Anil Kapoor Praises NTR: యాక్టింగ్ అంటే ఏంటో ఎన్‌టీఆర్‌ను చూసి నేర్చుకోవాలి.. బాలీవుడ్ సీనియర్ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు
Anil Kapoor Praises NTR: తెలుగువారి అభిమాన నటుడు సీనియర్ ఎన్‌టీఆర్‌పై బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ ప్రశంసల వర్షం కురిపించారు. యువ నటులు యాక్టింగ్ అంటే ఏంటో ఆయన చిత్రాలను చూసి నేర్చుకోవాలని అన్నారు.
Anil Kapoor Praises NTR: ఎన్టీఆర్.. ఈ మూడు అక్షరాల తలచుకుంటే సినీ ప్రియులకే కాదు.. ప్రతి తెలుగువారి హృదయాలు ఉప్పొంగుతాయి. ఆయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడేదో పాన్ ఇండియా సినిమాలంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ సీనియర్ ఎన్టీఆర్ తన సినిమాలతో అప్పట్లోనే భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయి. కానీ మాతృకలో ఆయన చేసిన నటనను సినీ విశ్లేషకులే కాదు.. విమర్శకుల సైతం ప్రశంసించేవారు. తాజాగా ఈ విషయాన్ని బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ కూడా తెలిపారు. యాక్టింగ్ అంటే ఎన్‌టీఆర్‌ను చూసి నేర్చుకోవాలని అన్నారు.
ఇటీవలే ఓ ప్రముఖ మీడియా సంస్థ బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది నటీనటులతో ఇంటర్వ్యూ నిర్వహించింది. ఇందులో అనిల్ కపూర్, అడివి శేష్, ఆయుష్మాన్ ఖురానా, రిషబ్ శెట్టి, విద్యా బాలన్, మృణాల్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ చిట్ చాట్‌లో భాగంగా అడివి శేష్.. అక్కడున్న వారితో కొన్ని బాలీవుడ్ సినిమాలు చూడాలని సూచిస్తారు. వెంటనే ఆయుష్మాన్ ఖురానా కూడా స్పందిస్తూ.. 1967 దిలీప్ కుమార్ నటించిన రామ్ ఔర్ శ్యామ్ తప్పకుండా చూడాలని, అందులో ఆయన నటనకు ఫిదా అవుతామని అంటారు. ఇందుకు అనిల్ కపూర్ స్పందిస్తూ.. ఆ సినిమాకు ఒరిజినల్ అయిన తెలుగు చిత్రం రాముడు-భీముడు చూడమని సలహా ఇస్తారు. అది ఇంకా గొప్పగా ఉంటుందని, అందులో ఎన్‌టీఆర్ అద్భుతంగా చేశారని చెబుతారు. అసలు నటన అంటే ఏంటో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలని స్పష్టం చేస్తారు. ఇందుకు ఆయుష్మాన్‌తో పాటు ఇతర నటులు అవునా అంటూ ఆశ్చర్యపోతారు.
దిలీప్ కుమార్ నటించిన రామ్ ఔర్ శ్యామ్ చిత్రం 1964లో తెలుగులో వచ్చిన రాముడు-భీముడుకు రీమేక్‌గా తెరకెక్కింది. ఇందులో సీనియర్ ఎన్‌టీఆర్ ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను అలరించారు. మూవీ మొఘల్ డీ రామానాయుడు నిర్మించిన ఈ సినిమాను తాపీ చాణక్య దర్శకత్వం వహించారు. డీవీఎస్ రాజు కథను అందించారు. పెండ్యాల సంగీతాన్ని సమకూర్చారు. హిందీతో పాటు ఈ సినిమా తమిళం, మలయాళంలోనూ రీమేక్ అయింది. తమిళంలో ఎంజీఆర్ ఎంగా వెట్టూ పిళ్లే(1965), మలయాళంలో అజయనుమ్-విజయనుమ్(1976), కన్నడలో మొజుగరా, సోగాసుగర(1995)పేరుతో రీమేక్ అయ్యాయి.
సంబంధిత కథనం