Ala Ninnu Cheri Movie Review: అలా నిన్ను చేరి రివ్యూ - హెబ్బా పటేల్ యూత్‌ఫుల్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే?
Ala Ninnu Cheri Movie Review: యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన అలా నిన్ను చేరి మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. దినేష్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో హెబ్బాపటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్లుగా కనిపించారు.
Ala Ninnu Cheri Movie Review: దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించిన అలా నిన్ను చేరి మూవీ శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు మారేష్ శివన్ దర్శకత్వం వహించాడు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే....
గణేష్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ...
విశాఖపట్నం సమీపంలోని ఓ పల్లెటూరికి చెందిన గణేష్‌కు (దినేష్ తేజ్) సినిమాలంటే మోజు. డైరెక్టర్ కావాలని కలలు కంటాడు. తమ ఊరికే చెందిన దివ్యతో (పాయల్ రాధాకృష్ణ)తో ప్రేమలో పడతాడు. వారి ప్రేమకు దివ్య తల్లి కనకమ్మ (ఝాన్సీ) అడ్డు చెబుతుంది. దివ్యను కాళీకి (శత్రు) ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది. ఆ పెళ్లి అడ్డుకొమ్మని దివ్య కోరినా గణేష్ పట్టించుకోడు. పెళ్లి కంటే కెరీర్ ముఖ్యమని హైదరాబాద్ వెళతాడు.
దివ్య దూరమైన తర్వాత గణేష్ జీవితంలోకి అను (హెబ్బాపటేల్) వస్తుంది? ఆమె ఎవరు? సినిమా డైరెక్టర్ కావాలనే గణేష్ కల నెరవేరిందా? కాళీతో దివ్య పెళ్లి జరిగిందా? ప్రాణంగా ప్రేమించిన దివ్యకు మరొకరితో పెళ్లి జరుగుతుంటే గణేష్ ఎందుకు అడ్డుచెప్పలేకపోయాడు? అను, దివ్యలలో గణేష్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అన్నదే అలా నిన్ను చేరి మూవీ కథ.
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్...
ప్రేమకు, లక్ష్యానికి మధ్య సంఘర్షణకు లోనయ్యే ఓ యువకుడి కథతో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు మారేష్ శివన్ అలా నిన్ను చేరి సినిమాను తెరకెక్కించాడు. ఓ యువకుడి జీవితంలోకి ఇద్దరు అమ్మాయిలు ఎలా వచ్చారు? కలలు నెరవేర్చుకునే క్రమంలో అతడు ఎదుర్కొన్న సవాళ్లేమిటి? అప్‌కమింగ్ డైరెక్టర్లకు ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితులు ఎదురువుతాయన్నది ఈ సినిమాలో చూపించాడు. ఫస్ట్ హాఫ్ విలేజ్ బ్యాక్‌డ్రాప్, సెకండాఫ్ సిటీ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.
విలేజ్ లవ్ స్టోరీలోని విజువల్స్ బాగున్నాయి. సినిమా మొత్తం సెల్‌ఫోన్స్ లేని టైమ్‌లో నడుస్తుంది. కాయిన్ బాక్స్‌ల కాలం నాటి ప్రేమకథ ఫ్రెష్ ఫీలింగ్‌ను కలిగిస్తుంది.
కత్తిమీద సాము
ప్రేమకథలతో ఆడియెన్స్‌ను మెప్పించడం కత్తిమీద సాములాంటింది. ఈ కథల్ని రొటీన్ ఫార్మెట్‌లో కాకుండా కొత్తగా చెప్పే నేర్పు దర్శకుడికి ఉండాలి. ఈ విషయంలో మారేష్ శివన్ కొంత వరకు మాత్రమే సక్సెస్ అయ్యాడు. కథగమనం చాలా చోట్ల నెమ్మదిగా సాగడం ఇబ్బంది పెడుతుంది. లక్ష్యం కోసం హీరో సాగించే జర్నీ చాలా సినిమాటిక్‌గా ఉంది. ఆ సీన్స్‌ను డెప్త్‌గా రాసుకుంటే బాగుండేది. అను, గణేష్ ట్రాక్ లో ఎమోషన్స్ సరిగ్గా పండలేదు.
నవతరం కుర్రాడిగా...
సినిమా డైరెక్టర్ కావాలని తపించే యువకుడి పాత్రలో దినేష్ తేజ్ నటన బాగుంది. నవతరం కుర్రాడి పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. హీరోయిన్లలో యాక్టింగ్ పరంగా హెబ్బాపటేల్‌కు ఎక్కువ మార్కులు పడతాయి. బోల్డ్ క్యారెక్టర్‌లో మెప్పించింది. పల్లెటూరి అమ్మాయిగా పాయల్ రాధ కృష్ణ తన లుక్స్‌తో ఆకట్టుకుంటుంది. ఝాన్సీ, ఛమ్మక్ చంద్ర, రంగస్థలం మహేష్ తమ పరిధుల మేర పాత్రలకు న్యాయం చేశారు.
బలాలు
దినేష్ తేజ్, హెబ్బాపటేల్ యాక్టింగ్
కాన్సెప్ట్
విలేజ్ లవ్ స్టోరీ
బలహీనతలు
రొటీన్ స్క్రీన్‌ప్లే
లెంగ్త్ ఎక్కువ కావడం
రేటింగ్: 2.5 /5