Elections Vs DBT Schemes: ఏపీలో రెండు కోట్ల మహిళా ఓటర్లు… మూడున్నర కోట్ల DBT లబ్దిదారులు..-two crore women voters in ap three and a half crore dbt beneficiaries ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Elections Vs Dbt Schemes: ఏపీలో రెండు కోట్ల మహిళా ఓటర్లు… మూడున్నర కోట్ల Dbt లబ్దిదారులు..

Elections Vs DBT Schemes: ఏపీలో రెండు కోట్ల మహిళా ఓటర్లు… మూడున్నర కోట్ల DBT లబ్దిదారులు..

Sarath chandra.B HT Telugu
Mar 27, 2024 11:26 AM IST

Elections Vs DBT Schemes: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో మహిళలకు అమలు చేసిన సంక్షేమ పథకాలు కీలకం కానున్నాయి. ఐదేళ్లలో మహిళా ఓటర్ల సంఖ్యకు రెట్టింపు సంఖ్యలో డిబిటి లావాదేవీలు జరగడం కీలకం కానుంది.

ఐదేళ్లలో మహిళల్ని ఆకట్టుకోవడమే లక్ష్యంగా డిబిటి పథకాలు అమలు
ఐదేళ్లలో మహిళల్ని ఆకట్టుకోవడమే లక్ష్యంగా డిబిటి పథకాలు అమలు

Elections Vs DBT Schemes: ఆంధ్రప్రదేశ్‌లో జరుగునున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. మహిళల్ని ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఐదేళ్ళుగా వైసీపీ Ysrcp అమలు చేసిన వ్యూహం ఫలిస్తుందా లేదా అన్నది చర్చగా మారింది. నవరత్నాలతో పాటు ఇతర పథకాల రూపంలో వైసీపీ ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన పథకాల్లో Welfare Schemes మహిళా లబ్దిదారులు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.

దేశ వ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ , సంక్షేమ పథకాలతోనే ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేసింది.

గత ఐదేళ్లుగా అమలుచేసిన పథకాలన్నింటిలో మహిళల్ని లక్ష్యంగా చేసుకుని ప్రత్యక్ష నగదు బదిలీ DBT Schemes పథకాలను అమలు చేశారు.ఏపీలో గత ఐదేళ్లలో అమలైన జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం,వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీతోఫా, ఇళ్ల పట్టాలు, జగనన్న తోడు రుణాలు వంటి పథకాల ద్వారా మహిళలకు నేరుగా లబ్ది చేకూర్చారు.

భారీగా మహిళా లబ్దిదారులు...

జగనన్న అమ్మఒడి పథకం ద్వారా రాష్ట్రంలో 44,48,865మంది మహిళలకు ఏటా రూ.15వేల రుపాయల నగదు బదిలీ అమలు చేశారు. వసతిదీవెప పథకంలో ఉన్నత చదువుల కోసం హాస్టళ్లలో ఉండే వారి కోసం 25,17,245మందికి పథకాన్ని వర్తింప చేశారు. జగనన్న విద్యా దీవెన పథకంలో 26,98,728మందికి ప్రయోజనం దక్కింది.

వైఎస్సార్ సున్నా వడ్డీ పథకంలో స్వయం సహాయక బృందాల్లో ఉన్న కోటి ఐదు లక్షల 13వేల 365మందికి లబ్ది కలిగింది. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 26,39,703 మందికి రూ.15వేల చొప్పున ఆర్ధిక సాయం అందించారు.

వైఎస్సార్ ఆసరా పథకంలో 78,94,169మందికి లబ్ది కలిగింది. వైఎస్సాఆర్ కాపు నేస్తంలో 3,58,613 మందికి నగదు బదిలీ చేశారు. ఈబీసీ నేస్తంలో 4,39,134 మందికి,కళ్యాణమస్తులో 56,194మందికి, ఇళ్ల పట్టాల రూపంలో మరో 31,19,000మందికి లబ్ది చేకూర్చారు.

3,46,85,016 మంది లబ్దిదారులు…..

ఇలా అన్ని రకాల పథకాల్లో కలిపి ఏకంగా మూడు కోట్ల 64లక్షల 85వేల 16మంది(3,46,85,016) మహిళలకు ఐదేళ్లలో నేరుగా లబ్ది అందుకున్నారు. వీరిలో ఒక్కొక్కరు రెండు మూడు పథకాల్లో అర్హత పొంది నగదు రూపంలో లబ్ది అందుకున్న వారు కూడా ఉన్నారు.

నగదు రూపంలో వారు అందుకున్న మొత్తం చూస్తే దాదాపు లక్షన్నర కోట్ల రుపాయలను నేరుగా మహిళలు బ్యాంకు ఖాతాల్లో అందుకున్నారు. మొత్తం 3,46,85,016 మందికి ఐదేళ్లలో రూ.1,68,264.08 కోట్లను నేరుగా బదిలీ చేశారు. ఒక్కో ఇంటికి సగటున ఒక్కో పథకం ద్వారా కనీసం రూ.50వేల ఆర్థిక ప్రయోజనం అందించారు. రెండు మూడు పథకాలు అందుకున్న వారికి లక్షకు పైగా లబ్ది చేకూరింది.

ఓటర్ల కంటే లబ్దిదారులే అధికం…

ఆంధ్రప్రదేశ్‌లో 2024 మార్చి 16నాటికి మొత్తం 4,09,37353మంది ఓటర్లుఉన్నారు. వీరిలో మహిళా ఓటర్లు 2,00,84,276మంది ఉన్నారు. సంక్షేమ పథకాల రూపంలో ఏపీ ప్రభుత్వం ఐదేళ్లలో మూడున్నర కోట్ల లావాదేవీలను కేవలం మహిళలే లక్ష్యంగా డిబిటి పథకాల రూపంలో అందించింది. ఒక్కో ఇంట్లో రెండు మూడు పథకాలకు డిబిటి స్కీమ్స్ అందడంతో ఓటర్ల సంఖ్య కంటే లబ్దిదారుల సంఖ్య రెట్టింపుగా ఉంది.

పథకాలు అందని పన్ను చెల్లింపుదారులు, వివిధ కారణాలతో పథకాలు వర్తించని వారు,ఉద్యోగులు, వేతన జీవుల్ని మినహాయిస్తే దాదాపు మహిళా ఓటర్లలో 85 నుంచి 90శాతం మందిని లక్ష్యంగా చేసుకుని డిబిటి పథకాలను అమలు చేశారు. ఎన్నికల పోలింగ్‌లో ఈ పథకాలు ఏ మేరకు ప్రభావం చూపిస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఐదేళ్లలో అమలు చేసిన పథకాలకు పోటీకి టీడీపీ కూటమి కూడా నగదు బదిలీ పథకాలనే నమ్ముకుని హామీలిస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం