Alia Bhatt: తల్లి కాబోతున్న అలియా...సోషల్ మీడియా ద్వారా వెల్లడి
అభిమానులకు రణ్బీర్ కపూర్(ranbir kapoor), అలియా భట్(alia bhatt) గుడ్ న్యూస్ వినిపించారు. తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు సోమవారం ప్రకటించారు. హాస్పిటల్ లోఉన్న ఓ ఫొటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
బాలీవుడ్ నాయిక అలియాభట్ తల్లికాబోతున్నది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా సోమవారం అలియా, రణ్బీర్ వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 14న రణబీర్కపూర్తో ఏడడుగులు వేసింది అలియా. సుదీర్ఘకాలం పాటు సాగిన ప్రేమబంధాన్ని పెద్దల అంగీకారంతో పెళ్లిపీటల పైకి తీసుకొచ్చారు ఈ జంట. ముంబైలోని రణబీర్ కపూర్ నివాసంలో నిరాడంబరంగా పెళ్లి వేడుక జరిగింది.
కాగా పెళ్లైన రెండున్నర నెలల్లోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు అలియా, రణ్బీర్ ప్రకటించి అభిమానులను సర్ ప్రైజ్ చేశారు. తాను తల్లికాబోతున్నట్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా సోమవారం వెల్లడించింది అలియా. భర్త రణ్బీర్తో కలిసి హాస్పిటల్ లో ఉన్న ఫొటోను పంచుకున్నది. ఇందులో బెడ్ పై అలియా భట్ పడుకొని ఉండగా ఆమె పక్కన రణ్బీర్ కూర్చొని ఉన్నాడు.
ఈ ఫొటోలో తమ పక్కనే ఉన్న కంప్యూటర్ స్ర్కీన్ వైపు చూస్తూ ఇద్దరు చిందిస్తూ కనిపించారు. ఆ స్ర్కీన్ పై లవ్ సింబల్ కనిపిస్తోంది. అవర్ బేబీ కమింగ్ సూన్ అంటూ అలియా ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొన్నది. ఈ జంటకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. రణ్బీర్ కపూర్, అలియా భట్ జంటగా నటిస్తున్న బ్రహ్మాస్త్ర సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.
సంబంధిత కథనం
టాపిక్