Brahmamudi April 9th Episode: బిడ్డ కోసం ఎండీ సీట్ వదలుకున్న రాజ్ - కొడుకును క్షమించని అపర్ణ - కావ్య త్యాగం
Brahmamudi April 9th Episode: నేటి బ్రహ్మముడి సీరియల్‌లో బిడ్డ కోసం కంపెనీ ఎండీ పదవిని త్యాగం చేయవద్దని రాజ్‌కు అపర్ణ, కావ్య చెబుతారు. పదవి, అధికారం కంటే తనకు బిడ్డే ముఖ్యమని రాజ్ అంటాడు. కళ్యాణ్‌కు ఎండీ పదవి అప్పగిస్తాడు.
Brahmamudi April 9th Episode: తన కొడుకు కోసం దుగ్గిరాల ఫ్యామిలీని, కంపెనీ ఎండీ స్థానాన్ని వదులుకోవడానికి సిద్ధపడతాడు రాజ్. అతడి నిర్ణయాన్ని కావ్య అడ్డుకుంటుంది. ఆ బిడ్డ కోసం మీరు ఎంత గొప్ప కుటుంబాన్ని కోల్పోతున్నారో ఒక్కసారి ఆలోచించమని భర్తకు సర్ధిచెబుతుంది కావ్య. ఆ బిడ్డ తల్లిని తీసుకొచ్చి నిజం ఏమిటో అందరి ముందు బయటపెట్టమని అంటుంది.
మీరు చెప్పేది నిజం అయితే నా స్థానాన్ని ఆ బిడ్డ తల్లికి ఇచ్చి నేను దుగ్గిరాల కోడలి స్థానం నుంచి తప్పుకుంటానని రాజ్‌తో అంటుంది కావ్య. అప్పుడు మీ స్థానం మీకు ఉంటుంది. మీ గౌరవం మీకు దక్కుతుంది. మీ బిడ్డకు దుగ్గిరాల వంశ వారసత్వం దొరుకుతుందని భర్తతో అంటుంది కావ్య. కావ్య చేస్తోన్న త్యాగం చూసి రాజ్ ఎమోషనల్ అవుతాడు.
కావ్య నాకు నచ్చదు...
రాజ్ నాకు నీ భార్య కావ్య నచ్చదని అపర్ణ అంటుంది. అది నా అభిప్రాయం అనిచెబుతుంది. కానీ ఇప్పుడు నీ భార్య కావ్య మాట్లాడింది నూటికి నూరుపాళ్లు నిజం. దుగ్గిరాల ఇంట్లో ఏర్పడిన సంక్షోభానికి కారణం నీ బిడ్డ. వాడి కోసం తల్లి ప్రేమను, భార్య నమ్మకాన్ని దూరం చేసుకున్నావు. ఈ ఇంటి సభ్యుల దృష్టిలో దోషిగా మిగిలిపోయావు. నీ స్థాయిని నువ్వే దిగజార్చుకుంటున్నావు. ఆ బిడ్డను వదలిపెట్టమని కొడుకుతో అంటుంది అపర్ణ.
రాజ్ కఠిన నిర్ణయం...
నేను స్థానం, స్థాయి కోసం, పదిలంగా ఉండటం కోసం రక్త సంబంధాన్ని వదలుకోనని తల్లితో అంటాడు రాజ్. ఆ బిడ్డను అనాథను చేయలేనని తల్లితో చెబుతాడు రాజ్. ఆఫీస్ బాధ్యతల నుంచి తాను తప్పుకొని కళ్యాణ్‌కు ఎండీ పదవి అప్పగిస్తున్నట్లు పేపర్స్‌పై సంతకం చేయడానికి సిద్ధమవుతాడు రాజ్.
అతడిని సీతారామయ్య ఆపుతాడు. నీకు ఏమంత అవసరం వచ్చిందని ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నావని రాజ్‌ను నిలదీస్తాడు. ఈ కుటుంబానికి అండగా ఉన్న ఆస్తి మన కంపెనీ. మన కంపెనీకి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. నువ్వు చేసే ఈ సంతకం వల్ల ఎంత అనర్థం జరుగుతందో అలోచించావా అని రాజ్‌ను నిలదీస్తాడు సీతారామయ్య.
కళ్యాణ్ మీద మోపడం కరెక్ట్ కాదు...
కళ్యాణ్ నా మనవడమే కానీ...ఆఫీస్ బాధ్యతల్ని నిర్వర్తించే దక్షత, అనుభవం అతడికి లేవని సీతారామయ్య అంటాడు. అంత పెద్ద బాధ్యతను చిన్న కుర్రాడి మీద మోపడం కరెక్ట్ కాదని రాజ్‌తో అంటాడు సీతారామయ్య. ఏదో ఒక కారణం చెప్పి నీ బాధ్యతల్ని విస్మరించే హక్కు నీకు లేదని చెబుతాడు.
అన్నయ్య శాసించే స్థాయిలో ఉండాలి...
కళ్యాణ్ కూడా సీతారామయ్య మాటలను సమర్థిస్తాడు. నా అభిరుచులు, మనస్తత్వం వేరని అంటాడు. ఎండీ సీట్ నీకే కరెక్ట్ అని చెబుతాడు. నా అన్నయ్య శాసించే స్థాయిలో ఉండాలి. వదిన కోరుకున్నట్లు నీ స్థానం పడిపోకూడదని అంటాడు. సమస్య పరిష్కారం అయ్యే వరకు నువ్వు మౌనంగా ఉన్న పర్వాలేదు.
కానీ ఇలాంటి కఠిన నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దని రాజ్‌ను కోరుతాడు. ఆ బిడ్డను రాజ్ వదిలేస్తేనే అతడు ఈ ఇంటి వారసుడిగా గుర్తింపును పొందుతాడని రుద్రాణి అంటుంది. అపర్ణ, సుభాష్ ఎంత సర్దిచెప్పిన ఆస్తి, అధికారం కంటే నాకు ఆ బిడ్డ ముఖ్యమని రాజ్ అంటాడు. అతడి మాటలతో అందరూ షాకవుతారు.
రాజ్ సంతకం...
ఆఫీస్ అధికారాలు మొత్తం కళ్యాణ్‌కు ఇస్తున్నట్లు సంతకం చేస్తాడు రాజ్. కళ్యాణ్ దగ్గరకు వచ్చి ఈ స్థాయి, స్థానం నీకు కొత్త. చుట్టూ ప్రత్యర్థులు కాచుకొని ఉంటారు. వాళ్లకంటే ఓ అడుగు ముందుకు వేయడానికి కష్టపడాలి. కుతంత్రాలు చేస్తారు. అది కనిపెట్టే తేలివితేటలు ఉండాలి. పక్కవాళ్లే అణగదొక్కాలని చూస్తారు. అది గుర్తించే సమయస్ఫూర్తి ఉండాలని తమ్ముడికి సలహాలు ఇస్తాడు రాజ్.
అనామిక హ్యాపీ...
ఈ వ్యాపారంలో నిన్ను నువ్వు తప్ప మరొకరిని నమ్మొద్దని చెబుతాడు. దుగ్గిరాల వారు స్థాపించిన పెద్ద సంస్థను మరికొన్ని తరాలకు అందించే బాధ్యత నీపై ఉందని కళ్యాణ్‌తో అంటాడు రాజ్. ఇప్పటివరకు నిన్ను నమ్మని వాళ్లలో ఇక నుంచి నమ్మకాన్ని కలిగించమని చెప్పి పేపర్స్ కళ్యాణ్‌కు ఇస్తాడు రాజ్.కళ్యాణ్‌కు కంపెనీ ఎండీగా స్థానం దక్కడంతో అనామిక, ధాన్యలక్ష్మి సంతోషపడతారు.వెన్నెల అడ్రెస్ తెలుసుకునేందుకు కావ్య తెగ ప్రయత్నాలు చేస్తుంది. వెన్నెలతో చదివిన వాళ్ల వివరాలు సంపాదిస్తుంది.
శ్వేత పేరు కూడా...
ఆ లిస్ట్‌లో శ్వేత పేరు కూడా ఉంటుంది. రాజ్ ఫ్రెండ్ శ్వేతనే ఆమె అయి ఉంటుందని కావ్య ఊహిస్తుంది. కావ్య అంచనా నిజం అవుతుంది. శ్వేత ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. కావ్య కంగారుగా మాట్లాడటం చూసి శ్వేత భయపడుతుంది. భయపడాల్సిందేమి లేదని తాను కలిసి అన్ని వివరాలు చెబుతానని శ్వేతతో అంటుంది కావ్య.
కళ్యాణ్ ఎమోషనల్...
ఎండీగా బాధ్యతలు చేపట్టిన కళ్యాణ్ ఆఫీస్‌లో అడుగుపెడతాడు. ఎండీ క్యాబిన్‌లోకి వచ్చిన ఛైర్‌లో కూర్చోకుండా ఆలోచిస్తుంటాడు. అతడితో పాటు ఆఫీస్‌కు రాహుల్ వస్తాడు. కళ్యాణ్ ఎమోషనల్ అవ్వడం చూసి ఇన్నాళ్లకు రాజ్ ప్లేస్ నీకు దక్కిందని అనుకుంటున్నావా అని అంటాడు రాహుల్. అన్నయ్య ఉండాల్సిన స్థానంలో నేను ఉండాల్సిన పరిస్థితి రాకపోయుంటే బాగుండేదని అంటాడు.
ఇక నుంచి కళ్యాణ్ మీ బాస్ అని, అతడు ఈ కంపెనీకి ఎండీ అని రాహుల్ ప్రకటిస్తాడు. కళ్యాణ్ బాస్ అనగానే కంపెనీ ఎంప్లాయిస్ ఆశ్చర్యపోతారు. రాజ్ ఏమయ్యారని అడుగుతారు. ఇకపై రాజ్ ఎప్పటికీ ఆఫీస్‌కు రాడని రాహుల్ అందరితో చెబుతాడు. అతడి మాటల్ని కళ్యాణ్ అడ్డుకుంటాడు. కొన్ని ఇంపార్టెంట్ పనుల వల్ల కొన్నాళ్లు రాజ్ ఆఫీస్‌కు రాడని, ఈ కంపెనీకి ఎప్పటికైనా రాజ్ ఎండీ అని చెబుతాడు.
అన్నయ్య స్థానంలో...
రాజ్ ఛైర్‌లో కూర్చోవడానికి కళ్యాణ్ ఒప్పుకోడు. ఆ ఛైర్ ఎప్పటికీ అన్నయ్యదేనని అంటాడు. మరో ఛైర్ తెచ్చుకొని కూర్చుంటాడు. కళ్యాణ్ ఎమోషనల్ చూసి రాహుల్ ఓవర్ యాక్షన్ అని భావిస్తాడు. ఎప్పటికైనా ఎండీ సీట్ తనదేనని మనసులో అనుకుంటాడు. రాహుల్ జనరల్ మేనేజర్‌గా కంపెనీలో జాయిన్ అయ్యాడని కళ్యాణ్ ప్రకటించగానే శృతితో పాటు మిగిలిన వారి ఫేస్‌లు మాడిపోతాయి.
అది గమనించిన రాహుల్ నేను ఆఫీస్‌లో జాయినవ్వడం మీకు ఇష్టం లేదా అని అడుగుతాడు. అలాంటిదేమి లేదని అబద్ధం ఆడుతారు. కంపెనీ ఎంప్లాయిస్ వెళ్లిపోగానే కళ్యాణ్‌తో కూర్చొని కబుర్లు చెప్పాలని రాహుల్ అనుకుంటాడు. మనం ఇక్కడికి వచ్చింది కబుర్లు చెప్పుకోవడానికి కాదు పని చేయడానికి అంటూ రాహుల్‌పై కళ్యాణ్ ఫైర్ అవుతాడు.
కావ్య ప్లాన్...
వెన్నెలను శ్వేత ద్వారా పట్టుకోవడానికి కావ్య ఓ ప్లాన్ వేస్తుంది. శ్వేత ఫ్రెండ్స్ అందరిని రీయూనియన్ అయ్యేలా ఓ పార్టీ అరెంజ్ చేస్తుంది. ఆ పార్టీ ద్వారా వెన్నెల ఆచూకీ కనిపెట్టాలని అనుకుంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.