Brahmamudi Serial Time: బ్రహ్మముడి సీరియల్ కొత్త టైమ్ ఇదే.. షాకింగ్.. టాప్ రేటింగ్ సీరియల్ ప్రైమ్ టైమ్ నుంచి ఔట్
Brahmamudi Serial Time: బ్రహ్మముడి సీరియల్ టైమ్ మారిపోయింది. నవంబర్ 12 నుంచి స్టార్ మాలో సరికొత్త సీరియల్ రానుండటంతో ఈ టాప్ టీఆర్పీ రేటింగ్ సీరియల్ నుంచి ప్రైమ్ టైమ్ నుంచి తప్పించడం అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది.
Brahmamudi Serial Time: స్టార్ మా టాప్ టీఆర్పీ రేటింగ్ సీరియల్ బ్రహ్మముడి టెలికాస్ట్ టైమ్ మారిపోయింది. ఆ సీరియల్ ఇన్నాళ్లూ రాత్రి 7.30 గంటలకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే నవంబర్ 12 నుంచి కొత్తగా ఇల్లు ఇల్లాలు పిల్లలు అనే సీరియల్ అదే సమయంలో టెలికాస్ట్ కానుందని స్టార్ మా ప్రకటించడంతో మరి బ్రహ్మముడి పరిస్థితేంటన్న సందేహం నెలకొంది. మొత్తానికి దీనికి సమాధానం దొరికింది.
బ్రహ్మముడి కొత్త టైమ్ ఇదే
ఎన్నో నెలలుగా తెలుగు టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ లో దూసుకెళ్తోంది బ్రహ్మముడి. అలాంటి సీరియల్ ను స్టార్ మా ఇప్పుడు ప్రైమ్ టైమ్ నుంచి తప్పించి మధ్యాహ్నం ఒంటి గంటకు టెలికాస్ట్ చేయనుంది. వచ్చే మంగళవారం (నవంబర్ 12) నుంచి బ్రహ్మముడి మధ్యాహ్నం ఒంటి గంటకే రానుంది. ఈ విషయాన్ని స్టార్ మా అధికారికంగా అనౌన్స్ చేసింది.
కొత్త సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7.30 గంటలకు రానుంది. అయితే ఈ నిర్ణయం అభిమానులకు అంతగా మింగుడు పడటం లేదు. అంత మంచి రేటింగ్ ఇస్తున్న సీరియల్ ను ఓ కొత్త సీరియల్ కోసం ఎందుకు తప్పిస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా స్టార్ మాను నిలదీస్తున్నారు.
రాత్రి నుంచి మధ్యాహ్నానికి..
సాధారణంగా ఏ ఛానెల్ అయినా తమకు మంచి టీఆర్పీ రేటింగ్స్ అందించే సీరియల్స్ ను ప్రైమ్ టైమ్ లో అంటే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్యలో టెలికాస్ట్ చేస్తుంది. ఆ సమయంలోనే చాలా మంది టీవీలు, సీరియల్స్ చూస్తుంటారు.
కొత్త సీరియల్స్ ను మధ్యాహ్నం తీసుకొచ్చి క్రమంగా వాటి రేటింగ్ మెరుగవుతుంటే ప్రైమ్ టైమ్ లోకి మారుస్తారు. కానీ బ్రహ్మముడి విషయంలో ఇది రివర్సయింది. ఇదే ఆ సీరియల్ అభిమానులకు మింగుడు పడటం లేదు. ఈ టైమ్ మార్పు అనేది బ్రహ్మముడి టీఆర్పీలపై ఎంతమేర ప్రభావం చూపిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
ఈ మధ్యే స్టార్ మా సీరియల్స్ 43వ వారానికి సంబంధించిన టీఆర్పీ రేటింగ్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో బ్రహ్మముడి 13కిపైగా రేటింగ్ తో తొలి స్థానంలోనే కొనసాగింది.
ఆ తర్వాత కార్తీకదీపం, చిన్ని, గుండెనిండా గుడిగంటలు, ఇంటింటి రామాయణంలాంటి సీరియల్స్ ఉన్నాయి. ఈ టాప్ 5 సీరియల్స్ అన్నీ ప్రైమ్ టైమ్ లో టెలికాస్ట్ అవుతున్నవే. ఇప్పుడు బ్రహ్మముడి మాత్రం సాయంత్రం 7.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు మారింది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌లో టీవీల్లో సీనియర్ నటుడు ప్రభాకర్‌తో పాటు సీనియర్ హీరోయిన్ ఆమని ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. ఈ సీరియల్‌లో రామరాజు గా ప్రభాకర్, వేదవతి పాత్రలో ఆమని నటిస్తున్నారు. ముగ్గురు కొడుకులకు తండ్రిగా ప్రభాకర్ ఈ సీరియల్‌లో కనిపించనుండటం విశేషం. ఈ సీరియల్‌లో నితిన్, ప్రశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.