Tollywood Remake Movies: టాలీవుడ్ నిర్మాత‌ల‌కు షాక్ ఇస్తోన్న రీమేక్‌లు - నాలుగు నెల‌ల్లో నాలుగు ఫ్లాప్‌లు-buttabomma hunt and other recent tollywood remake movies fails to impress audience ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Buttabomma Hunt And Other Recent Tollywood Remake Movies Fails To Impress Audience

Tollywood Remake Movies: టాలీవుడ్ నిర్మాత‌ల‌కు షాక్ ఇస్తోన్న రీమేక్‌లు - నాలుగు నెల‌ల్లో నాలుగు ఫ్లాప్‌లు

Nelki Naresh Kumar HT Telugu
Feb 11, 2023 02:16 PM IST

Tollywood Remake Movies: గ‌త కొన్నాళ్లుగా రీమేక్ సినిమాలు టాలీవుడ్ నిర్మాత‌ల‌కు భారీగా న‌ష్టాల‌ను మిగుల్చుతున్నాయి. మాతృక‌లోని మ్యాజిక్‌ను రిపీట్ చేస్తాయ‌ని న‌మ్మి చేస్తోన్న ఈ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్స్‌గా మిగిలిపోతున్నాయి.

బుట్ట‌బొమ్మ
బుట్ట‌బొమ్మ

Tollywood Remake Movies: ఇత‌ర భాష‌ల్లో విజ‌య‌వంత‌మైన సినిమాల్ని టాలీవుడ్‌లో రీమేక్ చేసే సంస్కృతి చాలా కాలంగా కొన‌సాగుతోంది. గ‌తంతో పోలిస్తే ఇప్పుడు ఈ ట్రెండ్ మ‌రింత పెరిగింది. ఓ భాష‌లో సినిమా హిట్ కావ‌డ‌మే ఆల‌స్యం ఆ సినిమా రీమేక్‌ రైట్స్‌ను పోటీ ప‌డి భారీ మొత్తాల‌కు తెలుగు నిర్మాత‌లు ద‌క్కించుకుంటున్నారు. అయితే ఈ రీమేక్ సినిమాల రిజ‌ల్ట్ మాత్రం నిర్మాత‌ల‌కు గ‌ట్టిగానే షాక్ ఇస్తోంది.

గ‌త నాలుగు నెలల్లో నాలుగు రీమేక్ సినిమాలు తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి.అవ‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్స్‌గా మిగిలాయి. అర్జున్‌దాస్‌, అనిఖా సురేంద్ర‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన బుట్ట‌బొమ్మ సినిమా ఫిబ్ర‌వ‌రి 4న రిలీజైంది.

మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన క‌ప్పేలా సినిమా ఆధారంగా అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసింది. కానీ మ‌ల‌యాళ రిజ‌ల్ట్‌ తెలుగులో మాత్రం రిపీట్ కాలేదు. మినిమం వ‌సూళ్ల‌ను కూడా రాబ‌ట్ట‌లేక డిజాస్ట‌ర్‌గా బుట్ట‌బొమ్మ‌ మిగిలిపోయింది.

రిప‌బ్లిక్ డే కానుక‌గా రిలీజైన సుధీర్‌బాబు హంట్ కూడా రీమేక్ సినిమానే కావ‌డం గ‌మ‌నార్హం. మ‌ల‌యాళ సినిమా ముంబాయి పోలీస్‌కు రీమేక్‌గా రూపొందిన ఈ సినిమా దారుణ ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్న‌ది. గే పోలీస్ ఆఫీస‌ర్ క‌థ‌తో రూపొందిన ఈ సినిమాను మ‌ల‌యాళ ప్రేక్ష‌కులు విజ‌య‌వంతం చేయ‌గా తెలుగు ప్రేక్ష‌కులు మాత్రం తిప్పికొట్టారు.

2020లో విడుద‌లైన క‌న్న‌డ చిత్రం ల‌వ్ మాక్ టెయిల్ అవార్డులు, రివార్డుల‌తో చిన్న సినిమాల్లో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది. ఈ సినిమాను స‌త్య‌దేవ్‌, త‌మ‌న్నా జంట‌గా గుర్తుందా శీతాకాలం పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. రిలీజ్‌కు ఎన్నో క‌ష్టాలు ప‌డిన ఈ సినిమా థియేట‌ర్ల‌లో ప‌ట్టుమ‌ని వారం రోజులు కూడా ఆడ‌లేదు.

అల్లు శిరీష్ ఊర్వ‌శివో రాక్ష‌సివో కూడా ఈ సినిమాల బాట‌లోనే న‌డిచింది. త‌మిళ హిట్ సినిమా ప్యార్ ప్రేమ కాద‌ల్ ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమా ఫెయిల్యూర్ సినిమాల లిస్ట్‌లో చేరింది.. ఇవి మాత్ర‌మే కాకుండా చిరంజీవి గాడ్‌ఫాద‌ర్ తో పాటు గ‌త ఏడాది విడుద‌లైన ప‌లు రీమేక్ సినిమాలు నిర్మాత‌ల‌కు భారీగా న‌ష్టాల‌ను మిగిల్చాయి.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.