Bigg Boss Nominations: కామెడీ అంటే ఏమనుకుంటున్నావ్: గౌతమ్‌పై అవినాశ్, రోహిణి ఫైర్.. సారీ అంటూ కాళ్లు మొక్కబోయి..: వీడియో
Bigg Boss 8 Telugu Nominations: గౌతమ్ కృష్ణ, అవినాశ్ మధ్య బిగ్‌బాస్‌లో మరోసారి మాటల ఫైట్ జరిగింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన అవినాశ్ తీవ్రంగా కోప్పడ్డారు. ఆ తర్వాత గౌతమ్ కాళ్ల మీద పడబోయారు. నామినేషన్లలో ఈ గొడవ జరిగింది.
బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్లో ఏడో వారం మొదలుకానుంది. గత వారం కిర్రాక్ సీత ఎలిమినేట్ అయ్యారు. దీంతో ఈ వారం నామినేషన్ల ప్రక్రియ నేటి (అక్టోబర్ 14) సోమవారం ఎపిసోడ్లో ఉండనుంది. నామినేషన్ల సందర్భంగా గౌతమ్ కృష్ణపై అవినాశ్, రోహిణి సీరియస్ అయ్యారు. అశ్వత్థామ 2.0 కామెంట్‌పై మళ్లీ రచ్చ జరిగింది. ఇందుకు సంబంధించి నేటి ఎపిసోడ్ ప్రోమో వచ్చింది.
ఈ వారం ఎవరు నామినేట్ అవుతారనేది కిల్లర్ గర్ల్స్ అయిన హరితేజ, ప్రేరణపై ఆధారపడి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పటంతో ప్రోమో షురూ అయింది. గుర్రం సౌండ్ వచ్చినప్పుడల్లా కిల్లర్ గర్ల్స్ పరుగెత్తుకుంటూ వెళ్లి హ్యాట్ పట్టుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
గేలి చేశారు
ఓ ఫన్ టాస్క్ సందర్భంగా గౌతమ్ కృష్ణను ఇటీవల అశ్వత్థామ 2.0 అని అవినాశ్ అన్నారు. గత సీజన్లో గౌతమ్ చెప్పిన డైలాగ్‌ను గుర్తు చేశారు. దీంతో గౌతమ్ అప్పుడు ఆగ్రహించారు. ఆ సీజన్‌ది ఎందుకు గుర్తు చేస్తున్నావంటూ ఫైర్ అయ్యారు. అయితే, ఈ పాయింట్ మీదనే ఈ వారం గౌతమ్ కృష్ణను రోహిణి నామినేట్ చేశారు. సరదాగా సాగుతున్న గేమ్‌లో అలా సీరియస్ అవడం తనకు నచ్చలేదని అన్నారు.
కామెడీ అయినా.. ఏదైనా తన విషయంలో గేలి చేయడం కిందికి వస్తుందని గౌతమ్ అన్నారు. అది పెద్ద మాట అని, ఫన్ టాస్కులో అవినాశ్ జోక్ కోసమే అని ముందుగా చెప్పారని నిఖిల్ గుర్తు చేశారు.
డబ్బులు తీసుకోకండి.. అవినాశ్ ఫైర్
ఒక మనిషికి నచ్చని విషయాన్ని గుచ్చిగుచ్చి చెప్పడం గేలి చేయడం అవుతుందని గౌతమ్ గట్టిగా అరిచారు. దీంతో అవినాశ్ కల్పించుకున్నారు. తనకు తెలియదని అవినాశ్ కూడా చాలాసార్లు అరిచారు. రోహిణి కూడా అదే విషయాన్ని చెప్పారు. కావాలని తాను చేయలేదని అవినాశ్ అన్నారు.
‘ఇది కామెడీ షో కాదు.. మనం వచ్చింది బిగ్‌బాస్‌లో’ అని గౌతమ్ అనడంతో అవినాశ్‌కు మరింత కోపం వచ్చేసింది. “కామెడీ తీసుకోలేనప్పుడు.. డబ్బులు కూడా తీసుకోకండి. షోకు రాకండి. కామెడీ అంటే ఏమనుకుంటున్నారు” అంటూ కోపంగా అరిచారు అవినాశ్. జాకెట్ నేలకేసి కొట్టారు.
గౌతమ్ కాళ్లు పట్టుకోబోయిన అవినాశ్
గౌతమ్‌ను అశ్వత్థామ 2.0 అనకండ్రా అంటూ అందరినీ అవినాశ్ అడిగారు. సారీ భయ్యా నాకు తెలియదు అంటూ గౌతమ్ ముందు మోకాళ్లపై కూర్చొని కాళ్లు మొక్కబోయారు అవినాశ్.
కామెడీ చేసేటోళ్లు పిచ్చోళ్లా!
కామెడీ షో కాదంటూ గౌతమ్ చేసిన కామెంట్‌పై రోహిణి కూడా ఫైర్ అయ్యారు. “కామెడీ చేసే వాళ్లు ఏమైనా పిచ్చోళ్లా. నాకు అర్థం కాదు. కామెడీ షో వాళ్లకు ఎమోషన్లు ఉండవా?” అని రోహిణి అసంతృప్తి వ్యక్తం చేశారు.
మళ్లీ అశ్వత్థామ పాయింటే తీసుకొస్తున్నారని గౌతమ్ కన్నీరు పెట్టుకున్నారు. నవ్వించడానికి తాను అలా అన్నానని, గౌతమ్ బాధపడతాడని తెలిసి ఉంటే తాను అలా ఎందుకు చేస్తానని నిఖిల్‌తో అవినాశ్ చెప్పుకున్నారు. మొత్తంగా గౌతమ్‌ను అశ్వత్థామ కామెంట్ వెంటాడుతూనే ఉంది. ఈ వారం నామినేషన్లలో ఎవరు ఉంటారో నేటి ఎపిసోడ్లో తేలనుంది.