Bigg Boss: బిగ్‍బాస్ హోస్ట్‌గా తప్పుకున్న సీనియర్ హీరో.. కారణం ఇదే-bigg boss tamil 8 kamal haasan takes takes break from bigg boss due to cinematic commitments ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss: బిగ్‍బాస్ హోస్ట్‌గా తప్పుకున్న సీనియర్ హీరో.. కారణం ఇదే

Bigg Boss: బిగ్‍బాస్ హోస్ట్‌గా తప్పుకున్న సీనియర్ హీరో.. కారణం ఇదే

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 06, 2024 06:41 PM IST

Bigg Boss Tamil 8: బిగ్‍బాస్ నుంచి తప్పుకున్నారు తమిళ సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్. 8వ సీజన్‍లో తాను హోస్ట్ చేయనని ప్రకటించారు. ఇందుకు కారణాన్ని కూడా తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Bigg Boss: బిగ్‍బాస్ హోస్ట్‌గా తప్పుకున్న సీనియర్ హీరో.. కారణం ఇదే
Bigg Boss: బిగ్‍బాస్ హోస్ట్‌గా తప్పుకున్న సీనియర్ హీరో.. కారణం ఇదే

పాపులర్ రియాల్టీ షో 'బిగ్‍బాస్' తమిళంలోనూ బాగా పాపులర్ అయింది. ఇప్పటి వరకు వచ్చిన ఏడు సీజన్లు సక్సెస్ అయ్యాయి. తమిళ స్టార్ సీనియర్ హీరో, లోకనాయుడు కమల్ హాసన్.. బిగ్‍బాస్ తమిళ్ ఏడు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించారు. సక్సెస్‍ఫుల్‍గా సీజన్లను నడిపారు. త్వరలోనే 8వ సీజన్ రావాల్సి ఉంది. ఈ తరుణంలో కమల్ హాసన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బిగ్‍బాస్ట్ హోస్టింగ్ నుంచి తాత్కాలికంగా తప్పుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ విషయాన్ని నేడు (ఆగస్టు 6) సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

కారణం ఇదే

బిగ్‍బాస్ నుంచి తాను విరామం తీసుకుంటున్నానని కమల్ హాసన్ నేడు సోషల్ మీడియాలో ఓ లెటర్ రిలీజ్ చేశారు. రానున్న సీజన్‍కు హోస్ట్‌గా చేయనని స్పష్టం చేశారు. చేయాల్సిన సినిమాలు ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కమల్ వెల్లడించారు.

భారమైన మనసుతోనే బిగ్‍బాస్ నుంచి బ్రేక్ తీసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు కమల్ హాసన్ వెల్లడించారు. “ఏడు సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన ప్రయాణం నుంచి నేను స్వల్ప విరామం ప్రకటిస్తున్నానని భారమైన హృదయంతో తెలియజేస్తున్నా. ముందుగానే అంగీకరించిన సినిమాల వల్ల రానున్న బిగ్‍బాస్ తమిళ్ సీజన్‍కు హోస్ట్ చేయలేను” అని కమల్ హాసన్ లెటర్‌లో వెల్లడించారు.

ధన్యవాదాలు అంటూ..

తనపై ప్రేమ, అప్యాయత చూపిన అందరికీ ధన్యవాదాలు అంటూ కమల్ రాసుకొచ్చారు. “మీ ఇళ్లలోనే మిమ్మల్ని చేరుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. మీరు ప్రేమ, ఆప్యాయత చూపారు. దీనికి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. భారత్‍లో బెస్ట్ టెలివిజన్ షోలలో బిగ్‍బాస్ తమిళ్ ఒకటిగా నిలిచేందుకు కంటెస్టంట్లకు మీరు ఇచ్చిన మద్దతు ప్రధాన కారణంగా ఉంది” అని కమల్ హాసన్ తెలిపారు.

స్టార్ విజయ్ టీవీ ఛానెల్‍కు, సిబ్బందికి కూడా కమల్ హాసన్ థ్యాంక్స్ చెప్పారు. బిగ్‍బాస్ ఏడు సీజన్లు విజయవంతంగా జరిగేందుకు సహకరించిన టీమ్‍కు కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న సీజన్ కూడా సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. మరి, రానున్న బిగ్‍బాస్ తమిళ్ 8వ సీజన్‍కు ఎవరు హోస్ట్‌గా ఉంటారనేది ఆసక్తికరంగా ఉంది.

2017లో బిగ్‍బాస్ తమిళ్ తొలి సీజన్‍కు కమల్ హాసన్ హోస్టింగ్ చేశారు. ఏడు సీజన్లకు కూడా హోస్ట్‌గా వ్యవహరించారు. ఏడో సీజన్ గతేడాదే జరిగింది. త్వరలో 8వ సీజన్ రానుంది. ఈలోగానే బిగ్‍బాస్ నుంచి తప్పుకున్నారు కమల్ హాసన్.

కమల్ హాసన్ సినిమాల లైనప్ ఇలా..

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు 2 సినిమా జూలైలో థియేటర్లలో రిలీజైంది. భారీగా అంచనాలు పెట్టుకున్న ఈ సీక్వెల్ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కమల్ నటించిన కల్కి 2898 ఏడీ బ్లాక్‍బస్టర్ అయింది. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ మణిరత్నంతో ‘థగ్‍లైఫ్’ సినిమా చేస్తున్నారు కమల్ హాసన్. నాయకన్ తర్వాత సుమారు 36 ఏళ్లకు కమల్ - మణిరత్నం కాంబో రిపీట్ అవుతుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా థగ్‍లైఫ్ రూపొందుతోంది. ప్రస్తుతం షూటింగ్ జోరుగా సాగుతోంది. భారతీయుడు 3 సినిమా కూడా రావాల్సి ఉంది. కల్కి 2లోనూ కమల్ హాసన్ పాత్ర ప్రధానంగా ఉండనుంది.