Chhatriwali Movie Review: ఛత్రివాలీ మూవీ రివ్యూ - రకుల్ ప్రీత్‌సింగ్ బోల్డ్ మూవీ ఎలా ఉందంటే
Chhatriwali Movie Review: రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ సినిమా ఛత్రీవాలి థియేటర్లను స్కిప్ చేస్తూ శుక్రవారం (నేడు) జీ5 ఓటీటీలో రిలీజైంది.
Chhatriwali Movie Review: కమర్షియల్ సినిమాలు చేస్తూనే అడపాదడపా ప్రయోగాత్మక పాత్రలతో నటిగా ప్రతిభను చాటుకుంటోంది రకుల్‌ప్రీత్‌సింగ్. ఆమె కథానాయికగా నటించిన బాలీవుడ్ సినిమా ఛత్రివాలీ. కండోమ్ వినియోగం ఆవశ్యకతను తెలియజేస్తూ బోల్డ్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా శుక్రవారం (నేడు)జీ5 ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు తేజాస్ డియోస్కర్ దర్శకత్వం వహించాడు. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ ద్వారా ప్రేక్షకల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే...
Chhatriwali Movie Story -కండోమ్ కంపెనీలో ఉద్యోగం…
సాన్యా ధింగ్రా (రకుల్ ప్రీత్‌సింగ్) కెమిస్ట్రీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తుంది. చాలా రోజులుగా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటుంది. టాలెంట్ ఉన్నా ఒక్క జాబ్ రాదు. కాండో అనే కండోమ్ కంపెనీలో క్వాలిటీ టెస్టర్‌గా జాబ్ చేసే అవకాశం వస్తుంది. తొలుత ఆ ఉద్యోగంలో చేరడానికి సాన్య అంగీకరించదు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా చివరకు ఇష్టం లేకపోయినా కండోమ్ కంపెనీలో చేరుతుంది. తాను ఆ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న విషయాన్ని సీక్రెట్‌గా ఉంచాలని కండీషన్ పెడుతుంది.
తన కుటుంబసభ్యుల దగ్గర గొడుగుల కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు అబద్ధం అడుతుంది. చివరకు అదే అబద్ధాన్ని కంటిన్యూ చేస్తూ రిషి ని (సుమిత్ వ్యాస్) సాన్య పెళ్లి చేసుకుంటుంది. తాను పనిచేస్తోన్న కంపెనీ అడ్రస్ కూడా భర్తకు తెలియకుండా జాగ్రత్తపడుతుంది. సాన్య కండోమ్ కంపెనీలో పనిచేస్తోన్న నిజం రిషి కుటుంబానికి తెలిసిందా? అందరూ మగవాళ్లే పనిచేసే కండోమ్ కంపెనీలో సాన్యకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? లైంగిక పరిజ్ఞానంపై పిల్లలకు పాఠాలను చెప్పాలని సాన్య ఎందుకు నిర్ణయించుకున్నది? సాన్య అబద్ధం చెప్పిందని ఆమెను ద్వేషించిన రిషి చివరకుభార్యను అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నదే(Chhatriwali Movie Review) ఈ ఛత్రివాలీ కథ.
కామెడీ ప్లస్ మెసేజ్...
బోల్డ్ కాన్సెప్ట్‌కు ఎంటర్‌టైన్‌మెంట్ మెసేజ్‌ను జోడించి ఛత్రివాలీ సినిమాను దర్శకుడు తేజాస్ డియోస్కర్ తెరకెక్కించాడు. కండోమ్ వినియోగంలో ప్రజల్లో ఉన్న అపోహల్ని చర్చిస్తూ సినిమాను రూపొందించారు. కండోమ్ వినియోగం వల్ల అవాంచిత ప్రెగ్నెన్సీలు, ఆబార్షన్స్ నివారించడమే కాకుండా మహిళలు అనారోగ్యాల బారి నుంచి దూరం కావచ్చుననే సందేశాన్ని ఈ సినిమాలో చూపించారు.
లైంగిక పరిజ్ఞానానికి సంబంధించిన అంశాలపై చిన్నతనం నుంచే అవగాహన కల్పించాలనే ఆలోచనతో ప్రభుత్వాలు పాఠ్య పుస్తకాల్లో పాఠాలను చేర్చినా వాటిని ఎంత వరకు అర్థమయ్యేలా పిల్లలకు భోధిస్తున్నారనే అంశాన్ని ఆలోచనాత్మకంగా ఈ సినిమాలో(Chhatriwali Movie Review) చూపించారు.
రహస్యాన్ని దాచడం కోసం...
కండోమ్ కంపెనీలో ఉద్యోగంలో చేరిన తర్వాత ఆ విషయాన్ని సీక్రెట్‌గా దాచడం కోసం రకుల్ ప్రీత్ సింగ్ పడే ఇబ్బందులతో సరదాగా సినిమా మొదలవుతుంది. కండోమ్ కంపెనీలో ఆమెకు ఎదురయ్యే సమస్యల నుంచి వినోదాన్ని పండించారు. ఆ తర్వాత కండోమ్ వాడకం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం సాన్య సాగించిన పోరాటాన్ని ఎమోషనల్‌గా తీర్చిదిద్దారు.
టీచర్‌గా పనిచేసే రిషి అన్నయ్య కుటుంబకట్టుబాట్ల పేరుతో సాన్యను చేస్తోన్న పనులకు అడ్డు చెప్పడం, టీచర్‌గా అతడి నిర్వర్తించలేని బాధ్యతల్ని తాను చేపట్టడానికి సాన్య ముందుకు వచ్చే సీన్స్ సెకండాఫ్‌ను నిలబెట్టాయి.చివరలో ఆమె సాన్యా సామాజిక పోరాటానికి రిషితో పాటు అతడి కుటుంబసభ్యులు అర్థం చేసుకున్నట్లుగా చూపించారు.
రకుల్ నటన ప్లస్...
సాన్యా ధింగ్రా క్యారెక్టర్‌కు రకుల్ ప్రీత్‌సింగ్ పూర్తిగా న్యాయం చేసింది. కామెడీ, ఎమోషన్స్ కలబోతగా సాగిన పాత్రలో ఒదిగిపోయింది. రాజేష్ తైలాంగ్, సుమిత్ వ్యాస్ నటన బాగుంది.
Chhatriwali Movie Review-అసభ్యత లేకుండా...
ఛత్రివాలీ నవ్విస్తూనే ఆలోచనను రేకెత్తించే సినిమా. బోల్డ్ కాన్సెప్ట్‌ను ఎక్కడ అసభ్యత లేకుండా అర్థవంతంగా దర్శకుడు తేజాస్ డియోస్కర్ తెరపై ఆవిష్కరించారు.