Anurag Kashyap on SS Rajamouli: హాలీవుడ్ అంతా ఇప్పుడు రాజమౌళి వైపే చూస్తోంది: బాలీవుడ్ డైరెక్టర్
Anurag Kashyap on SS Rajamouli: హాలీవుడ్ అంతా ఇప్పుడు రాజమౌళి వైపే చూస్తోందని అన్నాడు బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్. అసలు మార్వెల్ లాంటి సినిమాలకు రాజమౌళియే పర్ఫెక్ట్ డైరెక్టర్ అని అతడు అనడం విశేషం.
Anurag Kashyap on SS Rajamouli: ఓ తెలుగు సినిమాను ఆస్కార్స్ స్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్ రాజమౌళి. బాహుబలిలాంటి సినిమాతో మొత్తం దేశం దృష్టిని ఆకర్షించిన జక్కన్న.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. ఈ సినిమా ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులను ఒక్కొక్కటిగా గెలుచుకుంటూ వెళ్తోంది.
చివరికి ఆస్కార్స్ బరిలోనూ ఈ మూవీలోని నాటు నాటు పాట నిలిచింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హాలీవుడ్ మొత్తం రాజమౌళి వైపే చూస్తోందంటూ ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అనడం విశేషం. డీసీ లేదా మార్వెల్ లాంటి సినిమాలకు రాజమౌళి పర్ఫెక్ట్ డైరెక్టర్ అని కూడా ప్రశంసించాడు. పాశ్చాత్య సినిమాలతో కలిసి పని చేయడానికి ఇండియన్ సినిమా ఎప్పటి నుంచో ఎదురు చూస్తుండగా.. ఇప్పుడు రాజమౌళి ఆ దిశగా పెద్ద మార్పుగా నిలుస్తారని అతడు అనడం విశేషం.
"పశ్చిమ దేశాల్లో ఇప్పుడు ప్రతి ఒక్కరూ రాజమౌళిని కలవడానికి ప్రయత్నిస్తున్నారు. పెద్ద మార్పు తీసుకురాగల ఫిల్మ్ మేకర్ అతడు. డీసీ లేదా మార్కెల్ సినిమాకు పర్ఫెక్ట్ డైరెక్టర్. సుదీర్ఘకాలంగా పాశ్చాత్య, ఇండియన్ సినిమా మధ్య సహకారం కోసం సంప్రదింపులు జరుగుతున్నాయి. కానీ రాజమౌళితో అది సహకారం అందించడం కాదు. వాళ్లు అతన్ని మన నుంచి తీసుకెళ్లిపోతారని అనిపిస్తోంది" అని అనురాగ్ కశ్యప్ అనడం విశేషం.
ఇక ఆస్కార్స్ బరిలో నిలిచి నాటు నాటు పాటపై కూడా అతడు స్పందించాడు. ఈ పాటను ఉక్రెయిన్ లో ఏకధాటిగా 12 రోజుల పాటు చిత్రీకరించిన విషయం తెలిసిందే. "నాటు నాటులాంటి పాటను చేయడం చాలా చాలా కష్టం. ఓ పాటను షూట్ చేయడానికి అన్ని రోజుల సమయం పడుతుందని తెలియగానే నేను దానిని వదిలేస్తాను. కానీ అన్ని రోజుల పాటు ఓ పాటను చిత్రీకరించే డైరెక్టర్ ఇక్కడ ఉన్నాడు. దానికి చాలా విజన్, ధైర్యం, సాహసం కావాలి" అని అనురాగ్ అన్నాడు.
నాటు నాటు పాట ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్స్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు 95వ అకాడెమీ అవార్డులలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీ కింద నామినేట్ అయింది. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే.. ఈ పాటకు ఆస్కార్స్ కూడా ఖాయమని అనిపిస్తోంది.
సంబంధిత కథనం