Chiranjeevi Tweet Viral: సంచలనం రేపుతున్న చిరంజీవి ట్వీట్‌.. ఇంతకీ ఏం చెప్పాలనుకున్నాడు?-chiranjeevi tweet going viral as he talks about politics again ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiranjeevi Tweet Viral: సంచలనం రేపుతున్న చిరంజీవి ట్వీట్‌.. ఇంతకీ ఏం చెప్పాలనుకున్నాడు?

Chiranjeevi Tweet Viral: సంచలనం రేపుతున్న చిరంజీవి ట్వీట్‌.. ఇంతకీ ఏం చెప్పాలనుకున్నాడు?

Hari Prasad S HT Telugu
Sep 20, 2022 02:33 PM IST

Chiranjeevi Tweet Viral: సంచలనం రేపుతోంది చిరంజీవి చేసిన ఓ ట్వీట్‌. తన అధికారిక ట్విటర్‌లో మంగళవారం (సెప్టెంబర్‌ 20) చిరు ఈ ట్వీట్‌ చేశాడు.

<p>మెగాస్టార్ చిరంజీవి</p>
మెగాస్టార్ చిరంజీవి (twitter)

Chiranjeevi Tweet Viral: మెగాస్టార్‌ చిరంజీవి చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా వర్గాల్లోనే కాదు పొలిటికల్‌ సర్కిళ్లలోనూ దీని గురించి చర్చ జరుగుతోంది. చిరు కేవలం తన వాయిస్‌నే రికార్డ్‌ చేసి ట్వీట్‌ చేశాడు. దీనికి ఎలాంటి క్యాప్షన్‌ ఉంచకపోవడంతో దీనిపై ఉత్కంఠ మరింత పెరిగింది.

మంగళవారం (సెప్టెంబర్‌ 20) తన అధికారిక ట్విటర్‌ ద్వారా చిరంజీవి ఈ ట్వీట్‌ చేశాడు. అందులో అతని గంభీరమైన వాయిస్‌ మనం వినొచ్చు. "నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు" అని అందులో చిరు చెప్పాడు. అతని కామెంట్స్‌ వెనుక అసలు ఉద్దేశం ఏంటి అన్న చర్చ మొదలైంది.

చిరు ఈ ట్వీట్‌ చేసిన గంటలోనే వేల కొద్దీ కామెంట్స్‌, రీట్వీట్స్‌, లైక్స్‌ రావడం విశేషం. అయితే ఇది చిరంజీవి తర్వాతి మూవీ గాడ్‌ ఫాదర్‌ లోని డైలాగ్‌ కావచ్చని అభిమానులు ట్విటర్‌లో చర్చించుకుంటున్నారు. ఆచార్య డిజాస్టర్‌ తర్వాత మెగాస్టార్ ఇప్పుడు గాడ్‌ఫాదర్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.

మలయాళంలో సూపర్‌హిట్‌ అయిన లూసిఫర్‌ మూవీనే తెలుగులో గాడ్‌ఫాదర్‌గా రీమేక్‌ చేశారు. ఇందులో బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ స్పెషల్‌ అప్పియరెన్స్‌ ఇస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్‌ లుక్‌, టీజర్‌లు ఎంతో ఆసక్తిగా ఉన్నాయి. చిరంజీవి లుక్‌ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. అక్టోబర్‌ 5న దసరా సందర్భంగా ఈ మూవీ రిలీజ్‌ కాబోతోంది.

గాడ్ ఫాదర్ ప్రమోషన్ కోసమేనా?

ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగానే చిరంజీవి ఇలాంటి చర్చకు ఆస్కారమున్న ట్వీట్‌ను చేసినట్లు భావిస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీని దశాబ్దాల పాటు ఏలిన మెగాస్టార్‌.. మధ్యలో దశాబ్దంపాటు రాజకీయాల్లోకి కూడా వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీ పెట్టి.. ఉమ్మడి రాష్ట్రంలో 18 సీట్లు గెలిచిన చిరంజీవి.. ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి తర్వాత కేంద్ర మంత్రి కూడా అయ్యాడు.

క్రమంగా రాజకీయాల నుంచి దూరం జరిగి మళ్లీ సినిమాల వైపు వచ్చాడు. తన కెరీర్‌లో 150వ సినిమా అయిన ఖైదీ నంబర్‌ 150 మూవీతో మూవీల్లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సైరా నరసింహారెడ్డి, ఆచార్య మూవీల్లోనూ నటించాడు. ఇక ఇప్పుడు గాడ్‌ఫాదర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తుండగా.. తర్వాత భోళా శంకర్‌ కూడా రిలీజ్‌ కానుంది.

రాజకీయాలతో సంబంధం ఉన్న చిరంజీవి.. ఇప్పుడిలా సినిమాలో భాగంగా అయినా సరే ఇలాంటి డైలాగ్‌ను చెప్పడం అతని ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం నింపుతోంది. మరి ఆచార్య డిజాస్టర్‌ తర్వాత గాడ్‌ఫాదర్‌తో అతడు ఎలాంటి మ్యాజిక్‌ చేస్తాడో చూడాలి.

Whats_app_banner