Asvins Movie Review: అశ్విన్స్ మూవీ రివ్యూ - రివర్స్ స్క్రీన్‌ప్లేతో రూపొందిన హారర్ మూవీ ఎలా ఉందంటే?
Asvins Movie Review: వసంత్ రవి, విమలారామన్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ మూవీ అశ్విన్స్. తరుణ్ తేజ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది.
Asvins Movie Review: వసంత్ రవి, విమలా రామన్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ మూవీ అశ్విన్స్ నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఇటీవల ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు తరుణ్ తేజ దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ మూవీని నిర్మించాడు. హారర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే...
యూట్యూబర్స్ కథ...
అర్జున్ (వసంత్ రవి), రీతూ (సరస్వతి మీనన్) భార్యభర్తలు. మరో ముగ్గురు స్నేహితులు వరుణ్, రాహుల్ గ్రేసీలతో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంటారు. దయ్యాలున్నాయని ప్రచారంలో ఉన్న బిల్డింగ్‌లు, ప్రాంతాల్లో వీడియోలు షూట్ చేస్తుంటారు. ఇండియాలో వారు చేసిన వీడియోలు సక్సెస్ కావడంతో లండన్‌లోని ఓ పురాతన భవంతి మిస్టరీని సాల్వ్ చేసే ప్రాజెక్ట్ వారికి వస్తుంది.
ఆ బిల్డింగ్‌లో ఆర్తి రాజగోపాల్ (విమలా రామన్) అనే ఆర్కిటెక్ట్‌తో పాటు మరికొంతమంది అనుమానాస్పద స్థితిలో చనిపోతారు. ఆర్తి రాజగోపాల్ డెడ్‌బాడీ కూడా కనిపించకుండా పోతుంది. ఆ బిల్డింగ్‌లోకి అడుగుపెట్టడానికే చాలా మంది భయపడిపోతారు. వీడియో ప్రాజెక్ట్ కోసం ఆ పురాతన భవంతిలోకి ఎంటరైన అర్జున్ తో పాట అతడి స్నేహితులకు అనూహ్య పరిణామాలు ఎదురవుతాయి.
రీతూతో పాటు వరుణ్, రాహుల్ గ్రేసీ చనిపోతారు. వారిని అర్జున్ చంపినట్లుగా కెమెరాలో రికార్డ్ అవుతుంది. నిజంగా వారిని అర్జున్ చంపేశాడా? అసలు ఆ బిల్డింగ్‌లో ఏముంది? అర్తి రాజగోపాల్ ఇండియాలో వెలికితీసిన అశ్వినీదేవతలు ప్రసాదించిన రెండు విగ్రహాల కథేమిటి?
తన స్నేహితుల్ని కాపాడుకోవడానికి అర్జున్ ఆ బిల్డింగ్‌లో ఉన్న రాక్షసుడితో ఎలాంటి పోరాటం చేశాడు? అర్జున్ ఆ బిల్డింగ్‌లోకి అడుగుపెడతాడని ఆర్తి ముందుగానే ఎలా ఊహించింది? అన్నదే అశ్విన్స్(Asvins Movie Review) సినిమా కథ.
ఎవర్ గ్రీన్ పాయింట్...
ఓ పురాతన భవంతిలో ఆత్మ ఉండటం, ఆ బిల్డింగ్ మిస్టరీని హీరో సాల్వ్ చేయడం అన్నది హారర్ సినిమాల్లో ఎవర్‌గ్రీన్ కాన్సెప్ట్. ఈ పాయింట్‌తో తెలుగుతోపాటు వివిధ భాషల్లో లెక్కలేనన్ని సినిమాలొచ్చాయి. అయినా ఈ కాన్సెప్ట్‌కు మాత్రం క్రేజ్ తగ్గలేదు. ప్రతి రెండు, మూడు నెలలకు ఈ కథాంశంతో హారర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంది. అశ్విన్స్ (Asvins Movie Review)కూడా ఈ ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్‌తోనే రూపొందింది.
అశ్వినీదేవతల విగ్రహాలు...
హారర్‌కు మైథాలజీని మిక్స్ చేస్తూ దర్శకుడు తరుణ్‌తేజ ఈ మూవీని తెరకెక్కించారు. అశ్వినీ దేవతలు ఇచ్చిన ఓ విగ్రహాలు అనే చిన్న పౌరాణిక కథ నేపథ్యంలో ఓ పురాతన బిల్డింగ్‌లో ఉన్న రాక్షస ఆత్మ, దాని గుట్టును ఛేధించే హీరో కథతో చివరి వరకు భయపెట్టేలా అశ్విన్స్ సినిమాను(Asvins Movie Review) నడిపించాడు డైరెక్టర్.
పారానార్మల్ యాక్టివిటీ లాంటి సినిమాలతో ఫేమస్ అయినా ఫౌండ్ ఫుటేజ్ అనే టెక్నిక్‌ను అశ్విన్స్ సినిమాలో వాడాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫౌండ్ ఫుటేజ్ సీన్స్‌తోనే నడుస్తుంది ఈ మూవీ. హీరోతో పాటు అతడి స్నేహబృందం కెమెరాలో షూట్ చేసిన సీన్స్‌లో హారర్ ఎలిమెంట్స్ బాగా వర్కవుట్ అయ్యాయి.
రివర్స్ స్క్రీన్‌ప్లే...
అశ్విన్స్ మూవీ కంప్లీట్‌గా రివర్స్ స్క్రీన్‌ప్లేలో సాగుతుంది. హీరో వైఫ్‌తో పాటు అతడి స్నేహితులు చనిపోయిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ఆ తర్వాతే వారి ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ చూపించి మళ్లీ ప్రజెంట్‌లోకి తీసుకొస్తూ స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేశాడు డైరెక్టర్. అర్తి రాజగోపాల్ ఎపిసోడ్‌తోపాటు బిల్డింగ్‌లో ఉన్న రాక్షసుడిని ఎదురించే పవర్ హీరోకు మాత్రమే ఎలా వచ్చిందనే లాజిక్‌గా కూడా కన్వీన్సింగ్‌రాసుకున్నాడు. కంప్లీట్‌గా ఒకే బిల్డింగ్‌లో చాలా వరకు ఈ మూవీ సాగుతుంది. సౌండ్ ఎఫెక్ట్స్‌తోనే చాలా సీన్స్‌లో భయపెట్టాడు.
కన్ఫ్యూజన్...
ఫస్ట్ హాఫ్‌లో ఉన్న థ్రిల్ కాస్త సెకండాఫ్‌లో మిస్సయింది. క్లైమాక్స్ చాలా కన్ఫ్యూజన్‌తో సినిమా(Asvins Movie Review) ఎండ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది..సినిమా నిడివి తక్కువే అయినా రిపీటెడ్ సీన్స్ కారణంగా సాగదీసినట్లుగా అనిపిస్తుంది. అశ్వినీ దేవతలు అనే పాయింట్ తప్పితే మిగిలిన కథ మొత్తం రొటీన్‌గా సాగడం కూడా మైనస్‌గా చెప్పవచ్చు.
ఎమోషనల్ రోల్...
అర్జున్‌గా వసంత్ రవి యాక్టింగ్ బాగుంది. ఎమోషనల్ రోల్‌లో చక్కటి యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆర్తి రాజగోపాల్‌గా సీనియర్ హీరోయిన్ విమలారామన్ ఓ కీలక పాత్రలో కనిపించింది. హీరో వైఫ్‌గా సరస్వతి మీనన్‌తో పాటు మిగిలిన స్నేహితులు యాక్టింగ్ కూడా ఒకే.
Asvins Movie Review- హారర్ ఫ్యాన్స్ కోసం...
అశ్విన్స్ హారర్, మైథాలజీ మిక్స్ చేస్తూ తెరకెక్కించిన ఓ డిఫరెంట్ మూవీ. హారర్ మూవీ లవర్స్‌ను డెఫినెట్‌గా అశ్విన్స్ ఆకట్టుకుంటుంది.