Simbaa Review: సింబా రివ్యూ - అనసూయ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Simbaa Review: జగపతిబాబు, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన సింబా మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. సంపత్ నంది కథను అందించిన ఈ మూవీకి మురళీ మనోహర్ దర్శకత్వం వహించాడు.
Simbaa Review: జగపతిబాబు, అనసూయ (Anasuya) ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ సింబా. సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ మూవీకి దర్శకుడు సంపత్ నంది (Sampath Nandi) కథ, డైలాగ్స్ అందించారు. మురళీ మనోహర్ దర్శకత్వం వహించాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? జగపతిబాబు, అనసూయ హిట్ కొట్టారా? అంటే?
మిర్డర్స్ మిస్టరీ...
అనుముల అక్షిక (అనసూయ) ఓ సాధారణ స్కూల్ టీచర్. అనుకోకుండా ఓ హత్య కేసులో ఇరుక్కుంటుంది. ఈ మర్డర్ కేసును ఇన్వేస్టిగేట్ చేస్తోన్న జర్నలిస్ట్ ఫాజిల్‌తో (శ్రీనాథ్) పాటు అతడి ప్రియురాలు ఇష్ట (దివి) పోలీస్ ఆఫీసర్ అనురాగ్ (వశిష్ట సింహా) కళ్ల ముందే మరో వ్యక్తిని హత్య చేస్తారు. మర్డర్స్ చేసే ముందు అక్షికతో పాటు ఫాజిల్, ఇష్ట వింతగా ప్రవర్తిస్తారు.
తన మనుషులను చంపేసిన అక్షిక, ఫాజిల్‌పై పగతను పెంచుకుంటాడు బిజినెస్‌మెన్ పార్థ (కబీర్‌సింగ్ దుహాన్). వారిని హత్య చేసేందుకు తమ్ముడితో కలిసి ప్లాన్ వేస్తాడు. ఆ ఎటాక్‌లో పార్థ తమ్ముడు కన్నుమూస్తాడు. ఈ హత్యల వెనుక ఎవరున్నారు?
అక్షిక, ఫాజిల్‌లతో మరో డాక్టర్ ద్వారా ఈ హత్యలను ఎవరు చేశారు? తమకు ఈ హత్యలతో సంబంధం లేదని అక్షిక వాదనలో నిజం ఉందా? ఈ మర్డర్స్‌కు పురుషోత్తమ్ రెడ్డికి (జగపతిబాబు)ఉన్న సంబంధం ఏమిటి? ఈ వరుస హత్యల వెనుక ఉన్న మిస్టరీని అనురాగ్ ఎలా ఛేదించాడు అన్నదే సింబా మూవీ(Simbaa Review) కథ.
మెసేజ్ విత్ కమర్షియల్ ఎలిమెంట్స్...
ప్రస్తుతం సందేశాత్మక సినిమాలను తెరకెక్కించే విషయంలో ట్రెండ్ మారింది. ఆడియెన్స్‌కు క్లాస్ ఇస్తున్నట్లుగా సీరియస్‌గా సినిమా తీస్తే నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. సందేశానికి కమర్షియల్ హంగులను జోడిస్తూ నవ్విస్తూనో... లేదంటే థ్రిల్లింగ్‌ను పంచుతూనో చెప్పేందుకు దర్శకులు ప్రయత్నాలు చేస్తోన్నారు. సింబా(Simbaa Review) అలాంటి ప్రయత్నమే.
బయోలాజికల్ మెమోరీ...
పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనే మెసేజ్‌కు బయోలాజికల్ మెమోరీ అనే సైంటిఫిక్ అంశాలను జోడించి దర్శకుడు సంపత్ నంది ఈ కథను రాశాడు. పాయింట్‌గా చూసుకుంటే సింబా ఓ సాధారణ రివేంజ్ స్టోరీనే(Simbaa Review). కానీ
ఈ కథను మర్డర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్‌గా స్క్రీన్‌పై నడిపించడంలో దర్శకుడు కొంత వరకు సక్సెస్ అయ్యాడు.సైన్స్, పర్యావరణం లాంటి రెండు భిన్నమైన అంశాలను రివేంజ్ స్టోరీలో మిక్స్ చేస్తూ కన్వీన్సింగ్‌గా చెప్పాడు.
చిక్కుముడులు రివీల్...
అక్షిక పాత్ర పరిచయం, ఓ వ్యక్తిని ఆమె మర్డర్ చేసే సీన్‌తో సినిమా ఇంట్రెస్టింగ్‌గా మొదలుపెట్టారు దర్శకుడు. ఈ కేసునుసాల్వ్ చేయాలని అనుకున్న వాళ్లు కూడా హత్యలకు పాల్పడే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. అనురాగ్ ఇన్వేస్టిగేషన్ చేసే సీన్స్‌తో అనేక ప్రశ్నలు, చిక్కుముడులను వేసుకుంటూ వెళ్లిన దర్శకుడు సెకండాఫ్‌లో వాటికి ఆన్సర్ ఇచ్చాడు.
వీటి వెనుక ఎవరున్నది రివీల్ చేసే సీన్‌ను రాసుకున్న తీరు మెప్పిస్తుంది. బయోలాజికల్ మెమరీ పాయింట్ ప్రధానంగా సెకండాఫ్‌ను అల్లుకున్నారు. అనుభవజ్ఞులైన నటీనటులు, టెక్నికల్ టీమ్‌ను వాడుకుంటూ టిఫికల్ కాన్సెప్ట్‌ను అర్థవంతంగా చెప్పేందుకు దర్శకుడు పడిన కష్టం తెరపై కనిపిస్తుంది.
ఈజీగా ఊహించేలా...
సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉన్న ట్రీట్‌మెంట్ విషయంలో కొన్నిసార్లు రొటీన్‌గా అడుగులు వేశారు మేకర్స్. సీరియల్ కిల్లింగ్స్ వెనుక ఎవరున్నారన్నది ఈజీగానే ఊహించేలా ఉండటం సినిమాకు మైనస్‌గా మారింది. జగపతి బాబు పాత్రకు సంబంధించిన సీన్స్, డైలాగ్‌లో ఎమోషన్స్ అంతగా పండలేదనిపిస్తుంది.
సెకండాఫ్‌లో ఎంట్రీ...
ఈ సినిమాలో జగపతిబాబు మెయిన్ రోల్ అంటూ ప్రచారం చేసింది సినిమా యూనిట్. కానీ ఆయన పాత్ర సెకండాఫ్‌లోనే సినిమాలో కనిపిస్తుంది. పర్యావరణ ప్రేమికుడిగా ఆయన చెప్పై డైలాగ్స్ పర్వాలేదనిపిస్తాయి.
అక్షికగా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్‌లో అనసూయ కనిపించింది. వశిష్టసింహా, శ్రీనాథ్, దివితో పాటు ప్రతి ఒక్కరూ తమ పరిధుల మేర నటించారు. గౌతమి, కస్తూరి వంటి సీనియర్ హీరోయిన్లు కనిపించేది కొద్ది సేపే అయినా వారి నటనానుభవం సినిమాకు హెల్పయింది.
సైకలాజికల్ థ్రిల్లర్...
సింబా మెసేజ్‌తో కూడిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. కథ విషయంలో కొన్ని లోపాలు ఉన్నా జగపతిబాబు, అనసూయ తో పాటు మిగిలిన యాక్టర్ల నటన సింబా మూవీని నిలబెట్టింది.
రేటింగ్: 2.5/5