Thug Life Movie: ఆ విషయంలో రికార్డు సృష్టించిన కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ సినిమా!
Thug Life Movie: ‘థగ్ లైఫ్’ సినిమాపై చాలా క్రేజ్ ఉంది. కమల్‍హాసన్ - మణిరత్నం కాంబినేషన్ కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. దీంతో ఈ సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులు రికార్డు ధరకు అమ్ముడయ్యాయనే విషయం బయటికి వచ్చింది. ఆ వివరాలివే..
Thug Life Movie: తమిళ సీనియర్ స్టార్ హీరో, లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో థగ్ లైఫ్ చిత్రం రూపొందుతోంది. యాక్షన్ డ్రామా మూవీగా ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. సుమారు 36 ఏళ్ల తర్వాత కమల్ - మణిరత్నం కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో థగ్ లైఫ్ చిత్రంపై అంచనాలు అత్యంత భారీగా ఉన్నాయి. నాయకన్ తర్వాత ఈ ఇద్దరూ ఇప్పుడే కలిసి పని చేస్తున్నారు. కాగా, ఫుల్ హైప్ ఉన్న థగ్ లైఫ్ సినిమాకు తాజాగా ఇంటర్నేషనల్ ఓవర్సీస్ థియేట్రికల్ హక్కుల డీల్ కుదిరింది.
డీల్ ఎంతంటే..
థగ్ లైఫ్ సినిమా ఇంటర్నేషనల్ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఏపీ ఇంటర్నేషనల్, హోం స్క్రీన్ ఎంటర్‌టైన్‍మెంట్ సంయుక్తంగా సొంతం చేసుకున్నాయి. ఏకంగా రూ.63కోట్లను ఈ ఓవర్సీస్ హక్కుల ద్వారా థగ్ లైఫ్ సొంతం చేసుకుందని తెలుస్తోంది.
రికార్డు ఇదే
ఓవర్సీస్ థియేట్రికల్ హక్కుల డీల్ విషయంలో థగ్ లైఫ్.. కోలీవుడ్‍లో రికార్డు సృష్టించింది. దళపతి విజయ్ హీరోగా నటించిన లియో సినిమా ఓవర్సీస్ రైట్స్ గతేడాది రూ.60కోట్లకు అమ్ముడయ్యాయి. అయితే, ఇప్పుడు థగ్ లైఫ్ మూవీ ఓవర్సీస్ డీల్ రూ.63 కోట్లకు జరిగిందని సమాచారం బయటికి వచ్చింది. దీంతో లియోను బీట్ చేసి అత్యధిక ఓవర్సీస్ థియేట్రికల్ బిజినెస్ చేసిన తమిళ మూవీగా థగ్ లైఫ్ రికార్డు దక్కించుకుంది.
థగ్ లైఫ్ సినిమాలో కమల్ హాసన్ సరసన త్రిష హీరోయిన్‍గా నటిస్తున్నారు. శింబు, అశోక్ సెల్వన్ కూడా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తారని గతంలో టీమ్ ప్రకటించింది. అయితే, ఇతర సినిమాల వల్ల డేట్స్ కుదరకపోవటంతో ఈ చిత్రం నుంచి దుల్కర్ తప్పుకున్నారు. జయం రవి కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి ఔటయ్యారని తెలుస్తోంది. దీంతో శింబూను ఈ సినిమా కోసం తీసుకున్నారు మేకర్స్.
థగ్ లైఫ్ మూవీలో ఐశ్వర్య లక్ష్మి, పంకజ్ త్రిపాఠి అభిరామి, నాజర్, అలీ ఫజల్, సాన్యా మల్హోత్రా కూడా కీరోల్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి హీరో కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం నిర్మాతలుగానూ ఉన్నారు. ఆర్.మహేంద్రన్, శివ అనంత్ కూడా నిర్మాణంలో భాగంగా ఉన్నారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు.
కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషించిన ఇండియన్-2 (తెలుగులో భారతీయుడు-2) కూడా రిలీజ్ కావాల్సి ఉంది. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇండియన్ మూవీకి సుమారు 28 సంవత్సరాల తర్వాత సీక్వెల్‍గా ఈ చిత్రం వస్తోంది. ఇండియన్-2 మూవీని జూన్‍లో రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ ప్రకటించింది. అయితే, జూలైకు ప్లాన్ మార్చుకున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ సినిమాలోనూ కమల్ హాసన్ కీలకపాత్ర పోషించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ జూన్ 27వ తేదీన గ్లోబల్ రేంజ్‍లో రిలీజ్ కానుంది.