Buttabomma Review: బుట్టబొమ్మ మూవీ రివ్యూ - మలయాళ రీమేక్ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిందా?
Buttabomma Review: అర్జున్ దాస్, అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటించిన బుట్టబొమ్మ సినిమా శనివారం థియేటర్లలో రిలీజైంది. కప్పేలా రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందంటే...
Buttabomma Review: అర్జున్ దాస్ (Arjun das), అనిఖా సురేంద్రన్(Anikha Surendran), సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటించిన బుట్టబొమ్మ సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మలయాళంలో విజయవంతమైన కప్పేలా (Kappela movie) రీమేక్‌గా తెరకెక్కిన ఈసినిమాకు శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకత్వం వహించాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments)ఈ సినిమాను నిర్మించింది. మలయాళ రీమేక్‌లోని మ్యాజిక్ తెలుగులో వర్కవుట్ అయ్యిందా? తెలుగు ప్రేక్షకుల్ని బుట్టబొమ్మ మెప్పించిందా లేదా అన్నది తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే...
సత్య ఫోన్ ప్రేమకథ…
సత్య (అనిఖా సురేంద్రన్) ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి. పుట్టిన ఊరు, కుటుంబమే ఆమె ప్రపంచం. సంతోషంగా సాగిపోతున్న ఆమె జీవితంలోకి రాంగ్ కాల్ ద్వారా మురళి (సూర్య వశిష్ట) అనే ఆటో డ్రైవర్ ప్రవేశిస్తాడు. మురళిని నేరుగా కలవకపోయినా ఫోన్ ద్వారా అతడితో సత్యకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది.
తమ ఊరికే చెందిన ఉన్నత కుటుంబానికి చెందిన అబ్బాయితో సత్యకు పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయిస్తారు. ఆ పెళ్లి నుంచి తప్పించుకోవాలని ఆలోచనతో మురళికి కలవడానికి వైజాగ్ వస్తుంది సత్య.
సత్యను కలవడానికి అతడి బదులుగా ఆర్కే అలియాస్ రామకృష్ణ( అర్జున్ దాస్ ) వస్తాడు. రామకృష్ణ ఎవరు? మురళి పేరుతో సత్యను కలవడానికి అతడు ఎందుకు వచ్చాడు? సత్యను మురళి నిజంగా ప్రేమించాడా? మురళిని నమ్మి వైజాగ్ వచ్చిన సత్య ఎలాంటి కష్టాలు అనుభవించింది? పెద్ద సమస్య నుంచి రామకృష్ణ ఆమెను ఎలా కాపాడాడు అన్నదే(Buttabomma Review) బుట్టబొమ్మ కథ.
మలయాళ రీమేక్...
మలయాళంలో విజయవంతమైన కప్పేలా సినిమా ఆధారంగా బుట్టబొమ్మ సినిమాను తెరకెక్కించారు. మాతృకలోని మెయిన్ పాయింట్‌ను తీసుకొని తెలుగు నేటివిటీకి అనుగుణంగా చిన్న చిన్న మార్పులు చేస్తూ సినిమాను రూపొందించారు. మలయాళ కథ కొత్తదేమీ కాదు. రియలిస్టిక్‌గా కథను మలిచిన విధానం, నటీనటుల యాక్టింగ్‌తో ఒరిజినల్ వెర్షన్ హిట్టయింది. మలయాళంలోని మ్యాజిక్‌ను తెలుగులో రీక్రియేట్ చేయడానికి దర్శకుడు చాలానే కష్టపడ్డాడు.
సందేశం...
లవ్ స్టోరీకి హ్యూమన్ ట్రాఫికింగ్ పాయింట్‌ను జోడించి ఈసినిమాను తెరకెక్కించారు. ఫోన్‌లు, సోషల్ మీడియా ద్వారా అపరిచితులతో ఏర్పడిన పరిచయాలు, ప్రేమలు ఎలాంటి అనర్థాలకు దారితీస్తాయన్నది సందేశాత్మకంగా ఈ సినిమాలో చూపించారు. ముక్కుముఖం తెలియకుండా ప్రేమించడం(Buttabomma Review) కరెక్ట్ కాదని చాటిచెప్పారు.
ఫస్ట్ హాఫ్ మొత్తం అనిఖా సురేంద్రన్ కుటుంబనేపథ్యం, మురళితో ఫోన్ ద్వారా ప్రేమలో పడే సన్నివేశాలతో ఆహ్లాదకరంగా సాగుతుంది. మురళిని కలవడానికి వైజాగ్ రావడం అతడి పేరుతో అర్జున్‌దాస్ అక్కడికి వచ్చే సీన్‌తో సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు డైరెక్టర్. సెకండాఫ్‌లో సత్యను కాపాడానికి అర్జున్ దాస్ చేసే ప్రయత్నాలతో థ్రిల్లింగ్‌గా సాగుతుంది.
అర్జున్ దాస్ నటన ప్లస్...
సత్య అనే అమాయకురాలైన పల్లెటూరి అమ్మాయిగా అనిఖా సురేంద్రన్ సహజ నటనతో ఆకట్టుకున్నది. నెగెటివ్ షేడ్స్‌తో కనిపించే పాజిటివ్ క్యారెక్టర్‌లో అర్జున్ దాస్ పాత్ర ఈసినిమా మెయిన్ ఎస్సెట్‌గా నిలిచింది. ప్రేమ పేరుతో సత్యను మోసం చేసే యువకుడిగా సూర్య వశిష్ట నటన ఒకే. రామకృష్ణ ప్రేమికురాలిగా చిన్న పాత్రలో నవ్యస్వామి కనిపించింది.
Buttabomma Review- రీమేక్ చూడకపోతే...
బుట్టబొమ్మ సందేశంతో తెరకెక్కిన ప్రేమకథా చిత్రంగా బుట్టబొమ్మ ఆకట్టుకుంటుంది. మలయాళ వెర్షన్ చూడని వారిని ఈ సినిమా మెప్పిస్తుంది.