Bahishkarana Review: బహిష్కరణ వెబ్ సిరీస్ రివ్యూ - అంజలి వేశ్యగా నటించిన రివేంజ్ థ్రిల్లర్ సిరీస్ ఎలా ఉందంటే?
Bahishkarana Review: అంజలి, అనన్య నాగళ్ల, శ్రీతేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన బహిష్కరణ వెబ్‌సిరీస్ శుక్రవారం జీ5 ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సిరీస్ ఎలా ఉందంటే?
Bahishkarana Review: అంజలి (Anjali) ప్రధాన పాత్రలో నటించిన బహిష్కరణ వెబ్‌సిరీస్ (Bahishkarana Web Series) ఈ శుక్రవారం (జూలై 19న) జీ5 ఓటీటీలో రిలీజైంది. శ్రీతేజ్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్‌సిరీస్‌కు ముఖేష్ ప్రజాపతి దర్శకత్వం వహించాడు. రివేంజ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన వేశ్యగా అంజలి నటన ఎలా ఉంది? ఈ వెబ్‌సిరీస్ ప్రేక్షకులను మెప్పిస్తుందా? లేదా అంటే?
పుష్ప రివేంజ్
గుంటూరు జిల్లాలోని పెద్దపల్లికి శివయ్య (రవీంద్ర విజయ్) 25 ఏళ్లుగా ప్రెసిడెంట్‌గా పనిచేస్తుంటాడు. డబ్బు, అధికారం అడ్డం పెట్టుకొని మహిళల జీవితాలతో ఆడుకుంటుంటాడు. పుష్ప (అంజలి) ఓ వేశ్య. శివయ్యకు ఉంపుడుగత్తెగా ఉంటుంది. శివయ్య దగ్గర పనిచేసే దర్శి (శ్రీతేజ్) పుష్పను ప్రేమిస్తాడు. దర్శితో కలిసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని పుష్ప కూడా ఆశపడుతుంది.
కానీ శివయ్య తెలివిగా వారి పెళ్లిని అడ్డుకుంటాడు. పుష్ప కళ్ల ముందే లక్ష్మితో (అనన్య నాగళ్ల) దర్శి పెళ్లి జరిగేలా చేస్తాడు. ప్రాణంగా ప్రేమించిన పుష్ప దూరం కావడంతో శివయ్య తాగుడుకు బానిసగా మారుతాడు. ప్రేమతో భర్తను తన దారిలోకి తెచ్చుకుంటుంది లక్ష్మి. వారి కాపురం ఆనందంగా సాగిపోతున్న టైమ్‌లోనే దర్శి ఓ రేప్ కమ్ మర్డర్ కేసులో జైలు పాలవుతాడు?
దర్శిని ఈ కేసులు ఇరికించింది ఎవరు? శివయ్య చేస్తోన్న అన్యాయాలపై ఎదురుతిరిగిన దర్శి జీవితం ఎలా విషాదాంగా ముగిసింది? శివయ్య తోటలో ఉన్న గులాబీ మొక్కల కథేమిటి? శివయ్యతో పాటు అతడి అనుచరులపై లక్ష్మి సహాయంతో పుష్ప ఎలా రివేంజ్ తీర్చుకుంది? అన్నదే ఈ వెబ్‌సిరీస్ కథ(Bahishkarana Review)
పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్...
బహిష్కరణ పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రివేంజ్ డ్రామా థ్రిల్లర్ సిరీస్. తన ప్రియుడికి జరిగిన అన్యాయంపై ఓ వేశ్య ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుందనే పాయింట్‌తో దర్శకుడు ముఖేష్ ప్రజాపతి ఈ వెబ్‌సిరీస్ కథను రాసుకున్నాడు.
1990 దశకంలో సమాజంలో ఉన్న కులవివక్ష, అగ్ర వర్ణాల చేతిలో అట్టడుగు వర్గాల వారు, ముఖ్యంగా మహిళలు ఏ విధంగా అణిచివేయబడ్డారన్నది తమిళ సినిమాలు, సిరీస్‌లకు ఏ మాత్రం తీసిపోని విధంగా రా అండ్ రస్టిక్‌గా బహిష్కరణలో చూపించాడు డైరెక్టర్. ఆ నేటివిటి ఈ వెబ్‌సిరీస్‌కు ప్లసయ్యింది.
ఆరు ఎపిసోడ్స్...
మొత్తం ఆరు ఎపిసోడ్స్‌తో దర్శకుడు ఈ సిరీస్‌ను(Bahishkarana Review) తెరకెక్కించాడు. దర్శి, లక్ష్మితో పాటు సిరి పాత్రలను పరిచయం చేస్తూ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సిరీస్ మొదలవుతుంది. ఆ తర్వాత శివయ్యపై దర్శి పగతో రగిలిపోతున్నట్లుగా చూపించి ఆసక్తిని రేకెత్తించారు డైరెక్టర్. ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌తో ఫస్ట్ ఎపిసోడ్‌ను ముగించిన దర్శకుడు సెకండ్ ఎపిసోడ్ నుంచి మొత్తం ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ చూపించారు. దర్శి, పుష్ప లవ్ స్టోరీ సినిమాటిక్ వేలో కాకుండా నాచురల్‌గా రాసుకున్నాడు డైరెక్టర్. సింపుల్ డైలాగ్స్‌తో ఆహ్లాదకరంగా లవ్‌స్టోరీ సాగిపోతుంది.
ఓ వైపు లవ్ స్టోరీని నడిపిస్తూనే శివయ్యకు నమ్మిన బంటుగా ఉన్న దర్శికి అతడు చేస్తోన్న అక్రమాల గురించి ఎలా తెలిసింది? శివయ్యను చంపాలని అనుకున్న దర్శి ప్రయత్నాలు ఫలించాయా లేదా అన్నది మిగిలిన ఎపిసోడ్స్‌లో ప్రజెంట్ చేశాడు డైరెక్టర్. ప్రియుడు చేయలేని పనిని పుష్ప ఎలా చేసిందన్నది ఫైనల్ ఎపిసోడ్‌లో చూపించి సిరీస్‌ను ఎండ్ చేశాడు.
ప్రజెంటేషన్ రొటీన్...
బహిష్కరణ(Bahishkarana Review) కాన్సెప్ట్ బాగున్నా ప్రజెంటేషన్ మాత్రం రొటీన్‌గా అనిపిస్తుంది. సిరీస్ మొత్తం పెద్ద మలుపులేమి లేకుండా ఫ్లాట్‌గా సాగిపోతుంది. డ్రామా, ఎమోషన్స్‌కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ కులవివక్ష అంశంతో గతంలో తెరపై ఎన్నో సినిమాలొచ్చాయి. వేశ్య బ్యాక్‌డ్రాప్ కొత్తగా ఉన్న మిగిలిన స్టోరీలైన్ పాత సినిమాలకు గుర్తుకు తెస్తుంది. పాటలతో సిరీస్‌ను సాగదీసినట్లుగా అనిపిస్తుంది.
అంజలి అదుర్స్...
వేశ్యగా బోల్డ్ రోల్‌లో అంజలి అదరగొట్టింది. తన డైలాగ్స్, మ్యానరిజమ్స్ కొత్తగా ఉన్నాయి. ఇష్టంలేని జీవితాన్ని గడుపుతూ నిరంతరం వేదనకు లోనయ్యే వేశ్యగా, ప్రియుడి ప్రేమ కోసం పరితపించే ప్రియురాలిగా చక్కటి వేరియేషన్స్ చూపించింది. క్లైమాక్స్‌లో నట విశ్వరూపం చూపించింది.
దర్శిగా శ్రీతేజ్ పాత్ర ఈ సిరీస్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. అన్యాయాలను సహించని అట్టడుగు వర్గం వ్యక్తి పాత్రకు ప్రాణం పోశాడు. లక్ష్మి పాత్రలో అనన్య నాగళ్ల నాచురల్ పర్ఫార్మెన్స్ కనబరిచింది. రవీంద్ర విజయ్ విలనిజాన్ని డైలాగ్స్‌తోనే పవర్‌ఫుల్‌గా వెబ్‌సిరీస్‌లో ప్రజెంట్ చేశాడు డైరెక్టర్.
డైలాగ్స్ బాగున్నాయి...
ప్రతి నేరం ఓ నీతి కథ చెబుతూనే ఉంటుంది. నీతి కథ విని మనిషి నేరాలు చేయకుండా ఉంటే చరిత్ర ఉండేది కాదు...లోకంలో ప్రతి యుద్ధం స్వార్థంతోనే మొదలవుతుంది. నిస్వార్థం నీళ్ల మీద నీడ లాంటిది అంటూ శ్యామ్ చెన్ను రాసిన డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. సిద్ధార్థ్ సదాశివుని మ్యూజిక్ బాగుంది.
రా అండ్ రస్టిక్...
రా అండ్ రస్టిక్ కథలు తమిళంలో ఎక్కువగా వస్తుంటాయి...తెలుగులో రావని విమర్శించే వారికి సమాధానంగా బహిష్కరణ వెబ్‌సిరీస్ నిలుస్తుంది. అంజలి, శ్రీతేజ్ యాక్టింగ్, మేకింగ్ కోసం ఈ సిరీస్‌ను చూడొచ్చు.
రేటింగ్: 3/5