YS Jagan In Markapur: పేదరికానికి కులం అడ్డం కాకూడదనే ఈబీసీ నేస్తం..సిఎం జగన్
YS Jagan In Markapur: నామినేటెడ్ పదవుల కేటాయింపులో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులను ముఖ‌్యమంత్రి లబ్దిదారుల ఖాతాల్లోకి బదిలీ చేశారు.
YS Jagan In Markapur: పేదరికానికి కులం అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతోనే ఓసీల్లో పేదలను ఆదుకునేందుకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నట్లు సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మూడో విడత ఈబీసీ నేస్తం నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.రాష్ట్రంలో 4లక్షల 39వేల మందికి నేరుగా 659కోట్ల రుపాయలను ఖాతాలకు బదిలీ చేస్తున్నట్లు చెప్పారు.
మహిళలు సాధికారత లక్ష్యంతోనే ఈబీసీ నేస్తం అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. మహిళలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయని సిఎం చెప్పారు. సంపూర్ణ పోషణ నుంచ వృద్ధాప్య పెన్షన్ల వరకు మహిళలకు మంచి చేయడానికి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. 45-60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు డబ్బు అందిస్తే వాటిని కుటుంబ బాగోగుల కోసమే ఖర్చు చేస్తారనే నమ్మకంతో వారికి ఆర్దికంగా నిలదొక్కుకునేందుకు ఈబీసీ నేస్తం అమలు చేస్తున్నామన్నారు.
వైఎస్సార్ చేయూత ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు చేయూత అందిస్తున్నామని, కాపు మహిళలకు కాపునేస్తం ద్వారా ఆర్ధిక సాయం అందించామని, ఓసీల్లో ఉన్న పేద మహిళలను ఆదుకోడానికి వైఎస్సార్ ఈబీసీ నేస్తం తీసుకొచ్చినట్లు చెప్పారు.
పేదరికానికి కులం ఉండదనే కారణంతోనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. ఓసీ వర్గాల్లో ఉన్న రెడ్డి, కమ్మ, వైశ్య, క్షత్రియ, బ్రహ్మణ, వెలమ కులాల పేద మహిళలు ఆర్ధికంగా నిలదొక్కుకోడానికి ఈబీసీ నేస్తం ద్వారా 4,39,638మందికి 659 కోట్ల రుపాయలు అందిస్తున్నట్లు చెప్పారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా రెండేళ్లలో 1258 కోట్ల రుపాయలు బదిలీ చేశామన్నారు. 4.39 లక్షల మందిలో నాలుగు లక్షల మంది రెండో విడత డబ్బులు అందుకుంటున్నారని చెప్పారు. దేశ చరిత్రలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమానని చేపట్టలేదని సిఎం జగన్ చెప్పారు.
మ్యానిఫెస్టోలో లేకున్నా పథకాలు అమలు….
మహిళలు ఆర్ధికంగా బాగుపడాలని, వారి కాళ్ల మీద వాళ్లు నిలబడాలని, ఆత్మ గౌరవం పెంచుకోవాలని, రాజకీయంగా నిలదొక్కుకోడానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 39లక్షల ఇళ్ల పట్టాలిస్తే 22లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. మహిళల స్వావలంబన కోసమే రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈబీసీ నేస్తం, కాపు నేస్తం పథకాలు మ్యానిఫెస్టోలో లేకున్నా ఓసీ మహిళలను పేదరికం నుంచి బయటపడేసేందుకు ప్రవేశపెట్టినట్టు చెప్పారు.
46 నెలల కాలంలో 2లక్షల 7వేల కోట్ల రుపాయలను డిబిటి ద్వారా పేదల ఖాతాలకు బదిలీ చేసినట్లు చెప్పారు. వాటిలో లక్షా 42వేల కోట్ల రుపాయలను నేరుగా మహిళల ఖాతాలకే బదిలీ చేసినట్లు జగన్ చెప్పారు. ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా మహిళల కుటుంబాల ఖాతాల్లోకి బదిలీ చేశామన్నారు.
వైఎస్సార్ చేయూత ద్వారా రూ.14,129కోట్ల ను 26లక్షల మంది మహిళలకు పంపిణీ చేశామన్నరాు. కాపునేస్తం ద్వారా 3.56లక్షల మందికి రూ. 1518కోట్లు ఆర్ధిక సాయం అందించామన్నారు. పెన్షన్ కానుక ద్వారా 41.77లక్షల మందికి రూ.40,094కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. అమ్మఒడి ద్వారా 44.48లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి రూ.19,674కోట్లను నేరుగా బదిలీ చేసినట్లు చెప్పారు.
స్వయం సహాయక సంఘాలకు 21,570కోట్ల అప్పులు ఉన్న దశ 2019 నాటికి రాష్ట్రంలో ఉందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.19,170కోట్ల రుపాయలను రూ.79.78లక్షల మందికి అందించినట్లు చెప్పారు.
30లక్షల ఇళ్ళతో 2-3లక్షల కోట్ల ఆస్తుల పంపిణీ…
జగనన్న కాలనీల ద్వారా 30లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని, రాష్ట్ర వ్యాప్తంగా 22లక్షల ఇళ్ళ నిర్మాణం జరుగుతోందని, ఒక్కో ఇంటి విలువ ఐదు లక్షల ఆస్తిని ఇచ్చామన్నారు. రెండు నుంచి 3లక్షల కోట్ల విలువైన ఇళ్లను మహిళలకు అందచేశామన్నారు.
పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీ పథకం కోటి మంది మహిళలకు లబ్ది చేకూరుస్తున్నట్లు చెప్పారు. విద్యా దీవెన ద్వారా ఫీజు రియింబర్స్‌మెంట్, వసతి దీవెన ద్వారా రూ.13,351 కోట్లను ఖర్చు చేసినట్లు చెప్పారు. సంపూర్ణ పోషణ ద్వారా బాలింతలు, చిన్నారులకు రూ.6,131కోట్లు ఖర్చు చేశామన్నారు.
మహిళలకు భయపడే పరిస్థితులు లేకుండా దిశా యాప్‌ను ఫోన్లలోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. కోటిన్నర మహిళల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని, దాని ద్వారా మహిళలకు భద్రత కల్పిస్తున్నట్లు సిఎం జగన్ మార్కాపురం సభలో చెప్పారు.