతదేహం కోసం వెతుకుతుంటుంది. దయా భార్య అలివేలు కోసం పోలీసులు వెతుకుతారు. అసలు కవితను చంపింది ఎవరు? దయా వ్యాన్‍లోకి కవిత శవం ఎలా వచ్చింది? ఈ ఇబ్బందుల నుంచి దయా ఎలా బయటపడ్డాడు? దయా, అలివేలు నిజంగా అమాయకులేనా? స్వేచ్ఛ రేప్ వెనుక ఉన్న కారణం ఏంటి? అనేదే ఈ సిరీస్ ప్రధాన కథగా ఉంది.

ఎలా సాగిందంటే..

దయా వెబ్ సిరీస్ ప్రారంభంలో కాస్త స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే, అసలైన విషయంలోకి వెళ్లాక పరుగులు పెడుతుంది. దయా వ్యాన్‍లో జర్నలిస్టు కవిత మృతదేహం కనిపించడం, ఏం చేయాలో తెలియక దయా, ప్రభ పడే కంగారు, వారు చేసే ప్రయత్నాలు ఇంట్రెస్టింగ్‍గా సాగుతాయి. ప్రతీ ఎపిసోడ్‍లో ట్విస్ట్ ఉండేలా డైరెక్టర్ జాగ్రత్త పడ్డాడు. కథనాన్ని గ్రిప్పింగ్‍గా నడిపించాడు. స్వేచ్ఛ రేప్ వెనుక ఉన్న మిస్టరీని జర్నలిస్ట్ కవిత ఇన్వెస్టిగేట్ చేయడం, నిజాలు క్రమంగా బయటికి రావడం ఆసక్తికరంగా ఉంది. అక్కడక్కడా కథనం కాస్త నెమ్మదించినా వెంటనే స్పీడ్ అందుకుంటుంది. తర్వాత ఏం జరగనుందనే ఊహాలను వీక్షకులకు కలిగిస్తుంది. అయితే, ఓ దశ దాటాక ముందే ఊహించగలిగేలా కొన్ని సీన్లు ఉన్నాయి. అయినా.. ఆసక్తిని మాత్రం అలాగే ఉంచగలిగాడు దర్శకుడు.

దయా సీరియస్ మోడ్‍లోకి మారడం మరింత ఇంట్రెస్టును పెంచుతుంది. అలివేలు (ఈషా రెబ్బా) క్యారెక్టర్ గురించి షాకింగ్ విషయం చూపించినా ఆ పాత్రను పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. రెండో సీజన్‍ వస్తే అలివేలు పాత్ర కీలకంగా ఉండేలా కనిపిస్తోంది. దయా ఫ్లాష్‍బ్యాక్ గురించి కూడా అక్కడక్కడా విజువల్స్ చూపించినా.. పూర్తిగా రిలీల్ చేయలేదు. దయాకు సాయం చేస్తున్న వారు ఒక్కొక్కరుగా చనిపోవడం, ఎమోషనల్ సీన్లు కూడా ఆకట్టుకున్నాయి. అత్యాచార బాధితురాలి ముఖాన్ని మీడియాలో చూపిస్తే పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో చూపించాడు దర్శకుడు. స్వేచ్ఛ పాత్ర తక్కువ నిడివి ఉన్నా.. ప్రభావం చూపించింది. అయితే, క్లైమాక్స్ పెద్దగా మెరుపులు లేకుండా ఊహలకు అందే విధంగానే ముగిసింది. దీంతో ముగింపు కాస్త నిరాశాజనకంగానే ఉంది. అయితే, చాలా ప్రశ్నలను, రెండో సీజన్ గురించి ఆసక్తిని పెంచింది. అయితే, రెండో సీజన్ రావడం గురించి ఇంకా స్పష్టత లేదు.

ఎవరెలా చేశారంటే..

దయా పాత్రకు జేడీ చక్రవర్తి బాగా సూటయ్యాడు. అమాయకంగా ఉన్నప్పుడు తన మార్క్ కనిపించకపోయినా.. సీరియస్ మోడ్‍లోకి మారాక అదరగొట్టాడు. ఎమోషన్ పండించంలోనూ సఫలమయ్యాడు. ఈషా రెబ్బా ఎక్కువ నిడివి లేదు. ఉన్నంతలో ఆకట్టుకుంది. అయితే, ఓ సీన్లో షాకింగ్‍ లుక్‍లో కనిపించింది. జర్నలిస్టు కవిత పాత్ర చేసిన రమ్యా నంబీషన్, ఆమె దగ్గర పని చేసే పాత్రలో శ్రీవిష్ణు పర్వాలేదనిపించారు. జోష్ రవి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మర్డర్లు చేసే పాత్రలో కబీర్ పాత్రలో నందగోపాల్ క్రూరంగా కనిపించాడు. కవిత భర్త పాత్ర చేసిన కమల్ కామరాజు తన పరిధి మేర ఆకట్టుకున్నాడు. మొత్తంగా నటీనటుల పర్ఫార్మెన్స్.. దయా వెబ్ సిరీస్‍కు బాగా ప్లస్ అయింది. ఎమ్మెల్యేగా పృథ్వీరాజ్ ఉన్నంతలో బాగా చేశాడు.

టెక్నికల్ అంశాలు

దర్శకుడు పవన్ సాదినేని.. తక్దీర్ కథను పెద్దగా మార్చకుండానే మన నెటివిటీకి తగ్గట్టు ఆసక్తికరంగా మలిచాడు. కథనాన్ని కూడా గ్రిప్పింగ్‍గా నడిపించాడు. అక్కడక్కడా కాస్త స్లోగా అనిపించినా.. ట్విస్టులతో ఆసక్తి రేకెత్తించాడు. అయితే, క్లైమాక్స్ కాస్త ఆసక్తికరంగా ఉండే బాగుండేది. శ్రవణ్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్లకు తగ్గట్టు ఇంటెన్స్ గా ఉంది. వివేక్ సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపించింది. అయితే, కొన్ని చోట్ల లొకేషన్లను అతడు చూపించిన విధానం ఆకట్టుకుంది. ఒకచోట మినహా బూతులు, అడల్ట్ సీన్లు లేకపోవడం ఈ సిరీస్‍కు మరో ప్లస్ పాయింట్.

చివరగా.. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టం ఉండే వారిని దయా వెబ్ సిరీస్ సీజన్-1 మెప్పిస్తుంది. నరేషన్ కొన్ని చోట్ల స్లో అయినా చాలా వరకు గ్రిప్పింగ్‍గా ఉండడం, ట్విస్టులు బాగా వర్కౌట్ అవడం ప్లస్ పాయింట్లుగా ఉన్నాయి. కథ మరీ కొత్తగా ఏమీ అనిపించదు. క్లైమాక్స్ విషయంలో కాస్త కాంప్రమైజ్ అవ్వాల్సిందే. అయితే, క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకుంటే దయా మంచి ఆప్షన్‍.

రేటింగ్: 3.25/5