2023 Telugu Remake Movies: బెడిసికొట్టిన రీ"మేకు"లు - 2023లో టాలీవుడ్‌లో రిలీజైన రీమేక్‌లన్నీ డిజాస్టర్సే
2023 Telugu Remake Movies: 2023లో తెలుగులో రిలీజైన రీమేక్ సినిమాలన్నీ డిజాస్టర్స్‌గా నిలిచాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు నటించిన రీమేక్ సినిమాలు సైతం ఆడియెన్స్‌ను మెప్పించలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
2023 Telugu Remake Movies: రీమేక్ సినిమాల ట్రెండ్ టాలీవుడ్‌లో చాలా ఏళ్లుగా ఉంది. రీమేక్ కథలను టచ్ చేయని హీరోలు టాలీవుడ్‌లో ఒకరిద్దరు మినహా ఎక్కువగా లేరు.రీమేక్‌లు సేఫ్‌జోన్‌గా భావించేవారు హీరోలు. కానీ ఓటీటీల రాకతో రీమేక్‌లకు బ్యాడ్‌టైమ్ స్టార్టయింది. ఇదివరకు ఇతర భాషల్లో విజయవంతమైన సినిమాల్ని తెలుగు ఆడియెన్స్ అంతగా చూసేవారు కాదు.
కానీ ఓటీటీ ట్రెండ్ పెరిగిన తర్వాత హాలీవుడ్, కోలీవుడ్, సాండల్‌వుడ్ అనే బేధాలు లేకుండా మంచి సినిమా ఏ భాషలో వచ్చినా చూస్తున్నారు. ఈ ఓటీటీ ట్రెండ్ రీమేక్‌లపై గట్టిగానే పడింది. మరోవైపు ప్రేక్షకుల అభిరుచులు ఎప్పటికప్పుడు మారిపోవడం కూడా రీమేక్ కథల హవా తగ్గడానికి కారణమైంది. ఈ ఏడాది టాలీవుడ్ పది వరకు రీమేక్ సినిమాలు రిలీజ్ కాగా ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్టు కాలేదు. అరువు కథలతో సినిమాలు చేసిన స్టార్ హీరోలకు కూడా నిరాశే మిగిలింది.
మెగా హీరోలకు పంచ్
ఈ ఏడాది మెగా హీరోలు చిరంజీవి భోళాశంకర్, పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారు. ఈ రెండు సినిమాలు రీమేక్‌లే కావడం గమనార్హం. అజిత్ వేదాళం ఆధారంగా భోళాశంకర్ తెరకెక్కగా...తమిళమూవీ వినోదయసిత్తం కథతో బ్రో మూవీ రూపొందింది.
ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. బ్రో వసూళ్ల పరంగా పర్వాలేదనిపించిన భోళాశంకర్ మాత్రం నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చింది. రెండు రీమేక్‌లతో ఫ్యాన్స్‌ను మెగా హీరోలు డిసపాయింట్ చేశారు. గాడ్‌ఫాదర్, భోళాశంకర్ బ్యాక్ టూ బ్యాక్ రీమేక్ మూవీస్ షాకివ్వడంతో అరువు కథలకు కొన్నాళ్లు దూరంగా ఉండాలని చిరంజీవి ఫిక్సైనట్లు ప్రచారం జరుగుతోంది.
రావణాసురతో రవితేజ...
రావణాసురతో చాలా కాలం తర్వాత రీమేక్ సినిమా చేశారు రవితేజ. బెంగాళీ మూవీ రీమేక్‌గా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫెయిల్యూర్‌గా నిలిచింది. అలాగే మలయాళంలో విమర్శకుల ప్రశంసల్ని అందుకున్న కప్పేలా సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బుట్టబొమ్మ పేరుతో తెలుగులో రీమేక్ చేసింది. ఫిబ్రవరిలో రిలీజైన ఈ మూవీ ఫస్ట్ వీక్‌లోనే ఈ మూవీ థియేటర్లలో కనిపించకుండాపోయింది.
కృష్ణ వంశీ రంగమార్తండ...
చాలా కాలం తర్వాత సీనియర్ డైరెక్టర్ కృష్ణ వంశీ రంగమార్తండ మూవీతో తెలుగు ప్రేక్షకులముందుకొచ్చారు. మరాఠీలో అవార్డులను అందుకొన్న నటసామ్రాట్ ఆధారంగా డ్రామా కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. మంచి సినిమాగా రంగమార్తండకు పేరొచ్చిన కమర్షియల్‌గా మాత్రం వర్కవుట్ కాలేదు.
సుధీర్ బాబు హంట్ కూడా మలయాళ మూవీ ముంబై పోలీస్‌కు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరించారు.