NTR centenary celebrations | నిమ్మకూరులో ఘనంగా ఎన్‌టీఆర్ శతజయంతి ఉత్సవాలు..!
దివంగత ముఖ్యమంత్రి, సినీ నటులు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఆయన తనయుడు బాలకృష్ణ నిమ్మకూరులో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు ఏర్పాట్లు చేయనున్నారని సమాచారం.
నందమూరి తారక రామారావు.. ఈ పేరు వింటే తెలుగువారి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆత్మగౌరవానికి నిలువెత్తురూపంగా సినీ, రాజకీయ పరిశ్రమలో తనదైన ముద్రవేసిన దిగ్గజం మన విశ్వవిఖ్యాత నటసౌర్వభౌముడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 7 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా మూడు సార్లు సేవలందించడమే కాకుండా తన నటనతో తెలుగువారిని ఉర్రూతలూగించిన మహానీయుడు. 300కి పైగా సినిమాల్లో నటించిన ఈయన దర్శకుడిగా, నిర్మాతగానూ ప్రభావం చూపారు. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో దేశంలో గొప్పస్థానంలో ఉండటానికి ఆయన వేసిన పునాదులే కారణం. అలాంటి తారక రాముడి శత జయంతి మే 28న రానుంది.
తాజా నివేదికల ప్రకారం ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారట. 2022 మే 28న నందమూరి తారక రామారావు శతజయంతి జరగనుంది. ఈ మేరకు ఎన్టీఆర్ తనయుడు, హిందూపుర్ ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ వేడుకను భారీగా జరిపించాలని ప్లాన్ చేశారట. ఎన్టీఆర్ జన్మించిన నిమ్మకూరులో భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. మే 28 ఉదయం ఈ భారీ సభ జరగబోతుందని తెలుస్తోంది.
ఇదే రోజు గుంటూరు, తెనాలి పట్టణాల్లోనూ ఎన్టీఆర్ శతజయంతికి సంబందించి మరో వేడుకను జరిపించనున్నారు సమాచారం. ఈ కార్యక్రమం కోసం భారీగా నందమూరి అభిమానులతో పాటు తెలుగుదేశం శ్రేణులు కూడా హాజరుకానున్నారని తెలుస్తోంది. అనుకున్న రోజులోపు ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని భావిస్తున్నారట.
మరోపక్క బాలకృష్ణ తన తదుపరి చిత్రం కోసం బిజీగా ఉన్నారు. గతేడాది అఖండతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న బాలకృష్ణ.. గోపిచంద్ మలినేనితో ఓ సినిమా చేయబోతున్నారు. ఇది ఆయన నటిస్తోన్న 107వ చిత్రం. ఇందులో హీరోయిన్‌గా శృతిహాసన్ చేస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది. కన్నడ హీరో దునియా విజయ్ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్